- రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధ పాలనతో ధర్మపురి నియోజకవర్గంలో వరి పంటలు ఎండుతున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు.
వరంగల్ వాయిస్, ధర్మారం : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధ పాలనతో ధర్మపురి నియోజకవర్గంలో వరి పంటలు ఎండుతున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని నంది రిజర్వార్‌కు అనుబంధంగా నిర్మిస్తున్న లింక్ కాల్వ పనులు మధ్యలో నిలిచిపోయాయి. దీంతో సోమవారం ధర్మారం, ఎండపల్లి, వెల్గటూరు మండలాలల్లోని కాల్వ చివరి గ్రామాల రైతులు, పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో మూడు సంవత్సరాల క్రితం మల్లాపూర్ నుంచి వెల్గటూరు మండలంలోని చివరి గ్రామాలకు సాగునీటికి శాశ్వత పరిష్కారం అందించడానికి రూ.13 కోట్ల నిధులను మంజూరు చేయించామన్నారు. ఆ నిధులతో నంది రిజర్వాయర్ నుంచి రెండున్నర కిలోమీటర్ల పాటు లింకు కాలువ పనులు ప్రారంభించగా దాదాపు 90 శాతం పూర్తయిందని ఆయన వివరించారు. కానీ మిగతా కేవలం 10 శాతం పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయించడం లేదని విమర్శించారు.
ఈ ప్రాంతానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాల్వ పూర్తి చేయిం చడానికి శ్రద్ధ వహించడం లేదని ఆరోపించారు. లక్ష్మణ్ కుమార్‌కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా లింక్ కాలువ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆయన సవాల్ చేశారు. అదేవిధంగా సారంగాపూర్ మండలంలోని రోళ్ల వాగు పనులు పూర్తి చేయాలన్నారు. తనను విమర్శించే నైతికత లక్ష్మణ్ కుమార్‌కు లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆయన అన్నారు. రైతులకు సాగునీరు ఇవ్వని అసమర్ధ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని విమర్శించారు.
