- దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
- స్వగృహంలో పుష్పాంజలి ఘటించిన మంత్రి
వరంగల్ వాయిస్, వరంగల్ : మహిళా సాధికారతకు పర్యాయపదం సావిత్రీబాయి ఫూలే అని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సావిత్రీబాయి ఫూలే 194వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని తన నివాసంలో మంత్రి కొండా సురేఖ పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. మహిళలపై తీవ్ర అణచివేత, వివక్ష కొనసాగుతున్న ఆ కాలంలోనే మహిళల విద్య కోసం, స్త్రీజాతి విముక్తి కోసం పోరాడి ధీరవనితగా ఫూలే అని కొనిడాయాడారు. అనాథ పిల్లలు, స్త్రీలకు శరణాలయాలు, ఆశ్రమాలు నెలకొల్పడంతో పాటు సాంఘిక దురాచారాల నిర్మూలనకు, సమాజ ఉద్ధరణకు తన జీవితాన్ని అర్పించిన త్యాగశీలిగా ఈ ప్రపంచం సావిత్రీబాయి ఫూలేని గుండెల్లో పెట్టుకుంటుందన్నారు. మహిళలకు స్వేచ్ఛ లభిస్తే ఈ ప్రపంచానికి బానిసత్వం నుంచి విముక్తి లభించినట్టేనని భావించిన కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి వారికి సమాన అవకాశాలు, సాంఘిక, ఆర్థిక, రాజకీయ హక్కులను కల్పించేందుకు కట్టుదిట్టమైన కార్యాచరణను అమలు చేస్తున్నదని మంత్రి సురేఖ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అవలంబించిన విధానాలే నేడు స్త్రీలు అన్ని రంగాల్లో రాణించేందుకు భూమికను ఏర్పరిచాయని స్పష్టం చేశారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మహిళల స్వయం సాధికారత దిశగా అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయని వెల్లడించారు. సావిత్రిబాయి ఫూలే జయంతిని తెలంగాణ రాష్ట్రంలో మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించడం పట్ల మంత్రి సురేఖ హర్షం వ్యక్తం చేశారు. స్త్రీవాదం పట్ల, మహిళల అభ్యున్నతి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికికున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు.
మంత్రికి శుభాకాంక్షలు..
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సెక్రటేరియట్ లో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖను వారి కార్యాలయంలో పీసీసీఎఫ్ (హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్ఎం డోబ్రియాల్, పీసీసీఎఫ్ (వైల్డ్ లైఫ్) ఏలుసింగ్ మేరు, పీసీసీఎఫ్ (కంపా) సువర్ణ తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
కలెక్టరేట్ లో ఘనంగా పూలే జయంతి
వరంగల్ వాయిస్, హనుమకొండ: దేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఫూలే జయంతిని శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకాగా హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, డీఈవో వాసంతి, మహిళా ఉపాధ్యాయులు, కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన మహిళా ఉపాధ్యాయులను శాలువాలు, జ్ఞాపికలతో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ తదితరులు ఘనంగా సన్మానించారు.
వరంగల్ లో..
వరంగల్ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం విద్యా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలలో కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొని వారి చిత్ర పటానికి పులాల సమర్పించి నివాళులర్పించారు.