చెరువు కట్ట తెగి మూడేళ్లు..
ఇప్పటికీ పూర్తికాని మరమ్మతు పనులు
2వేల ఎకరాల ఆయకట్టుకు నీరందని దుస్థితి
నాసిరకంగా పనులు.. పట్టించుకోని అధికారులు
వరంగల్ వాయిస్, వర్ధన్నపేట: మండలం కేంద్రంలో రైతులకు పెద్దదిక్కు అయినా కోనారెడ్డి చెరువు కట్ట తెగిపోయి మూడు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ మరమ్మతులు పూర్తి కాకపోవడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువు కింద ఆయకట్టు 2000 ఎకరాలు ఇప్పుడు పంట పండించలేని స్థితిలో ఉన్నా కూడా ప్రభుత్వం కోనారెడ్డి చెరువు పనులను చేపట్టిన దాఖలాలు కనిపించడం లేదు.
తూతూ మంత్రంగా పనులు
కోనారెడ్డి చెరువు కట్ట కాంట్రాక్టు పనులు చేస్తున్న సంస్థలు పనులను చేపట్టి చేతులు దులుపుకొని పోతున్నాయి తప్ప రైతులకు మేలు చేకూర్చే విధంగా పనులను ముందుకు తీసుకెళ్లడంలో కాంట్రాక్టర్లు విఫలమయ్యారని రైతులు ఆరోపిస్తున్నారు. గత సంవత్సరం చెరువు కట్ట రిపేరు కోసం దాదాపు రూ.40 లక్షల కాంట్రాక్టులను దక్కించుకున్న కాంట్రాక్టర్లు నాసిరకంగా పనులు చేపట్టి చేతులు దులుపుకొని వెళ్లడం జరిగింది కానీ ఇంత జరుగుతున్న ఇరిగేషన్ శాఖ అధికారులు వాటిపై దృష్టి సారించకపోవడం అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి కాంట్రాక్టర్లపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా వారికి బిల్లులు చెల్లించే కార్యక్రమాన్ని ముగించి వేశారు.
మంత్రిగారి మాటలు నీటి మూటలేనా
గత మే నెలలో మంత్రి హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు.. దాదాపు రూ.14 కోట్ల పనుల కోసం శంకుస్థాపనలు చేసి ఎంతో గొప్పగా పనులను చేపడుతున్నట్లు డబ్బాలు కొట్టుకొని వచ్చే మూడు నెలల్లో కట్ట నిర్మాణాలను పూర్తి చేసి వర్షాకాలం నాటికి పనులను పూర్తి చేసి రైతులకు నీరు అందిస్తామని చెప్పిన మాట నిలుపుకోవడంలో విఫలమయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వృథాగా పోతున్న నీరు
గత నెల రోజులుగా కొడుతున్న వర్షాలకు చెరువులోకి వస్తున్న నీరును తూమును తెంపి కిందికి వదలడం వల్ల రైతులకు ఎటువంటి లాభం లేకపోవడంతో పాటు ఆ వరద నీటితో రైతుల పొలాల్లో ఇసుకమేటలు ఏర్పడి రైతులకు ఎంతో నష్టం జరుగుతున్న ఆవైపు కన్నెత్తి చూసిన అధికారులు, ప్రజాప్రతినిధులు లేరని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వర్ధన్నపేట మున్సిపాలిటీ కేంద్రంలో అధికారంలో ఉండి కోనారెడ్డి చెరువు పనులు తొందరగా చేపట్టకపోవడం వల్ల రైతుల ఆగ్రహాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం చవిచూడక తప్పదని రైతులు అంటున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరువాలి..
బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి సంపత్ రెడ్డి : కోనారెడ్డి చెరువు పనులను తొందరగా పూర్తి చేసి రైతులకు న్యాయం చేకూర్చే విధంగా ప్రభుత్వం పని చేయాలి. అదేవిధంగా ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. రైతులకు నష్టపరిహారం చెల్లించే విధంగా అధికారులు పనులు చేపట్టాలి.



