- Kodad | : నిరుపేదలకు వైద్య సేవలు అందించాల్సిన కోదాడలోని 30 పడకల దవఖాన వైద్యుల కొరతతో కునారిల్లుతుంది. ఈ దవాఖానాను వంద పడకల ఆస్పత్రిని చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో గొప్పలు చెప్పింది.. ముగ్గురు మంత్రులు వెళ్లి ఆస్పత్రి పనులకు శంకుస్థాపన చేశారు.
వరంగల్ వాయిస్, కోదాడ : నిరుపేదలకు వైద్య సేవలు అందించాల్సిన కోదాడలోని 30 పడకల దవఖాన వైద్యుల కొరతతో కునారిల్లుతుంది. ఈ దవాఖానాను వంద పడకల ఆస్పత్రిని చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో గొప్పలు చెప్పింది.. ముగ్గురు మంత్రులు వెళ్లి ఆస్పత్రి పనులకు శంకుస్థాపన చేశారు. వంద రోజుల్లోనే ఆస్పత్రి పనులను ప్రారంభిస్తామని చెప్పారు. కానీ ఏడాది పూర్తయినా ఇప్పటివరకు అక్కడ తట్టెడు మట్టి పోసింది లేదు. పైగా దీన్ని వంద పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయడం పక్కనబెడితే.. అసలు ఆస్పత్రిలో ఉండాల్సిన కనీస వైద్యులను కూడా రిక్రూట్ చేయడంలో కాంగ్రెస్ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. దీంతో 16 మంది వైద్యులు విధులు నిర్వహించాల్సిన ఈ ఆస్పత్రిలో కేవలం నలుగురు వైద్యులు మాత్రమే సేవలందిస్తున్నారు.
కోదాడ నియోజకవర్గంలోని ఆరు మండలాలతో పాటు హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని మేళ్లచెరువు చెందిన ప్రజలు కూడా వైద్య సేవ నిమిత్తం ఈ దవఖానాకే వస్తూ ఉంటారు.. కానీ వారికి తగ్గట్టుగా వైద్యులు మాత్రం లేరు. దీంతో నిరుపేద రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. డాక్టర్లు లేకపోవడంతో బోలెడన్నీ డబ్బులు పెట్టి ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తుంది. ముగ్గురు ప్రసూతి వైద్యులు సేవలందించాల్సిన చోట ఒక్కరే ఉండటంతో నిరుపేద కుటుంబాలుగా చెందిన గర్భిణులు గత్యంతరం లేక వేలాది రూపాయల ఖర్చుతో ప్రైవేటు దవఖానాలను ఆశ్రయించాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత ప్రభుత్వ హయాంలో ప్రసూతి వార్డులు తల్లీపిల్లలతో కళకళలాడుతుండగా.. నేడు గర్భిణీలు ఇక్కడికి ప్రసూతికి రాకపోవడంతో వెలవెలపోతున్నాయి.. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కిట్‌తో పాటు, ఆడపిల్ల పుడితే 11వేలు మగపిల్లాడికి పది వేల రూపాయలు ఆర్థిక ప్రోత్సాహం ఇచ్చి సాధారణంగా ఇంటికి పంపేవారని.. ఇప్పుడు అప్పులు చేసి ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తుందని ప్రజలు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు..
వంద పడకల దవఖానాకు శిలాఫలకం వేసి ఏడది దాటే..!!
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 100 పడకల దవఖానకు జీవో ఇవ్వడంతో పాటు 29 కోట్లు మొదటి దఫాగా మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి ముగ్గురు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహా, తుమ్మల నాగేశ్వరరావు శిలాఫలకం వేశారు. వంద రోజుల్లో పనులు ప్రారంభమిస్తామని హామీ ఇచ్చారు. ఇది జరిగి దాదాపు ఏడాది పూర్తయ్యింది. కానీ ఇప్పటివరకు తట్టెడు మట్టిగానీ, సిమెంటు గానీ వేయలేదు.. దీనిపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చేతులెక్కి మొక్కుతున్నాం.. ప్రసూతి వైద్యుల పోస్టులను భర్తీ చేయండి
100 పడకల దవఖాన దేవుడెరుగు.. కాన్పుల కోసం ప్రైవేటు దవఖానాలను ఆశ్రయించాల్సి వస్తుందని స్థానికులు చేతులెత్తి మొక్కారు. తక్షణమే జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన సతీమణి పద్మావతి ఔదార్యంతో ఇరువురు ప్రసూతి వైద్యులను, ఒక ఎముకల వైద్యుడిని భర్తీ చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు.
