- సీఎం రేవంత్ రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించిన మహిళా జర్నలిస్టుకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. ఈ మేరకు జర్నలిస్టు రేవతిపాటు మరో మహిళను చంచల్ గూడ జైలుకు తరలించారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన మహిళా జర్నలిస్ట్ రేవతికి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రేవతితోపాటు బండి సంధ్యను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. వారిద్దరికీ ఈనెల 26 వరకూ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. విచారణ సందర్భంగా రేవతి రిమాండ్‍ను రిజక్ట్ చేయాలని ఆమె తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. అయితే ఉద్దేశపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించారని, ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారంటూ న్యాయమూర్తి దృష్టికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీసుకెళ్లారు. రేవతిపై కఠిన చర్యలు తీసుకోవాలని వాదనలు వినిపించారు. పీపీ వాదనలకు ఏకీభవించిన న్యాయస్థానం రేవతితోపాటు బండి సంధ్య రిమాండ్ విధించింది. ఈ మేరకు వారిద్దరినీ జైలుకు తరలించారు.
అసలేం జరిగిందంటే..
సీఎం రేవంత్ రెడ్డిని కించపరిచిన కేసులో సీనియర్ మహిళా జర్నలిస్టు రేవతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ (బుధవారం) తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో రేవతి ఇంటికి వెళ్లిన 12 మంది పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో రేవతి ఫోన్, ఆమె భర్త, దర్శకుడు చైతన్య దంతులూరి ఫోన్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఆమెకు చెందిన పల్స్ యూట్యూబ్ ఆఫీస్‌ను సైతం పోలీసులు సీజ్ చేశారు. రైతు బంధు రావట్లేదని ఓ రైతు మాట్లాడిన వీడియోను ప్రసారం చేస్తూ ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో ఆమెను అరెస్టు చేశారు.
కేటీఆర్ ఫైర్..
సీనియర్ మహిళా జర్నలిస్టు రేవతి అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ఉదయం 5 గంటలకు ఇంటిపై దాడి చేసి జర్నలిస్టును అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఎమర్జెన్సీ తరహా పాలనకు ఈ ఘటనే నిదర్శనమంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్వీట్ చేశారు. మరో యువ జర్నలిస్టు తన్వి యాదవ్‌ను సైతం అరెస్టు చేయడంపైనా ఆగ్రహించారు. కాంగ్రెస్ సర్కారులో ఓ రైతు తాను ఎదుర్కొంటున్న కష్టాలను చెబితే.. ఆ వీడియోను పోస్టు చేసిన జర్నలిస్టులను అరెస్ట్ చేయడం కాంగ్రెస్ నిర్బంధ పాలనకు పరాకాష్టని మండిపడ్డారు కేటీఆర్. ప్రజా పాలనలో మీడియాకు స్వేచ్ఛ అనేదే లేకుండా పోయిందని ఆరోపించారు. రాహుల్ గాంధీ చెబుతున్న రాజ్యాంగబద్ధ పాలన ఇదేనా? అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మీడియా, సోషల్ మీడియా గొంతుకలపై చేస్తున్న దాడులు, అక్రమ కేసులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.
