- John Wesley | కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్షంతో వరి పంటలు ఎండుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు.
వరంగల్ వాయిస్, జనగాను : కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్షంతో వరి పంటలు ఎండుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ(John Wesley )అన్నారు. సోమవారం జనగామ జిల్లాలోని చిన్న రాంచర్ల, గానుగు పహాడ్, వడ్లకొండ గ్రామాల్లో సాగు నీరు అందక ఎండిపోయిన పంట పొలాలను జాన్ వెస్లీ స్వయంగా పరిశీలించారు. అనంతరం జిల్లా కేంద్రంలోవిలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వానికి, అధికారులకు ముందు చూపు లేకపోవడం వల్ల దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా జిల్లాలోని 8 రిజర్వాయర్లు ,769 చెరువులు, కుంటలకు అవసరమైన సాగునీటిని నింపలేకపోయారని విమర్శించాడు.
పంటలకు ప్రాణం పోసిన బీఆర్‌ఎస్..
ఈ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సకాలంలో రైతులకు అవసరమైన సాగునీటిని ప్రతి సంవత్సరం దేవాదుల ద్వారా రైతులకు అందించి పంటలు ఎండిపోకుండా కాపాడిందన్నారు. ప్రస్తుతం జిల్లాలో లక్షా 60 వేల ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేసినట్లు తెలిపారు. ఒక్కో ఎకరానికి సుమారు రూ.30 వేల వరకు రైతులు పెట్టుబడి పెట్టినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం సకాలంలో సాగు నీరు వదలక పోవడంతో జిల్లాలో 40 మంది 45 శాతం మేరకు వరి పంట పూర్తిగా ఎండిపోయిందన్నారు. జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోయి 8 మీటర్ల లోతులోకి వెళ్లిపోయినట్లు తెలిపారు.
చిత్తశుద్ధి ఉంటే నీళ్లివ్వాలి..
మరో వారం రోజుల్లోపు దేవాదుల ద్వారా జిల్లాలోని రిజర్వాయర్లకు, చెరువులు, కుంటలకు ప్రభుత్వం సాగు నీరు విడుదల చేయకుంటే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వానికి నిజంగా రైతులపట్ల చిత్తశుద్ధి ఉంటే వారం రోజుల్లోపు ఎండుతున్న పంట పొలాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎండిపోయిన పంట పొలాల రైతులకు ప్రతి ఎకరానికి ప్రభుత్వం తరపున రూ.30 వేల నష్టపరిహారం చెల్లించాలని కోరారు.
లేదంటే రైతుల పక్షాన సీపీఎం అధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఎండుతున్న పంట పొలాలపై రైతులతో కలిసి ఈ నెల 13వ తేదీన జిల్లా కలెక్టరేట్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ అబ్బాస్, జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, నాయకులు రాపర్తి రాజు, ఇర్రి ఆహల్య, సాంబరాజు యాదగిరి, జోగు ప్రకాశ్, సుంచు విజేందర్, ఉపేందర్, దేవదానం, సౌందర్య, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
