- Jogulamba Temple | దేశంలో ప్రసిద్ధిగాంచిన శక్తి పీఠాలలో ఒకటైన అలంపూర్ జోగులాంబ మాత ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారంటూ ఆలయ ఈవో, ప్రధాన అర్చకునిపై పలువురు ఫిర్యాదులు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
వరంగల్ వాయిస్, జోగులాంబ గద్వాల : దేశంలో ప్రసిద్ధిగాంచిన శక్తి పీఠాలలో ఒకటైన అలంపూర్ జోగులాంబ మాత ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారంటూ ఆలయ ఈవో, ప్రధాన అర్చకునిపై పలువురు ఫిర్యాదులు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆలయ భూముల అన్యాక్రాంతం, భక్తుల నుంచి వచ్చే కానుకలు, నగదును మాయం చేస్తున్నారని గత కొన్ని నెలలుగా జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదులు అందాయి.
ఆలయ ఈవో బాగోతం ఇదీ..
ఆలయ ఈవో పురేందర్ అలంపూర్ జోగులాంబ ఆలయంతో పాటు, గద్వాల జమ్ములమ్మ ఆలయ ఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈయన గత కొన్ని సంవత్సరాలుగా ఆలయ ఆదాయానికి సంబంధించి ఆడిట్ నిర్వహించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. భక్తుల నుండి వచ్చే కానుకలు, నగదు లెక్క పత్రం లేకుండా తీసుకొని, మౌలిక సదుపాయాలు కల్పించకుండా దోపిడీలకు పాల్పడుతున్నారని ఎన్ఎస్‌యూఐ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ రాష్ట్ర విజిలెన్స్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అధికారి పేర్కొన్నారు.
ప్రధాన పూజారి కథ ఇదీ..
ఆ మధ్య కర్నూల్‌లో తన భార్యాపిల్లలతో సినిమాకు వెళ్లిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడుకు సంబంధించిన ఫోటోలను ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ ఫోటోలు తీయడం.. అందుకు ఎమ్మెల్యే అభ్యంతరం చెప్పడం.. ఇరువురి మధ్య పెద్ద ఎత్తున జరిగిన వాదన రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే విజయుడు ఆనంద్ శర్మపై కర్నూల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడంతో పాటు.. దేవదాయ శాఖ రాష్ట్ర, జిల్లా అధికారులకు, జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్‌కు, అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు విచారణ కూడా జరిగినట్లు సమాచారం. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఆనంద్ శర్మపై చర్యలు తీసుకోవాలని ఇటీవల పలువురు అర్చకులు రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ కార్యాలయం వద్దకు చేరుకొని ఆందోళన నిర్వహించారు. ఆనంద్ శర్మపై చర్యలు తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులపై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదికలను ఉన్నతాధికారులకు పంపినట్లు తెలుస్తోంది. మొత్తంపై జోగులాంబ మాత ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
