- Jagadish Reddy | ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం దురదృష్టకరమని మాజీ మంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు. 8 మంది కార్మికులు ఇంకా టన్నెల్‌లోనే చిక్కుకుని ఉన్నారని తెలిపారు. వారి ప్రాణాలను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు.
Jagadish Reddy | ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం దురదృష్టకరమని మాజీ మంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు. 8 మంది కార్మికులు ఇంకా టన్నెల్‌లోనే చిక్కుకుని ఉన్నారని తెలిపారు. వారి ప్రాణాలను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సోమవారం నాడు జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టన్నెల్‌లో చిక్కుకున్న వారంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారే అయినప్పటికీ.. తెలంగాణ పునర్నిర్మాణంలో బయట రాష్ట్రాల కార్మికుల పాత్ర ఎంతో ఉందని పేర్కొన్నారు.
తెలంగాణలో దాదాపు 35 లక్షల మంది బయటి రాష్ట్రాల కార్మికులు పనిచేస్తున్నారని జగదీశ్ రెడ్డి తెలిపారు. కరోనా కాలంలో కార్మికులు మన రాష్ట్రం వారా.. పరాయి రాష్ట్రం వారా అనేది కేసీఆర్ చూడలేదని గుర్తుచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదేవిధంగా ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ఉన్న ఇతర కార్మికుల ప్రాణాలను రక్షించడం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. కార్మికులను రక్షించడంలో చేయాల్సిన పనులు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డికి కార్మికుల ప్రాణాల కంటే కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారమే ముఖ్యమైనదని జగదీశ్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రికి మానవత్వం లేదని మండిపడ్డారు. మంత్రులకు ఫొటోలపై ఉన్న శ్రద్ధ.. కార్మికుల ప్రాణాలను కాపాడటంలో లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవర్తన అత్యంత అభ్యంతరకరంగా ఉందని అన్నారు. టన్నెల్‌లో చిక్కుకుపోయిన 8 మంది కార్మికుల ప్రాణాల గురించి తెలంగాణ ప్రజలు ఆతృతగా ఆరా తీస్తున్నారని.. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తోలుమందంతో వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
ఈ దుర్ఘటనపై బీఆర్‌ఎస్ రాజకీయాలు చేయడం లేదని జగదీశ్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రే ఓట్ల కోసం బయల్దేరి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వెళ్లలేదని తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి మాట్లాడారని చెప్పారు తప్ప.. మోదీని రక్షణ చర్యల గురించి అడిగినట్లు ఎక్కడా వెల్లడించలేదని అన్నారు. మీడియాకు రకరకాల లీకేజీలు ఇస్తున్నారు గానీ.. అసలు వాస్తవాలు ఏంటో వెల్లడించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
టన్నెల్ తవ్వేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని జగదీశ్ రెడ్డి అన్నారు. సీపేజీ ఆగకపోవడం వల్లే గతంలో పనులు ముందుకు సాగలేదని వివరించారు. అసలు ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు ఒక పెద్ద కుట్ర అని విమర్శించారు. నల్గొండ ప్రజలకు కృష్ణా నీళ్లు రాకుండా చేయాలని గత సమైక్య పాలకులు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టును చేపట్టారని తెలిపారు. నల్గొండ కాంగ్రెస్ నేతలు నోరు మూసుకుపోవడం వల్లే ఎస్‌ఎల్‌బీసీ తెరపైకి వచ్చిందని అన్నారు. చిమ్మ చీకట్లో ఆక్సిజన్ సరిగ్గా ఇవ్వకుండా టన్నెల్‌లో కార్మికులతో పనులు చేయించారని తెలిపారు.
తాను పాలమూరు బిడ్డను అని.. తనను కాపాడుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని జగదీశ్ రెడ్డి గుర్తుచేశారు. ఆయన్ను ఎందుకు కాపాడుకోవాలని ప్రశ్నించారు. ప్రమాదం జరిగితే అక్కడికి వెళ్లకుండా.. ప్రచారానికి వెళ్లున్న సీఎంను పాలమూరు బిడ్డలు కాపాడుకోవాలా అని నిలదీశారు. ఈ సమయంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రజల ప్రాణాలు అంటే ముఖ్యమంత్రికి లెక్కేలేదని మండిపడ్డారు. జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో మాట్లాడి కార్మికుల ప్రాణాలు కాపాడాలని కోరారు. తన అమానవీయ ప్రవర్తనకు సీఎం రేవంత్ రెడ్డి కార్మికులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
