- బల్దియాలో నేను చెప్పిందే వేదం
- ఇతరులెవరూ ఎదగకుండా పక్కా ప్లాన్
- డిప్యూటీ మేయర్‌పై చిన్నచూపు
- సంవత్సరం దాటినా కారు, క్యాంపు క్లర్కే లేరు
- నేటికీ స్టాండింగ్ కమిటీ ఊసే లేదు
- ఫ్లోర్ లీడర్లు లేరు.. ఆయా పార్టీలకు గదుల కేటాయింపూ లేదు..
రాజకీయాల్లో అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కార్పొరేటర్‌గా గెలిచిన తర్వాత సీనియర్లు ఎవరైనా ఉంటే మేయర్, డిప్యూటీ మేయర్ కావాలనుకోవడం కామన్. కానీ, అందరికీ ఆ చాన్స్ రాదు. మరీ ఈ రెండు కుదరకపోతే ఉన్న నెక్ట్స్ ఆప్షనే స్టాండింగ్ కమిటీ మెంబర్. మిగిలిన కార్పొరేటర్ల తాపత్రయం అంతా దానిపైనే ఉంటుంది. కాని వరంగల్ మహా నగరపాలక సంస్థ పరిధిలో ఆ అవకాశమే లేకుండా చేస్తున్నారు. పాలక వర్గం ఏర్పడి సంవత్సరంన్నర గడిచినా నేటికీ స్టాండింగ్ కమిటీ ఏర్పాటుపై ఊసే లేదు. బల్దియాలో నేనే సుప్రీమ్..నేను చెప్పిందే వేదం అన్నట్లు వ్యవహరిస్తున్న మేయర్ గుండు సుధారాణి స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేస్తే నిర్ణయాలన్నీ అక్కడే తీసుకోవాల్సి ఉంటుందన్న అభిప్రాయంతోనే దానిని పక్కన పెట్టినట్లు సమాచారం.
-వరంగల్ వాయిస్, వరంగల్ ప్రతినిధి
వరంగల్ వాయిస్, వరంగల్ ప్రతినిధి: మహా నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి కోసం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా స్టాండింగ్ కమిటీ ఆమోదం తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. ఒక రకంగా స్టాండింగ్ కమిటీ మెంబర్ అంటే కీలక నిర్ణయాల్లో భాగస్వాములయ్యే అవకాశం పొందినట్టుగా భావిస్తారు. మున్సిపల్ చట్టం ప్రకారం 10 మంది కార్పొరేటర్లకు ఒక స్టాండింగ్ కమిటీ సభ్యుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన 66 మంది కార్పొరేటర్లకు ఏడుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎన్నికవుతారు. ప్రస్తుతం సభలో 49 మంది టీఆర్ఎస్, 10 మంది బీజేపీ, నలుగురు కాంగ్రెస్, ముగ్గురు ఇండిపెండెంట్ సభ్యులున్నారు. దీని ఆధారంగా ఐదు లేదా ఆరుగురు టీఆర్ఎస్, ఒక బీజేపీ కార్పొరేటర్‌కు స్టాండింగ్ కమిటీలో అవకాశం దక్కనుంది. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీలో మరో ఆరుగురికి పదవులు దక్కే అవకాశం ఉన్నా మేయర్ మొండిగా వ్యవహరిస్తూ అసలు స్టాండింగ్ కమిటే అవసరం లేదన్నట్లుగా వ్యవహరించడంపై అధికార పార్టీ కార్పొరేటర్లు సైతం మండిపడుతున్నారు. నేనే సుప్రీమ్..నేను చెప్పినట్లే అందరూ వినాలి అన్నట్లు ఆమె వ్యవహరించడం ఎవరికీ మింగుడుపడడం లేదు.
డిప్యూటీ మేయర్‌పై చిన్నచూపు..
వరంగల్ తూర్పు ఎమ్మెల్యేకు దగ్గరగా ఉంటున్నారన్న నెపంతో డిప్యూటీ మేయర్‌పై ఆమె ఆగ్రహం పెంచుకుంది. బల్దియాలో మేయర్ తర్వాత అంతటి ప్రాధాన్యం దక్కాల్సివున్న ఆ స్థానాన్ని చిన్నదిగా చేసి సాదా సీదా కార్పొరేటర్ స్థాయిలోనే చూశారు. ప్రోటోకాల్ ప్రకారం డిప్యూటీ మేయర్‌కు బల్దియా ఆధ్వర్యంలో కారును ప్రొవైడ్ చేయాల్సి ఉన్నా పట్టింపులేకుండా వ్యవహరించారు. ముక్తసరిగా ఆమెకు గ్రేటర్ ప్రధాన కార్యాలయంలో ఒక గది కేటాయించారు తప్ప అటెండర్, సీసీని ఏర్పాటు చేయాలన్న కనీస విచక్షణను పాటించలేదు. ఈ విషయంలో ఎమ్మెల్యే కలుగజేసుకొని గుర్తు చేశాకే కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ఎజెండాగా చేర్చారు. ఇది కూడా వివాదంగానే మారింది. మునిసిపల్ చట్టం ప్రకారం ఎలాంటి ఎజెండా లేకుండానే మేయర్, డిప్యూటీ మేయర్‌లకు బల్దియా కారు సదుపాయం కల్పించాల్సి ఉంటుంది. కాని ఒక్క డిప్యూటీ మేయర్ కారు విషయంలోనే ఎజెండా అంశంగా చేర్చడంపై మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సైతం కౌన్సిల్ సాక్షిగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది పద్ధతి కాదంటూ హెచ్చరించారు. ఎవరైనా మునిసిపల్ చట్టం ప్రకారమే వ్యవహరించాల్సి ఉంటుందని గుర్తు చేశారు.
ఫ్లోర్ లీడర్లు..ఎక్స్అఫిషియో సభ్యులెక్కడ..
కొత్త పాలక వర్గం బాధ్యతలు చేపట్టి 15నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఫ్లోర్ లీడర్లు..ఎక్స్అఫిషియో సభ్యుల ఎంపికనే పూర్తి చేయలేదు. గతంలో ప్రతి పార్టీ నుంచి ఒక ఫ్లోర్ లీడర్‌ను ఎంపిక చేసి వారి ఆధీనంలోనే ఆయా పార్టీల సభ్యులు కార్యక్రమాలు నిర్వహించేవారు. ఫ్లోర్ లీడర్‌కు ప్రత్యేక గుర్తింపు నివ్వడంతోపాటు వారికి బల్దియా ప్రధాన కార్యాలయంలో ఒక గదిని కూడా కేటాయించేవారు. ఆయా పార్టీలకు చెందిన కార్పొరేటర్లు వారి ఫ్లోర్ లీడర్‌కు కేటాయించిన గదిలో సమావేశాలు నిర్వహించుకోవడం, కౌన్సిల్ సమావేశాల్లో ఏ విధంగా వ్యవహరించాలనే నిర్ణయాలు తీసుకునేవారు. నేడు అధికార పార్టీ మినహా ప్రతిపక్ష పార్టీలను పట్టించుకునేవారే లేకుండా పోయారు. దీనికితోడు గతంలో కార్పొరేటర్లుగా విధులు నిర్వహించిన సీనియర్ నాయకులను ఎక్స్ అఫిషియో సభ్యులుగా నియమించేవారు. దీనికికూడా ప్రస్తుత పాలకవర్గం తిలోదకాలు పలికారనే చెప్పవచ్చు. ఈ పదవులపై ఎంతో మంది ఆశ పెట్టుకున్నా వారి ఆశలు అడియాశలు అవుతున్నాయి తప్ప ఆ దిశగా అడుగులు పడడంలేదు.
ఇతరులెవరూ ఎదగకుండా పక్కా ప్లాన్..
బల్దియాలో ఇతరులెవరూ ఎదగకుండా మేయర్ పక్కా ప్లాన్ వేసినందునే స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో స్టాండింగ్ కమిటీ ఉన్నప్పటికీ వరంగల్‌లో మాత్రం దాని అవసరం లేదంటూ అంతా తానే అన్నట్లు వ్యవహరించడంపై పలువురు కార్పొరేటర్లు మండిపడుతున్నారు. స్టాండింగ్ కమిటీ ఏర్పాటుతో బల్దియాలో జరిగే అవినీతి అక్రమాలు బయటపడుతాయన్న భయంతోనే దానిని అటకెక్కించారని వారు పేర్కొంటున్నారు.