- సెంటిమెంటుగా భావిస్తున్న నేతలు
- ఎన్టీఆర్‌తో శ్రీకారం.. వైఎస్ తో వైభవం
- రాష్ట్రంలో కొనసాగుతున్న వైఎస్ శర్మిల, ప్రవీణ్ కుమార్ పాదయాత్ర
- అత్యధిక రోజులు పాదయాత్ర చేసిన జగన్
- నేడు యాదాద్రిలో మూడో విడత ప్రారంభించిన బండి సంజయ్
రాష్ట్రంలో పాదయాత్రల జోరు కొనసాగుతోంది. అధికారమే లక్ష్యంగా పాదయాత్రలకు శ్రీకారం చుడుతున్నారు. పాదయాత్రలు చేయడం ద్వారా పవర్‌లోకి రావచ్చని భావిస్తున్నారు. గతంలో ఇది వర్కవుట్ కావడంతో నేటి నేతలు సెంటిమెంటుగా భావిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా ఎన్టీరామారావు పాదయాత్ర చేపట్టడంద్వారా ప్రజలకు మరింత చేరువై అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా రాష్ట్రమంతా పాదయాత్ర చేసి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఇదే ఒరవడిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కొనసాగించి ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో చాలా మంది నేతలు పాదయాత్రలనే నమ్ముకొని ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే వైఎస్ షర్మిల పదయాత్రల పేరుతో రాష్ట్రమంతా పర్యటిస్తుండగా బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ కూడా పాదయాత్రలనే నమ్ముకొని ముందుకు సాగుతున్నారు. -వరంగల్ వాయిస్, వరంగల్ ప్రతినిధి
వరంగల్ వాయిస్, వరంగల్ ప్రతినిధి : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు ఊపందుకున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అస్త్ర, శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అధికారమే లక్ష్యంగా భావిస్తున్న ఆయా పార్టీల నాయకులు పాదయాత్రలకు శ్రీకారం చుడుతున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలను కలుసుకుని వారి సమస్యలను స్వయంగా తెలుసుకోవడంతోపాటు ఓటర్ల మన్ననలు పొందేందుకు పాదయాత్రలు దోహదం చేస్తాయని నాయకులు విశ్వసిస్తున్నారు. మహానటుడు ఎన్టీ రామారావు చేపట్టిన బస్సు యాత్రతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాత్రలకు బీజం పడింది. ప్రజల మధ్యే ఉంటూ వారి కష్ట సుఖాలు తెలుసుకుంటూ వారితోనే కలసి భోజనం చేస్తూ, నిద్రిస్తూ ఎన్టీ రామారావు ఒక కొత్త ఒరవడిని సృష్టించారు. దీంతో అనతి కాలంలోనే ఆయన ప్రజలకు అత్యంత చేరువ కావడంతోపాటు పార్టీని స్థాపించిన అతి తక్కువ సమయంలోనే అధికారంలోకి వచ్చి ప్రత్యేకతను చాటారు. ఇదే ఫార్ములాను వైఎస్ రాజశేఖర్ రెడ్డికూడా అమలు చేశారు. 2 ఏప్రిల్ 2003లో ఆయన పాదయాత్రను ప్రారంభించి 60 రోజుల పాటు 1500 కిలో మీటర్ల యాత్ర చేశారు. వేసవి కాలంలో ఎండలతోపాటు వైఎస్సార్ పొలిటికల్ పాదయాత్రల రాజకీయంగా వేడిని పుట్టించింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సైతం 2012లో 2000 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలోని ఇడుపులపాయలో గల వైఎస్ఆర్ ఘాట్ వద్ద 6నవంబర్, 2017న ఆరంభమైన పాదయాత్ర 9 జనవరి, 2019న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ముగిసింది. జగన్ పాదయాత్ర అత్యధికంగా 341 రోజులు 3,648 కిలో మీటర్లు సాగింది. గతంలో ఎవరూ చేయనన్ని రోజులు, దూరం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి ప్రజల మన్నలకు పాతృడయ్యారు. తర్వాత చేసిన ఓదార్పు యాత్ర కూడా ఆయనకు మైలేజీని ఇచ్చింది.
బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర..
రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ మొదటి దశ పాదయాత్రను 2021 ఆగస్టులో చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి గుడి నుంచి ప్రారంభించారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరిట సాగిన ఈ పాదయాత్రతో బండి సంజయ్‌కి రాష్ట్రంలో మంచి గుర్తింపు లభించింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని ఏప్రిల్ 14, 2022లో అలంపూర్ జోగులాంబ జిల్లా నుంచి రెండో విడత పాదయాత్ర నిర్వహించారు. ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజల సమస్యలు, ఇతర అంశాలు తెలుసుకుని ఎన్నికల మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్దాలని ఆయన భావిస్తున్నారు. ఈ యాత్ర 10 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 31 రోజులపాటు సాగింది. ఐదు జిల్లాలలోని 112 గ్రామాలలో సుమారు 370 కిలోమీటర్లు పాదయాత్ర మే 13న మహేశ్వరంలో ముగిసింది. ఎన్నికల వరకు రాష్ట్రమంతా అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర నిర్వహించేలా పక్కా ప్లాన్‌తో ఆయన ముందుకు సాగుతున్నారు. మిగతా పార్టీల పాదయాత్ర కంటే తమ పాదయాత్ర భిన్నంగా ఉండాలనేది బీజేపీ ఉద్దేశంగా కనిపిస్తోంది. రచ్చబండ కార్యక్రమం కూడా ఈ పాదయాత్రలో భాగంగానే నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర రాజకీయాలతోపాటు.. స్థానిక సమస్యలను ప్రస్తావించడం ద్వారా కూడా పార్టీని ప్రజలకు చేరువ చేయాలనేది బీజేపీ ప్రణాళిక.
యాదాద్రి టు భద్రకాళి..
బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర యాదాద్రి టు భద్రకాళిగా సాగనుంది. మంగళవారం యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు తీసుకున్న ఆయన సాయంత్రం తన పాద్రయాత్రను ప్రారంభించారు. గత రెండు పర్యాయాలు నిర్వహించిన పాదయాత్రకు భిన్నంగా ఈ పాదయాత్రను కొనసాగించేలా పక్కా ప్రణాళిక రూపొందించారు. చారిత్రక, తెలంగాణ సాయుధ, తెలంగాణ ఉద్యమ పోరాటాల నేపథ్య ప్రాంతాల మీదుగా బండి పాదయాత్ర సాగనుంది. రజాకార్ల అరాచకాలకు ప్రత్యక్ష సాక్షిగా, మూకుమ్మడిగా బలైన గుండ్రాంపల్లి, చాకలి ఐలమ్మ పోరు సాగించిన విసునూరు, సర్వాయిపాపన్న రాజధాని ఖిలాషాపూర్, తెలంగాణ సాయుధ పోరాట చైతన్య వేదిక కొత్తపేటతోపాటు ఐనవోలు మల్లన్న ఆలయం మీదుగా యాత్ర సాగనుంది. ఆగస్టు 7వ తేదీన చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత ప్రసిద్ధిగాంచిన పోచంపల్లిలో బహిరంగ సభను నిర్వహించేలా రూట్ మ్యాప్‌ను ఖరారు చేశారు. 2న ప్రారంభమైన ఈ యాత్ర 24 రోజుల పాటు కొనసాగనుంది. ఈనెల 26న వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి దర్శనం అనంతరం యాత్రను ముగించనున్నారు. ఐదు జిల్లాలలోని 12 నియోజవకర్గాలను కవర్‌చేస్తూ 328 కిలో మీటర్లు ఈ యాత్ర సాగనుంది. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఆరు నియోజకవర్గాలు, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఆరు నియోజకవర్గాల్లో ఈ యాత్ర సాగనుంది. ఐదు జిల్లాలలోని ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, పాలకుర్తి, స్టేషన్ ఘన్‌పూర్, జనగామ, వర్థన్నపేట, పరకాల, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజక వర్గాల పరిధిలోని 25 మండలాల్లో యాత్ర నిర్వహించేలా ప్లాన్ చేశారు.
వైఎస్ షర్మిల పాదయాత్ర..
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ‘ప్రజాప్రస్థానం’ పేరిట పాదయాత్రలకు శ్రీకారం చుట్టారు. గతేడాది అక్టోబర్ 20న ప్రజాప్రస్థానం యాత్రను ప్రారంభించిన షర్మిల ఎమ్మెల్సీ కోడ్‌తోపాటు కరోనా మూడో వేవ్ కారణంగా పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. పాదయాత్రను ఈ ఏడు మార్చి 11 నుంచి పునః ప్రారంభించారు. నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలంలోని కొండపాకగూడెం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమైంది. ఒక్కో నియోజకవర్గంలోని సగానికిపైగా మండలాల్లో పాదయాత్ర కొనసాగించడంతోపాటు ప్రతీ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ ఉండేలా రూపకల్పన చేశారు.
ప్రవీణ్‌కుమార్ యాత్ర..
మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ తన పదవికి రాజీనామా చేసి బహుజన సమాజ్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో రాష్ట్రంలో ఆ పార్టీలో ఉత్సాహం కనబడుతోంది. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న ప్రవీణ్‌కుమార్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. బీఎస్‌పీ తెలంగాణ చీఫ్ కో-ఆర్డినేటర్ హోదాలో ఆయన ‘బహుజన రాజ్యాధికార యాత్ర’ పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ నుంచి మార్చి 6న ఆయన పాదయాత్ర ప్రారంభమైంది. 300 రోజుల పాటు ఐదు వేల గ్రామాల గుండా ఈ యాత్ర సాగేలా ప్రణాళిక రూపొందించారు.
భట్టి విక్రమార్క యాత్ర..
కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ‘పీపుల్స్ మార్చ్’ పేరుతో మధిర నియోజకవర్గంలో ఫిబ్రవరి 27న పాదయాత్ర చేపట్టారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం యడవల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్ర 100 కిలోమీటర్లు సాగింది. తన అసెంబ్లీ సెగ్మెంట్‌లో 32 రోజుల పాటు 500 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని ఆయన భావించినప్పటికీ శాసనసభ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో యాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేశారు. రానున్న ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కూడా పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు.
త్వరలో రాహుల్ గాంధీ పాదయత్ర..
తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర నిర్వహించేలా టీపీసీసీ కసరత్తు చేస్తోంది. భారత్ జోడో యాత్ర పేరిట అక్టోబర్ 2న కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ పాదయాత్ర నిర్వహించేలా రూట్ మ్యాప్‌ను రూపొందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 350 కిలో మీటర్ల పాదయాత్రకు టీపీసీసీ ప్లాన్ చేస్తోంది. 17 రోజుల పాటు రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. డిసెంబర్‌లో కర్ణాటక నుంచి రాహుల్ యాత్ర జరగనుంది.
