- హెచ్‌సీయూ నుంచి పోలీసు బలగాల ఉపసంహరణ
- మంత్రుల సబ్ కమిటీ సమావేశంలో నిర్ణయం
- వీసీకి డిప్యూటీ సీఎం భట్టి లేఖ
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటానికి ప్రభుత్వం దిగివచ్చింది. హెచ్‌సీయూ క్యాంపస్ నుంచి పోలీసు బలగాలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. విద్యార్థులపై నమోదు చేసిన కేసులను కూడా ఉపసంహరించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. ఈ మేరకు హెచ్‌సీయూ వీసీ బీజేరావు కు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార సోమవారం లేఖ రాశారు. హెచ్‌సీయూలోని కంచ గచ్చిబౌలి భూ సమస్యపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన మంత్రుల సబ్ కమిటీ సోమవారం సచివాలయంలో సమావేశమైంది. సబ్‌కమిటీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార అధ్యక్షతన జరిగిన సమావేశానికి కమిటీ సభ్యు లు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ వరింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచందర్‌రెడ్డి పాల్గొన్నారు.
సబ్ కమిటీతో హైదరాబాద్ విశ్వవిద్యాలయ ఉపాధ్యాయ సంఘం (యూహెచ్‌టీఏ), పౌరసంఘాల ప్రతినిధులు సమావేశమై పలు డిమాండ్లను మంత్రుల కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం ముందు విద్యార్థులు పెట్టిన తక్షణ డిమాండ్లను పరిష్కరించకపోవడంతో విద్యార్థి జేఏసీ ఈ సమావేశానికి హాజరుకాలేదని వారు మంత్రులకు వివరించారు. వారి డిమాండ్లను నెరవేర్చిన తర్వాతే విద్యార్థి జేఏసీ నాయకులు మంత్రుల కమిటీ నిర్వహించే సమావేశానికి హాజరవుతారని తెలిపారు. అనంతరం హెచ్‌సీయూ క్యాంపస్ నుంచి పోలీసు బలగాలను ఉపసంహరిస్తామని, 400 ఎకరాల భూమిని రక్షించడానికి పోలీసుల పహారా తప్పనిసరి అని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు. క్యాంపస్‌లోని మిగిలిన ప్రాంతాల నుంచి పోలీసులను ఉపసంహరించుకోవాలనే అంశంపై హెచ్‌సీయూ వైస్ చాన్సలర్‌కు ప్రభుత్వం నుంచి లేఖ రాస్తామని చెప్పారు.
సాధ్యమైనంత త్వరగా కేసుల ఉపసంహరణ కోసం పోలీసు, న్యాయ శాఖలతో సంప్రదించి అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రుల కమిటీ హామీ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని, తదుపరి కోర్టు ఆదేశాలు జారీ చేసే వరకు అధ్యాపకులు, విద్యార్థులు సహా ఎవరిని 400 ఎకరాల్లో సర్వేకు అనుమతించలేమని స్పష్టంచేసింది. విద్యార్థులు కోరిన విధంగా యూనివర్సిటీని సందర్శించడానికి కమిటీ సానుకూలంగా ఉన్నదని, కానీ, సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతున్నందున న్యాయపరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికిప్పుడు హెచ్‌సీయూకి మంత్రుల బృందం రాలేదని వెల్లడించింది. సబ్ కమిటీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార గతంలో హెచ్‌సీయూ విద్యార్థులు, అధ్యాపకులు, రిజిస్ట్రార్ చేసిన విజ్ఞప్తిని క్రోడీకరిస్తూ యూనివర్సిటీ వీసీకి లేఖ రాసింది.
