Warangalvoice

Ex Minister Harish Rao Sensational Comments On Cm Revanth Reddy Ruling

Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి వైఖ‌రిని చూసి ఊస‌ర‌వెల్లి సైతం ఉరేసుకునే ప‌రిస్థితి : హ‌రీశ్‌రావు

  • Harish Rao | ప్రతీ అంశం లో ప్లేటు ఫిరాయిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూముల అమ్మకంపై కూడా తన నాలుకను మడత పెట్టి నిస్సిగ్గుగా నిధుల సమీకరణ కోసం వేలాల బాట పట్టిండు అని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు.

వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : ప్రతీ అంశం లో ప్లేటు ఫిరాయిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూముల అమ్మకంపై కూడా తన నాలుకను మడత పెట్టి నిస్సిగ్గుగా నిధుల సమీకరణ కోసం వేలాల బాట పట్టిండు అని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. భూముల వేలంపై మారిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని చూసి ఊసరవెల్లి సైతం ఉరి వేసుకునే పరిస్థితి నెలకొన్నది అని విమ‌ర్శించారు.

‘‘ప్రభుత్వ భూములంటే పెద్దలిచ్చిన ఆస్తి అని, తెలంగాణ జాతి సంపద అని, ఆ భూములను అమ్మితే భవిష్యత్తులో స్మశానాలు నిర్మించాలంటే కూడా భూమి లేకుండా పోతుందని’’ నాడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి మొసలి కన్నీరు కార్చిండు. తాము అధికారంలోకి వస్తే ఇంచు ప్రభుత్వ భూమిని కూడా అమ్మబోము అంటూ ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసి ఇపుడు వేల కోట్ల విలువైన భూములను అర్రాస్ వేసేందుకు తెరలేపిండు అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

విలువైన ఆస్తులను కొల్లగొట్టేందుకు కుట్ర

ప్రభుత్వ భూములను అమ్మబోమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించి మూడు నెలలైనా గడవక ముందే విలువైన ఆస్తులను కొల్లగొట్టేందుకు కుట్ర పన్నారు. పవిత్ర అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలను నీటి మూటలు చేస్తూ, నిధుల సమీకరణ పేరుతో ఇప్పుడు నిస్సిగ్గుగా భూములను అడ్డికి పావుశేరుకు అమ్ముతుండటం కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలకు అద్దం పడుతున్నది. మాస్టర్ ప్లాన్ పేరిట వేలం పాట నిర్వహించేందుకు కన్సల్టెంట్ నియమకానికి (ఆర్ఎఫ్‌పీ) గత నెల 28న టెండర్లు పిలవడం దిగజారుడు తనానికి పరాకాష్ట అని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.

భూములను అమ్ముకోవడం ప్రభుత్వ దివాలాకోరు తనానికి నిదర్శనం..

కంచ గచ్చిబౌలి గ్రామం సర్వే నంబర్ 25 పరిధిలోని 400 ఎకరాలను బ్యాంకర్లకు తనఖా పెట్టిన సమయంలో ప్రభుత్వం 25 కోట్లకు ఎకరం చొప్పున రూ.10వేల కోట్లు ఇప్పటికే సమీకరించింది. ఇప్పుడు ఇదే భూమిని వేలం వేసి దాదాపు రూ.30వేల కోట్లను సమీకరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఒకవైపు బ్యాంకులో తనఖా పెట్టడం, మరోవైపు తనఖా పెట్టిన అవే భూములను వేలం వేసి అమ్ముకోవడం ప్రభుత్వ దివాలాకోరు తనానికి నిదర్శనం. డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం కపట బుద్ధిని ఆధారాలతో సహా బయటపెట్టాను అని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు.

అసెంబ్లీలో నిలదీస్తే.. భూ బదలాయింపు మాత్రమేనని బుకాయించారు..

జూన్ 26, 2024 నాడు విడుదల చేసిన జీవో ఎంఎస్ 54తో ఎకరానికి 75 కోట్ల చొప్పున మొత్తం 30వేల కోట్ల విలువైన భూములను అమ్ముతున్నారని నేను అసెంబ్లీలో నిలదీస్తే.. అలాంటిదేమి లేదని, టీజీఐఐసీకి చేస్తున్న భూ బదలాయింపు మాత్రమేనని బుకాయించారు. నిండు సభలో ముఖ్యమంత్రి సహా మంత్రులు తప్పుడు సమాధానం చెప్పి, సభను, సభ్యులను తప్పుదోవ పట్టించారు. అసెంబ్లీ అయ్యిందో, లేదో వెంటనే అదే భూమిని తనఖా పెట్టి రూ. 10వేల కోట్ల రుణం తెచ్చుకున్నరు. మల్లా అసెంబ్లీ మొదలయ్యే లోపే ఇప్పుడు అదే భూమిని అమ్మకానికి టెండర్లు పిలుస్తున్నార‌ని హ‌రీశ్‌రావు తెలిపారు.

బ్రహ్మాండంగా ఉన్న రాష్ట్ర పరపతిని బజారు కీడ్చారు..

అధికారంలోకి రాగానే దివ్యమైన రాష్ట్రాన్ని దివాలా దివాలా అని దిగజారుడు రాజకీయాలు చేశారు. బ్రహ్మాండంగా ఉన్న రాష్ట్ర పరపతిని, ప్రతిష్టను బజారు కీడ్చారు. మూసీ సుందరీకరణ, హైడ్రా అంటూ లేనిపోని భయాందోళనలు సృష్టించి హైదరాబాద్ బ్రాండ్‌ను దెబ్బతీశారు. మొత్తంగా బీఆర్ఎస్ పాలనలో అద్భుతమైన ప్రగతి సాధించిన తెలంగాణను మీ 14నెలల పాలనలో తిరోగమనం బాట పట్టించారు. తలాతోకలేని విధానాలు, నిర్ణయాల వల్ల రాష్ట్ర రాబడి తగ్గడం వల్ల చివరకు ప్రభుత్వ భూములను అమ్ముకొని ఆదాయం సమకూర్చుకునే స్థాయికి దిగజారారు. ఆ భూములను అమ్ముకోవాలన్నా మీకు, మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ పదేళ్ల కాలంలో సాధించిన అభివృద్ధిని ప్రచారం చేసుకోకతప్పడం లేదని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

బహిరంగంగా ఎందుకు ఒప్పుకోవడం లేదు రేవంత్ రెడ్డి గారూ..

ఒకవైపు తెలంగాణ దివాలా తీసిందంటూనే, మరోవైపు మీరు రూపొందించిన రిక్వెస్ట్ ఫర్ ప్రపోసల్ (ఆర్ఎఫ్‌పీ)లో ఆర్థిక, సామాజిక రంగాల అభివృద్దిలో తెలంగాణ రోల్ మోడల్ అయ్యిందని, ఇండస్ట్రియల్ పాలసీ దేశానికే తలమానికం అని పేర్కొన్నారు. 2011-12 లో 3.6లక్షల కోట్లుగా ఉన్న జీఎస్డీపీ, 2020-21 నాటికి 11.5 కోట్లకు చేరిందని, దేశంలోనే అత్యధిక ఎకనమిక్ గ్రోత్ నమోదు చేసిందని స్పష్టంగా తెలిపారు. భూములు అమ్ముకోవడానికి డాక్యుమెంట్ల రూపంలో చెబుతున్న తెలంగాణ అభివృద్ధి గణాంకాలను, బహిరంగంగా ఎందుకు ఒప్పుకోవడం లేదు రేవంత్ రెడ్డి గారూ అని హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు.

యావత్ తెలంగాణకు క్షమాపణలు చెప్పాలి..

కేసీఆర్ చేసిన అభివృద్ధి మీరు ఎంత ప్రయత్నం చేసి దాచినా దాగదు. అసత్యాలు ప్రచారం చేయడం, ప్రతిపక్షాలను బుకాయించడం వంటివి ఇకనైనా మానుకోవాలని హితవు పలుకుతున్నా. భూములు అమ్మబోమని ప్రజలను, అసెంబ్లీని సైతం తప్పుదోవ పట్టించినందుకు యావత్ తెలంగాణకు క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్నిడిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ భూములు అమ్మితే స్మశానానికి కూడా జాగ ఉండదన్న రేవంత్ రెడ్డి.. ఇప్పడు స్మశానాలకు భూములు ఎక్కడ పుట్టిస్తారో చెప్పాలని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.

Ex Minister Harish Rao Sensational Comments On Cm Revanth Reddy Ruling
Ex Minister Harish Rao Sensational Comments On Cm Revanth Reddy Ruling

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *