- సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ఫెయిల్ అయ్యారని, ఆయనను మూగజీవాలు కూడా క్షమించవు అని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు.
వరంగల్ వాయిస్, సిద్దిపేట : సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ఫెయిల్ అయ్యారని, ఆయనను మూగజీవాలు కూడా క్షమించవు అని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. ఏప్రిల్ 27 న వరంగల్‌లో జరిగే పార్టీ ఆవిర్భావ రజతోత్సవ బహిరంగ సభ సందర్బంగా సిద్దిపేట నియోజకవర్గ ముఖ్య నాయకులతో హరీశ్‌రావు సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. సిద్దిపేటకు 25 ఏళ్ల గులాబీ జెండా కీర్తి ఉంది.. పార్టీ పెట్టి లక్ష్యం సాధించి.. ఆ లక్ష్యంతో అద్భుతమైన అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా నిలిపిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ జెండా అని హరీశ్‌రావు పేర్కొన్నారు. నాడు 2001లో సిద్దిపేట కొనాయపల్లి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం.. సిద్దిపేట ప్రజల ఆశీస్సులు తీసుకోని కేసీఆర్ గులాబీ జెండా ఎగరేశారని గుర్తు చేశారు. సిద్దిపేట వాళ్ళు లేని బహిరంగ సభ లేదు.. ఎక్కడ సభ అయినా.. ఎక్కడ ఎన్నికలు అయిన ఆదిలాబాద్ నుండి అలంపూర్ వరకు సిద్దిపేట నాయకులు పని చేశారని హరీశ్‌రావు తెలిపారు.
రేవంత్ రెడ్డి పాలన పెయిల్ అయింది.. హైడ్రా పేరుతొ పేద ప్రజల జీవితాలు నాశనం చేసిండు, భూముల అమ్మకాల పేరుతో మూగ జీవాల గోస పోసుకున్నాడు. చివరకు మూగ జీవాలు కూడా రేవంత్ రెడ్డిని క్షమించవు. రుణమాఫీ చేస్తా అని సగం రుణమాఫీ చేసి చేతులు ఎత్తేసిండు. వానకాలం రైతుబంధు ఎగొట్టిన డబ్బులు 13 వేల కోట్లు.. రుణమాఫీ చేసింది 14 వేల కోట్లు అంటే రైతుబంధు ఎగొట్టి రుణ మాఫీ సగం చేసిండు. ఈగ గింతే రుణమాఫీ అని అసెంబ్లీలోనే చెప్పి చేతులు దులుపుకున్నాడు అని హరీశ్‌రావు మండిపడ్డారు.
ప్రభుత్వం వైఫల్యాలు ప్రజా వ్యతిరేకత వరంగల్ సభ వేదికగా ఎండగట్టాలి. సిద్దిపేట నియోజకవర్గం నుండి 20 వేలకు పైన జన సమీకరణ ఉండాలి. పెద్ద ఎత్తున తరలి రావాలి. సిద్దిపేట కీర్తిని మరో సారి చాటి చెప్పాలి. విద్యార్థి యువత ఆధ్వర్యంలో వెయ్యి మందితో పాదయాత్ర, 100 ట్రాక్టర్‌లతో ర్యాలీ నిర్వహించాలి. 27న పార్టీ ఆవిర్భావ రజతోత్సవ వేడుకల సందర్భంగా ప్రతి పల్లెలో, పట్టణంలో గులాబీ జెండా ఎగరేయాలి అని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
