Warangalvoice

Ex Minister Harish Rao Fire On Congress Govt In Telangana

Harish Rao | మ‌హిళ‌లు కోటీశ్వ‌రులు కాదు.. అప్పుల‌పాల‌య్యే ప‌రిస్థితి వ‌చ్చింది.. కాంగ్రెస్ స‌ర్కార్‌పై హ‌రీశ్‌రావు ఫైర్

  • Harish Rao | అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా కాంగ్రెస్ స‌ర్కార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పి కోతలు కోసిన రేవంత్ రెడ్డి.. ఏడాదిన్నర పాలనలో మహిళలను చేసింది ఎడతెగని వంచనే అని పేర్కొన్నారు.

వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా కాంగ్రెస్ స‌ర్కార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పి కోతలు కోసిన రేవంత్ రెడ్డి.. ఏడాదిన్నర పాలనలో మహిళలను చేసింది ఎడతెగని వంచనే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాల‌న‌లో మ‌హిళ‌లు కోటీశ్వ‌రులు కాదు.. అప్పుల‌పాల‌య్యే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని మండిప‌డ్డారు.

ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు మిగిలింది ఎడతెగని వేదనే. మ‌హిళలను కోటీశ్వరులను కాదు, కనీసం లక్షాదికారులుగా చెయ్యని చేతగాని సర్కారు మీది అని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. ఏడాదిన్నర పాలనలో మహిళలకు ఏం చేసారని నేడు వేడుకలు నిర్వహిస్తున్నారు అని సీఎం రేవంత్ రెడ్డిని ప్ర‌శ్నించారు. ఏటా 20వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇస్తామని ఎన్నికల సమయంలో ఊదరగొట్టారు. చేసింది గోరంత, చెప్పుకునేది కొండంత అన్నట్లుంది కాంగ్రెస్ తీరు. డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఇచ్చిన సమాధానం ప్రకారం, సుమారు రూ. 5 వేల కోట్ల వడ్డీ లేని రుణాల బకాయి ఉంది. బకాయిలే చెల్లించని కాంగ్రెస్ ప్రభుత్వం, ఐదేళ్లలో లక్ష కోట్ల రుణాలు ఎలా ఇస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వ తీరు వల్ల మహిళలు కోటీశ్వరులు కాదు, అప్పుల పాలయ్యే పరిస్థితి వచ్చిందని హ‌రీశ్‌రావు విమ‌ర్శించారు.

ఇందిరా మహిళా శక్తి పేరిట వేడుకలు నిర్వహించడం సిగ్గుచేటు..

‘మహిళలకు ప్రతి నెలా రూ. 2500’ ఇస్తామని ఆరు గ్యారెంటీల్లో మొట్ట మొదటి హామీగా చెప్పి ఏడాదిన్నరగా అమలు చేయని రేవంత్ సర్కారు, ఈరోజు ఇందిరా మహిళా శక్తి పేరిట వేడుకలు నిర్వహించడం సిగ్గుచేటు. మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని ప్రతి మహిళకు బకాయి పడ్డ రూ. 37,500 ఎప్పుడు చెల్లిస్తారు? రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే, చేతలు మాత్రం గడప దాటవు అని మరోసారి నిరూపితమైంది. గ్యారెంటీలు, 420 హామీలు అని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్లే రేవంతు సర్కారు, మహిళలను దారుణంగా వంచించింది. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా, కేసీఆర్ గారు మహిళా సంక్షేమం, సాధికారత, స్వయం సమృద్ధి కోసం ప్రారంభించిన పథకాలకు మంగళం పాడారు అని హ‌రీశ్‌రావు విమ‌ర్శించారు.

ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం..

ఇందిరమ్మ రాజ్యంలో… కేసీఆర్ కిట్టు బంద్ అయ్యింది. కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ బంద్ అయ్యింది. బతుకమ్మ చీరెలు బంద్ అయినయి. ఆరోగ్య లక్ష్మి బంద్ అయ్యింది. ఆరోగ్య మహిళ బంద్ అయ్యింది. పింఛన్ల పెంపు బంద్ అయ్యింది. కడుపు కోతలు మల్లా పెరిగినయి. పెరిగిన క్రైం రేటుతో ఆడబిడ్డలకు భద్రత కరువైంది. నోటిఫికేషన్లు రాక, యువతుల ఉద్యోగ కలల సాకారం ప్రశ్నార్థకమైంది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవి అమలు చేయకుండా ఇన్నాళ్లూ కాలం వెల్లదీసారు. ఇప్పుడమో అన్నీ చేసినట్లు, మహిళలను కోటీశ్వరులను చేసినట్లు కోట్లు ఖర్చు చేసి ప్రచారం చేసుకుంటున్నారు. ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం, అధికారంలోకి వచ్చాక అబద్దాలు ప్రచారం చేసుకుంటం అన్నట్లుంది కాంగ్రెస్ వైఖరి అని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.

నేడు వేడుకలు జరుపుకోవడం నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్లుంది..

మీ అభయహస్తం మేనిఫెస్టోలో చెప్పి, ఏడాదిన్నరగా మాట తప్పిన హామీలను గుర్తు చేస్తున్నాను. మహాలక్ష్మి కింద ప్రతి మహిళకు నెలకు రూ. 2500. ఇప్పటికీ అమలు లేదు. సంవత్సరానికి 20వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తమన్నరు. అతీగతీ లేదు. 18 ఏళ్లు పైబడి, చదువుకునే ప్రతీ యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తమన్నరు. ఊసే లేదు. ఆడబిడ్డ పెళ్లికి లక్ష ఆర్థిక సాయంతో పాటు, తులం బంగారం ఇస్తామన్నరు. జాడే లేదు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం నైపుణ్య శిక్షణా కేంద్రంతో పాటు, ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తమన్నరు. పత్తాలేదు. డ్వాక్రా సంఘాలకు పక్కా భవనాలు నిర్మిస్తం అన్నరు. ప్రస్తావన లేదు. పుట్టిన ప్రతి ఆడ బిడ్డకు ఆర్థిక సాయంతో కూడిన ‘బంగారు తల్లి’ పథకాన్ని పునరుద్దరిస్తం అన్నరు. పథకమే లేదు. అంగన్‌వాడీ టీచర్లకు నెలసరి వేతనం 18,000 లకు పెంచుతూ, ఇపిఎఫ్ పరిధిలోకి తెచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తం అన్నరు. ఆలోచనే లేదు. ఆశా వర్కర్లకు తక్షణమే వేతనాలు పెంచుతం అన్నరు. సోయి లేదు. ఇందులో ఒక్క హామీని అమలు చేయకుండా, నేడు వేడుకలు జరుపుకోవడం నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్లుందని హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు.

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది..

ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది. మహిళల పై అత్యాచారాలు, లైంగిక వేధింపుల ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. మహిళలపై నేరాలు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. మహిళా రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. గురుకులాల్లో విద్యార్థినులు బలవన్మరణాలకు పాల్పడుతుండటం దారుణం. మహిళా సాధికారికత, భద్రత మాటలకే పరిమితమైంది. ఈ ప్రభుత్వానికి నిజంగా మహిళల పట్ల గౌరవం ఉంటే, వారి సంక్షేమం పట్ల చిత్తశుద్ది ఉంటే నేడు జరిగే ఇందిరా మహిళా శక్తి వేడుకల్లో ఈ హామీల అమలు ఖచ్చితమైన తేదీలను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. ఏడాదిన్నర పాలనలో కాంగ్రెస్ చేసిన మోసానికి గాను నేడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగే మహిళా దినోత్సవ వేడుకల్లో యావత్ కాంగ్రెస్ పార్టీ తరుపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

Ex Minister Harish Rao Fire On Congress Govt In Telangana
Ex Minister Harish Rao Fire On Congress Govt In Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *