- Harish Rao | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీలు గుప్పించిన రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కపై మాజీ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీలు గుప్పించిన రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కపై మాజీ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది.. ఎక్కడ 2 లక్షల ఉద్యోగాలు అని హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు.
భట్టి విక్రమార్క బడ్జెట్ నిరుద్యోగులు ఎన్నో ఆశలు వమ్ము చేసింది. మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నరు మొండి చెయ్యి చూపారు. ఈ ఏడాదైనా ఇవ్వకపోతారా అని ఎదురు చూసిన వారి ఆశల మీద భట్టి బకెట్ల కొద్దీ నీళ్లు చల్లారు. ఎన్నికల ముందు రేవంత్ నుంచి రాహుల్ గాంధీ దాకా అశోక్ నగర్ చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఉద్యోగాలిచ్చి మాట నిలబెట్టుకుంటామని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఏం చేశారు. ఊరూరు బస్సు యాత్రలు చేసి రెచ్చగొట్టారు. నిరుద్యోగులను మీ పార్టీ కార్యకర్తలుగా మార్చుకొని ఇల్లిల్లూ తిప్పారు. నాడు నమ్మించారు, నేడు నిండ ముంచారు అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్లు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్కలేదని దుష్ర్పచారం చేసారు. తెలంగాణ ఉద్యమ లక్ష్యాలు నిధులు, నీళ్లు, నియామకాలు నెరవేర్చిన ప్రభుత్వం మాది. తెలంగాణ ఉద్యమం ఎందుకొచ్చింది. ముల్కీ రూల్స్ నుంచి 610 దాకా తెలంగాణ పోరాడింది దేని కోసం? స్థానిక ఉద్యోగాలు స్థానికులకే దక్కాలని. మా ఉద్యోగాలు మాకు కావాలని. ఢిల్లీకి తిరిగి తిరిగి దాన్ని సాధించిండు కేసీఆర్. 60-80శాతం మాత్రమే ఉండే స్థానిక రిజర్వేషన్ ను 95శాతానికి పెంచిండు. అందుకోసం రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించిండు. ఇవాళ అటెండర్ నుంచి ఆర్డీవో వరకు 95శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చేసింది కేసీఆర్. తొమ్మిదిన్నరేండ్ల బిఆర్ఎస్ పాలనలో అక్షరాల 1 లక్షా 62వేల ఉద్యోగాలు భర్తీ చేసినం. ఈ మాటకు నేను కట్టుబడి ఉన్నా. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదనే మీ తప్పుడువిషప్రచారం మానుకోండి. అబద్దమే మీ ఆత్మ. అబద్దమే మీ పరమాత్మ. ఇదే కాదు మీ జాబ్ క్యాలెండర్ సంగతి తెలుసు, 57 వేల ఉద్యోగాల ఇచ్చామని చెబుతున్నారు అధ్యక్షా.. అని హరీశ్‌రావు మండిపడ్డారు.
ఉదాహరణకు కానిస్టేబుల్స్ నియామక ప్రక్రియ చూద్దాం.. 17,516 కానిస్టేబుల్ పోస్టులకు ఏప్రిల్ 25, 2022 నాడు నోటిఫికేషన్ వేసాం. వీరికి ఆగస్టు 28, 2022న ప్రిలిమినరీ టెస్టు, డిసెంబర్ 8, 2022న ఫిజికల్ టెస్టు, ఏప్రిల్ 23, 2023 ఫైనల్ రిటన్ టెస్ట్ ఎగ్జాం కండక్ట్ చేసినం. సెలక్షన్ లిస్టు అక్టోబర్ 4, 2023నాటికి పూర్తి చేసాం. ఎన్నికల కోడ్ కారణంగా నియామకపత్రాలు ఇవ్వలేకపోయాం. అధికారంలోకి వచ్చిన మీరు ఫిబ్రవరి ఫిబ్రవరి 14, 2024న ఎల్బీ స్టేడియంలో నియామకపత్రాలు పంచిన్రు. నోటిఫికేషన్ ఇచ్చింది ఎవరు, పరీక్ష పెట్టింది ఎవరు, ఫిజికల్ టెస్టు పెట్టింది ఎవరు, సెలక్షన్ లిస్టు చేసింది ఎవరు. నియామకపత్రాలు ఇచ్చి, ప్రచారం చేసుకున్నది ఎవరు. రేవంతు విధానం ఎట్లుందంటే, వంటంత అయినంక గంటె తిప్పినట్టుంది అని హరీశ్‌రావు విమర్శించారు.
