- Harish Rao | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జల దోపిడీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొద్దు నిద్ర వీడాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచించారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జల దోపిడీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొద్దు నిద్ర వీడాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచించారు. బనకచర్ల ద్వారా 200 టీఏంసీల కృష్ణా నీళ్ల తరలింపు కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర చేస్తుంటే రేవంత్ రెడ్డి ఎందుకు మౌనం వహిస్తున్నారని హరీశ్‌రావు ప్రశ్నించారు.
బనకచర్ల ద్వారా గోదావరి వరద జలాలనే తీసుకువెళ్తున్నాం, తెలంగాణకు నష్టం లేదు అని ఏపీ నీళ్ల మంత్రి అంటే నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ మౌనం వహించడం వెనుక అంతర్యమేంటని ప్రశ్నించారు. మూడు నెలలుగా నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి రోజుకు 10వేల క్యూసెక్కులను ఏపీ తరలించుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉందన్నారు. గోదావరి, కృష్ణా నీటిలో తెలంగాణ వాటాను ఏపీ ఇష్టారాజ్యంగా తరలలించే కుట్రలు చేస్తుంటే ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, ఉత్తం కుమార్ రెడ్డి సహా ఒక్క నాయకుడికి పట్టింపు లేదు అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
“బనకచర్ల తో తెలంగాణకు ఏమి నష్టం” అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంగా మాట్లాడి మూడు రోజులైనా ఒక్కరూ గట్టిగా స్పందించలేదు. తెలంగాణ నీటి ప్రయోజనాలు ఈ సర్కారుకు పట్టవా? అక్రమంగా నీటిని తరలించుకు పోతుంటే మొద్దు నిద్రలో ఉంటారా..? చంద్రబాబును అడ్డుకునే ధైర్యం, కేంద్రాన్ని అడిగే దమ్ము కాంగ్రెస్, బీజేపీ ఎంపీలకు లేదా? చంద్రబాబుతో బీజేపీ, రేవంత్ దోస్తీ చేస్తూ తెలంగాణను మోసం చేస్తారా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
బాబు, రేవంత్, బీజేపీ మధ్య లోపాయికార ఒప్పందం ఏమిటి? బిఆర్ఎస్ పార్టీ గొంతెత్తినా మీకు చలనం కలగదా? కాంగ్రెస్, బిజెపి తీరు తెలంగాణ తాగు, సాగు నీటి రంగానికి గొడ్డలి పెట్టుగా మారుతున్నది. తెలంగాణ ప్రయోజనాల కోసం బిఆర్ఎస్ పార్టీ పడుతున్న ఆరాటం మీకు ఎలాగూ అర్థం కాదు, కనీసం మీడియాలో వస్తున్న కథనాలను చూసైనా కదలండి. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వ జల దోపిడీని అడ్డుకోండి. కేంద్రాన్ని నిలదీయండి. రేవంత్ సహా బిజెపి ఎంపీలు, కేంద్ర మంత్రులు మౌనం వీడండి! అని హరీశ్‌రావు సూచించారు.
