Warangalvoice

Ex Minister Harish Rao Fire On Congress Leaders In Telangana

Harish Rao | ఇప్ప‌టికైనా కాంగ్రెస్ నేత‌లు క‌ళ్లు తెర‌వాలి.. లేదంటే చ‌రిత్ర క్ష‌మించ‌దు : హ‌రీశ్‌రావు

  • Harish Rao | కాళేశ్వ‌రం తెలంగాణ వ‌ర‌ప్ర‌దాయిని అని.. కాళేశ్వరం కుంగింది అన్నవారికి, ఈ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు.

వరంగల్ వాయిస్, సిద్దిపేట : కాళేశ్వ‌రం తెలంగాణ వ‌ర‌ప్ర‌దాయిని అని.. కాళేశ్వరం కుంగింది అన్నవారికి, ఈ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు కండ్లు తెరవండి.. లేదంటే చరిత్ర మిమ్ములను క్షమించదు అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూరు మండలం చంద్లపూర్‌లోని రంగనాయక సాగర్ ప్రాజెక్టును హరీష్ రావు సంద‌ర్శించారు.

ఈ సందర్బంగా హరీష్ రావు గారు మాట్లాడుతూ.. రంగనాయక సాగర్‌లోకి కాలేశ్వరం పంప్ హౌస్‌ల ద్వారా నీటిని విడుదల చేసినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధ‌న్య‌వాదాలు. సిద్దిపేట నియోజకవర్గంలో 50 వేల ఎకరాల్లో పంట సాగు అవుతుంది. పంట చేతికొచ్చే సమయానికి నీళ్లు లేకపోతే రైతులు ఇబ్బంది పడతారని విజ్ఞప్తి చేయగా, అనంతసాగర్ నుండి 1 టిఎంసి నీళ్లను రంగనాయక సాగర్‌కు పంపినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు. నా కోరిక మేరకు ఒక్క టిఎంసి నీటిని ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేశారని హ‌రీశ్‌రావు తెలిపారు.

గోరంతను కొండంత చేసి బీఆర్ఎస్‌పై బురదజల్లే ప్రయత్నం..

గత ప్రభుత్వం చేసిన మంచి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం తుడిచిపెట్టాలని చూస్తుంది.. ప్రజలకు నష్టం చేయకూడదు. ఎస్సారెస్పీ స్టేజ్ 2లో తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట, భూపాలపల్లి ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయి. ఎస్సారెస్పీ నీరు తగ్గినప్పటికీ, కాళేశ్వరం ద్వారా రెండు పంటలకు సాగునీరు విడుదల చేశాం. కాళేశ్వరంలో 15 రిజర్వాయర్లు బాగున్నాయి, 23 కిలోమీటర్ల టన్నెల్స్‌ బాగున్నాయి, 19 సబ్ స్టేషన్లు బాగున్నాయి, 21 హౌసులు బాగున్నాయి, ప్రెజర్ మైన్లు బాగున్నాయి. మేడిగడ్డలో ఏడు బ్లాకులు ఉంటే, అందులో ఒక్క బ్లాక్‌లో ఒక్క పిల్లర్ మాత్రమే కుంగిపోయింది. కానీ గోరంతను కొండంత చేసి బీఆర్ఎస్‌పై బురదజల్లే ప్రయత్నం చేశారు. అధికారంలోకి వచ్చారు అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

పెండింగులో ఉన్న పంట కాలువల పనులు పూర్తి చేయాలి..

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు అయింది. ఈ 15 నెలల్లో మేడిగడ్డ పిల్లర్లను బాగు చేసే తీరిక ప్రభుత్వానికి లేదు. నేడు గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి.. ఆ నీళ్లను లిఫ్ట్ చేసి లక్షల ఎకరాల పంటను కాపాడే అవకాశం ఉంది. కేసీఆర్ మీద కోపంతోనే, బీఆర్ఎస్ మీద కోపంతోనే, తెలంగాణ రైతులకు అన్యాయం చేయకూడదని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ ప్రాంతంలో 500-1000 ఫీట్ల బోర్లు వేసినా నీళ్లు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు రంగనాయక సాగర్ కింద, అనంతసాగర్ కింద, మల్లన్న సాగర్ కింద పండే పంట కాలేశ్వరం పంట కాదా? కళ్లు ఉండి కల్లు లేని కబోధుల్లా.. చెవులు ఉండి చెవిటివాళ్లలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. పెండింగులో ఉన్న పంట కాలువల పనులు పూర్తి చేయాలి. రైతులతో పాటు మత్స్య సంపద కూడా పెరిగి, మత్స్యకారులకు ఆదాయం వస్తుంది. అన్ని వర్గాలకు మంచిచేసే ఇలాంటి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయకూడదు అని హ‌రీశ్‌రావు సూచించారు.

Ex Minister Harish Rao Fire On Congress Leaders In Telangana
Ex Minister Harish Rao Fire On Congress Leaders In Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *