- Harish Rao | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను కనీసం 20 రోజులు నడపాలని బీఏసీలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. బీఏసీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : హరీశ్‌రావు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను కనీసం 20 రోజులు నడపాలని బీఏసీలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. బీఏసీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశ్నపత్రాలు లీక్ అయినట్లుగా అసెంబ్లీ బిజినెస్ ముందే లీక్ అవడంపై అభ్యంతరం తెలిపామన్నారు. ప్రతిపక్షాలకు మైక్ ఇవ్వొద్దని సీఎం స్వయంగా స్పీకర్‌ను బల్డోజ్ చేస్తున్న విషయాన్ని బీఏసీలో లేవనెత్తామన్నారు. సంఖ్య బలాన్ని బట్టి బీఆర్ఎస్‌కు సభలో సమయం ఇవ్వాలని కోరామని.. తమ విజ్ఞప్తికి స్పీకర్ అంగీకరించారన్నారు. రైతాంగ సమస్యలు, తాగు, సాగు నీటి సమస్యలపై చర్చించాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. సుంకిశాల, పెద్దవాగు, వట్టెం పంప్‌హౌస్ మునగడం, ఎస్‌ఎల్‌బీసీ ఘటనలపై అసెంబ్లీలో చర్చించాలని చెప్పామన్నారు.
మంత్రులు సభకు ప్రిపేరై రావాలని కోరామని.. అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి స్పీకర్ చొరవ తీసుకుని నిధులు ఇప్పించాలని కోరినట్లు తెలిపారు. కృష్ణా నదీ జలాల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సభలో చర్చించాలని బీఏసీలో చెప్పామని.. ఏపీ నీళ్లు తరలించుకుపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూసిందన్నారు. బిల్లులు చెల్లింపునకు 20శాతం కమిషన్ విషయాన్ని అసెంబ్లీలో చర్చించాలని కోరామని.. ఆరు గ్యారంటీలు అమలు చేయకపోవటం చర్చించాలన్నారు. బార్స్, వైన్స్, బెల్ట్ షాపులు పెంచడంపై చర్చించాలన్నారు. ఎల్ఆర్ఎస్ ఉచిత హామీపై చర్చ జరపాలని డిమాండ్ చేసినట్లు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును, కుంగిన పిల్లర్‌ను కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారని బీజేసీలో చెప్పామని.. వెంటనే కాళేశ్వరం పునరుద్ధరణ పనులు చేపట్టాలని కోరామన్నారు. నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్‌పై అసెంబ్లీలో చర్చించాలని.. మాజీ సర్పంచులు, చిన్న కాంట్రాక్టర్లు బిల్లుల చెల్లింపు అంశంపై సభలో చర్చించాలని డిమాండ్ చేసినట్లు హరీశ్‌రావు వివరించారు.
