ముగ్గురు విద్యార్థినులకు గాయాలు
కారణాలు బయటకు పొక్కనివ్వని సిబ్బంది
తల్లిదండ్రుల ఆందోళనతో ఆలస్యంగా వెలుగులోకి
వరంగల్ వాయిస్, వరంగల్ టౌన్: నగరంలోని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ శంభునిపేటలో 9వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థునులకు గొంతుపై కోసినట్లు గాయాలు కావడం నగరంలో సంచలనం సృష్టించింది. ఈనెల 24న సంఘటన జరిగినా గురుకుల సిబ్బంది దీనిని గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. గురుకుల సిబ్బందే ట్రీట్‌మెంట్ ఇప్పించడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. సోమవారం బాధిత విద్యార్థునుల తల్లిదండ్రులు గురుకులం ఎదుట ఆందోళనకు దిగడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే విద్యార్థినుల తల్లిదండ్రులను కూడా గురుకుల సిబ్బంది గేటు వద్దే అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులకు భద్రత కల్పించాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ సంఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. వివరాలు తెలిపేందుకు కూడా గురుకుల సిబ్బంది ఆసక్తి చూపకపొవడంపై విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఇంటిలిజెన్స్ వర్గాలు గురుకులానికి చేరుకొని వివరాలు సేకరించే పనిలో పడ్డారు.
