- ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న ఎనిమిది మందిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలను వేగవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు
వరంగల్ వాయిస్, మిర్యాలగూడ : ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న ఎనిమిది మందిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలను వేగవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన 8 మంది కార్మికుల జాడ ఇంకా తెలియకపోవడం దారుణమని అన్నారు.
ఇప్పటికే ఐదు రోజులు దాటిపోయిందని, ప్రభుత్వ యంత్రాంగం వారిని బయటకు తీసుకువచ్చేందుకు అన్ని రకాల చర్యలను వేగవంతం చేయాలని రంగారెడ్డి కోరారు. 2006లో ఈ సొరంగ మార్గం పనులు ప్రారంభం కాగా 19 ఏండ్లయినా ఇప్పటికీ పూర్తి కాకపోవడం నల్లగొండ జిల్లా ప్రజలకు శాపంగా మారిందన్నారు. ఈ సొరంగ మార్గం పూర్తయితే ఉమ్మడి జిల్లా పరిధిలో నాలుగు లక్షల 30 వేల ఎకరాలు సాగులోకి వస్తాయని, అదేవిధంగా 550 గ్రామాలకు తాగునీటి సౌకర్యం కలుగుతుందని అన్నారు.
ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టుపట్ల నిర్లక్ష్యంగా ఉండటం, నిధులు విడుదల చేయకపోవడం వల్లనే నేటికీ పూర్తి కాలేదని ఆరోపించారు. ఈ సొరంగ మార్గం పూర్తయితే నల్లగొండ జిల్లా పరిధిలో ఉన్న చెరువులు అన్నిటిని నింపడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. 2000 కోట్ల బడ్జెట్ అంచనాలతో ఈ ప్రాజెక్టు ప్రారంభం అవ్వగా ఇప్పుడు అంచనా వ్యయం విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు. వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా పూర్తికాని పరిస్థితి దాపురించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పనులు ప్రారంభించే ముందు నిపుణులతో అన్ని రకాల పరీక్షలు చేయించి, ప్రారంభించి ఉంటే ఈ ప్రమాదం జరగకపోయి ఉండేదని అభిప్రాయపడ్డారు.
ఇప్పటికైనా సొరంగ మార్గంలో ప్రమాదాలు జరిగినప్పుడు రక్షణ చర్యలు చేపట్టే ఆధునిక నిపుణులను అందుబాటులో ఉంచుకోవాలని, వెంటనే సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన వారిని రక్షించాలని కోరారు. అదేవిధంగా సొరంగ మార్గం పనులను త్వరగా పూర్తిచేసి ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులకు, ప్రజలకు మేలు చేయాలన్నారు. ఈ సమావేశంలో సీపీఎం నాయకులు డబ్బికార్ మల్లేష్, మల్లు గౌతంరెడ్డి, వీరేపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
