- జాబ్ క్యాలెండర్ అంటూ మోసం
- బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ నేతలు నమ్మించి నట్టేట ముంచారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి ఆరోపించారు. జాబ్ క్యాలండర్ అని ప్రకటించి జాబ్ లెస్ క్యాలెండర్ విడుదల చేశారన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ లో పండగలు, పబ్బాలు, పంచాంగం తప్ప ఎక్కడా ఉద్యోగ నియామకాల ఊసే లేదని మండిపడ్డారు. మైసూరు బజ్జీలో మైసూరు లేకున్నా కనీసం బజ్జీ ఉంటుంది..బొంబాయి రవ్వలో బొంబాయి లేకున్నా రవ్వ అయినా ఉంటుంది.. కానీ, కాంగ్రెస్ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ లో జాబు లేదు, క్యాలండర్ లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబును ఆదర్శంగా తీసుకుంటున్న రేవంత్ రెడ్డి మరి జాబ్ క్యాలెండర్ విషయంతో ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. జీవో 46, జీవో 29 బాధితులపై ప్రభుత్వం కక్ష కట్టి కోట్లు ఖర్చు పెట్టి కేసులు వాదిస్తూ తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. 2025 లో అయినా జాబ్ లతో కూడిన జాబ్ క్యాలెండర్ విడుదల చెయాలని సూచించారు. వీఆర్వోలను తీసుకొచ్చి సర్వేయర్లుగా సర్వేలు చేయించడం బుద్ధి తక్కువ పని అన్నారు. సర్వేయర్ పని సర్వేయర్ చేయాలి వీఆర్ఓ పని వీఆర్వో చేయాలి అన్నారు. 12 వేల వీఆర్వో ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సర్వేయర్ పోస్టులను బీటెక్ సివిల్, సివిల్ డిప్లమా చేసిన వారితో భర్తీ చెయాలన్నారు. ఏఈ ఉద్యోగాలకు సర్టిఫికెట్స్ తనిఖీ కూడా అయింది కానీ, ఇప్పటి వరకు అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. ఈ ఏడాది కూడా నోటిఫికేషన్ ఇవ్వకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువత మీకు బుద్ధి చెప్పడం ఖాయంమని హెచ్చరించారు.