వరంగల్ వాయిస్, హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ఎక్కిన లిఫ్ట్‌లో స్వల్ప అంతరాయం ఏర్పడింది. దీంతో సీఎం సెక్యూరిటీ సిబ్బంది, మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన హైదరాబాద్ శివారు శంషాబాద్ నోవాటెల్ హోటల్‌లో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
శంషాబాద్ నోవాటెల్ హాటల్‌లో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. మొదటి అంతస్తు నుంచి రెండో అంతస్తులోకి వెళ్లేందుకు సీఎం రేవంత్ లిఫ్ట్ ఎక్కారు. అయితే పరిమితికి మించి ఆ లిఫ్ట్‌లో ఎక్కడంతో అది ఒక్కసారిగా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో హోటల్ సిబ్బంది, సీఎం సెక్యూరిటీ అప్రమత్తమయ్యారు. సెక్యూరిటీ సిబ్బంది లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసి వేరే లిఫ్ట్‌లో రేవంత్ రెడ్డిని సెకండ్ ఫ్లోర్‌కి పంపారు.
రేవంత్ ఉక్కిరి బిక్కిరి..!
ఒక్కసారిగా లిఫ్ట్ ఆగిపోవడంతో.. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆ లిఫ్ట్‌లో ఉన్న పలువురు నాయకులు ఉక్కిరి బిక్కిరికి గురైనట్లు తెలుస్తోంది. కాసేపు ఊపిరాడకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైనట్లు సమాచారం. అయితే ఎనిమిది మంది ఎక్కాల్సిన లిఫ్ట్‌లో 13 మంది ఎక్కడంతోనే లిఫ్ట్ ఆగిపోయిందని హోటల్ సిబ్బంది తేల్చారు.
సీఎల్పీ మీటింగ్‌లో రేవంత్ ఫ్రస్టేషన్..
తాను ఎక్కిన లిఫ్ట్ ఆగాల్సిన చోటు కంటే రెండు అడుగులు కిందకు లిఫ్ట్ ఆగిపోవడంతో సీఎం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇక అప్పటికే మంత్రి పదవులపై ఎమ్మెల్యేల ప్రకటనలపై సీరియస్‌గా ఉన్న రేవంత్‌కు.. సీఎల్పీ మీటింగ్‌కు వెళ్లే క్రమంలో లిఫ్ట్ ఆగిపోవడంతో మరింత ఫ్రస్టేషన్‌కు గురయ్యారు. ఇంకేముంది.. సీఎల్పీ సమావేశం ప్రారంభం కావడంతో.. ఆ ఫ్రస్టేషన్‌ను అంతా ఎమ్మెల్యేలపై తీసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలను హెచ్చరించారు. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ అని చెప్పారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదని అన్నారు. మీరు మాట్లాడేదంతా రికార్డవుతుందని హెచ్చరించారు.
