Warangalvoice

CM Revanth Reddy KEY Comments on Caste Census

CM Revanth Reddy: కులగణనపై బీఆర్ఎస్, బీజేపీ కుట్ర. సీఎం రేవంత్‌రెడ్డి పైర్

  • CM Revanth Reddy: బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కులగణనలో ఇప్పటి వరకు వారి వివరాలు ఎందుకు నమోదు చేసుకోలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. 50శాతం ఉన్న ప్రజలు, అర శాతం ఉన్న వాళ్లను ప్రశ్నిస్తారని వాళ్లకు భయపట్టుకుందని విమర్శించారు.

వరంగల్ వాయిస్, హైదరాబాద్: కులగణన ప్రక్రియ నిర్వీర్యం చేసేలా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కుట్ర పన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేశారు. కులగణనపై కోర్టుల్లో కేసులు వేసే ప్రమాదం ఉందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ మాటిచ్చారని తెలిపారు. బలహీన వర్గాలు ముందుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయని చెప్పారు. మా నాయకుడు ఇచ్చిన మాటను నిలబెట్టాలని బీసీ కులగణన చేశామని తెలిపారు. ఇవాళ(శనివారం) గాంధీభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ ఒక్క రోజులో సర్వే చేసి కాకి లెక్కలు చెప్పారని అన్నారు.

ఆ వివరాలు బయటకు చెప్పకుండా దాచి పెట్టుకున్నారన్నారు. రాజకీయాలకు ఆ వివరాలను కేసీఆర్ వినియోగించుకున్నారని.. కానీ తాము అలా చేయలేదని చెప్పారు. ప్లానింగ్ విభాగాన్ని నోడల్ ఏజెన్సీగా పెట్టుకుని సర్వే చేశామని చెప్పుకొచ్చారు. కేసీఆర్ చేసిన సమగ్ర సర్వే తప్పుడు సర్వే అని ఆరోపించారు. ఎస్సీల్లో 56కులాలు ఉంటే 86కులాలుగా సమగ్ర కుటుంబ సర్వేలో చూపించారని మండిపడ్డారు. తాము చేసిన సర్వేను కొందరు తప్పుపడుతున్నారని… ఎక్కడ తప్పు ఉందో చెప్పాలని అడిగారు. వారికి ఆ అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా సర్వే చేశామన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బీసీ అని చెప్పుకుంటారని.. .2011లో కాంగ్రెస్ చేసిన బీసీ సర్వే లెక్కలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు.

కేంద్రమంత్రి బండి సంజయ్‌కు ప్రేమ ఉంటే ఆ లెక్కలు బయట పెట్టాలని కోరారు. బీసీలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని ఆ సర్వే వివరాలు బయట పెట్టడం లేదని ధ్వజమెత్తారు. ప్రతీ రాష్ట్రంలో ఈ డిమాండ్ వస్తే దేశం మొత్తం చేయాల్సి వస్తుందని అన్నారు. బీసీల లెక్క తేలితే బీజేపీలో అధికారం చెలాయించే ఒకటి రెండు సామాజిక వర్గాలకు ఇబ్బంది అవుతుందని అన్నారు. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇప్పటి వరకు వారి వివరాలు ఎందుకు నమోదు చేసుకోలేదని ప్రశ్నించారు. 50శాతం ఉన్న ప్రజలు, అర శాతం ఉన్న వాళ్లను ప్రశ్నిస్తారని వాళ్లకు భయపట్టుకుందని విమర్శించారు. అందుకే బీసీల సర్వేకు వారు సహకరించడం లేదని అన్నారు. కేసీఆర్ నాలుగు కేటగిరీల్లో లెక్కలు తీస్తే తాము ఐదు కేటగిరీల్లో వివరాలు తీసుకున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

CM Revanth Reddy KEY Comments on Caste Census
CM Revanth Reddy KEY Comments on Caste Census

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *