Warangalvoice

BRS_party

BRS Party | మునుపటి ఛరిష్మా వచ్చేనా..!

  • బీసీ నినాదం ఎత్తుకున్న బీఆర్‌ఎస్‌
  • స్థానిక ఎన్నికలే లక్ష్యంగా రాజకీయం
  • సవాళ్లు విసురుతున్న నేతలు
  • లేకుంటే పార్టీ మనుగడ కష్టమంటున్ననేతలు


ఉద్యమ పార్టీ అయిన తమకు తెలంగాణలో తిరుగులేదని విర్రవీగిన బీఆర్ఎస్ ను అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కర్రు కాచి వాత పెట్టారు. అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌కు ఇప్పుడు ఎదురుదాడి రాజకీయాలు తప్ప మరోటి కానరావడం లేదు. వివిధ అవినీతి కేసులతో పార్టీ పరువు బజారున పడుతున్న వేళ ఆ పార్టీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారు. కేసులనుంచి బయట పడేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఇదే సమయంలో పార్టీలో ఉన్నవారు ఇతర పార్టీలోకి జారుకోకుండా కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీని వీడిన వారిని కోర్టుకు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే రానున్న స్థానిక ఎన్నికల్లో గెలిస్తే తప్ప బీఆర్‌ఎస్‌ మనుగడ కష్టమని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. లేకుంటే ఇప్పుడున్న పరిస్థితి కన్నా దారుణంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అందుకే ఆ పార్టీ నేతలు బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారు. ఈ నినాదంతోనైనా ప్రజల్ని మళ్లీ ఉద్యమ స్థాయిలో సిద్ధం చేసి బీఆర్ఎస్ వైపు తిప్పుకోవాలని పట్టుదలగా ఉన్నారు. పార్టీకి మునుపటి ఛరిష్మా తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. అయితే అధికారంలో ఉన్న పది సంవత్సరాల్లో ఏనాడూ బీసీలను పట్టించుకోని బీఆర్ఎస్ పార్టీ నేతలు నేడు మొసలి కన్నీరు కారుస్తూ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కలిపించాలంటూ నిరసనలకు దిగడం, చాలెంజ్ లు విసరడం విడ్డూరంగా ఉందంటూ కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడి చేస్తోంది.
-వరంగల్ వాయిస్, వరంగల్ ప్రతినిధి

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై ప్రతిపక్ష హోదాకే పరిమితమైన బీఆర్ఎస్ పార్టీ ఆత్మపరిశీలనో పడింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ కు చెందిన పలువురు ముఖ్యనేతలు కారు దిగి హస్తం గూటికి చేరారు. మరి కొందరు పార్టీతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు బీఆర్ఎస్ కు అగ్నిపరీక్షగా మారనున్నాయి. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. లేకుంటే పార్టీ మనుగడ కష్టమని భావిస్తుస్తోంది. పార్టీని మళ్లీ విజయ తీరాలకు చేర్చాలంటే బీసీ నినాదం ఒక్కటే కలిసొచ్చేదిగా భావిస్తున్నారు. అందుకే బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారు.

మళ్లీ ఉద్యమ స్థాయిలో..
ప్రజల్ని మళ్లీ ఉద్యమ స్థాయిలో సిద్ధం చేయాలని కేటీఆర్‌ పట్టుదలగా ఉన్నారు. జనాల సమస్యలను దృష్టిలో పెట్టుకుని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌ రావులే అడపాదడపా జనంలోకి వెళ్తున్నారు. పార్టీకి మైలేజీ తెచ్చేందుకు అప్పుడప్పుడు ఉద్యమం నాటి కేసీఆర్‌ను తిరిగి చూస్తారంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో గందరగోళం ఏర్పడుతుందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండబోదంటూ ప్రచారాలను మొదలు పెట్టారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అమలు చేసిన పథకాలతో ప్రజల్లోకి వెళ్లేలా ప్రచార కార్యక్రమాలను బీఆర్ఎస్ సిద్ధం చేస్తోంది. అయితే క్షేత్రస్ధాయిలో పరిస్ధితిని చూస్తుంటే బీఆర్‌ఎస్‌ నాయకులను జనాలు పెద్దగా పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదు. క్యాడర్‌ సహకారం లేకపోవడంతో నేతలు నిమిత్త మాత్రులుగా మగిలిపోతున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తామన్న అంచనాలు తలకిందులు అయ్యాయి. దీంతో కారు క్యాడర్‌లో నిరూత్సాహం ఆవహించింది. దాన్ని పొగొట్టే ప్రయత్నంలో కేటీఆర్‌ పలు విూటింగ్‌లు పెట్టినా పెద్దగా ఫలితం రావడం లేదు.

బీఆర్‌ఎస్‌ మైండ్‌ గేమ్‌..
కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలే సూచనలు ఉన్నట్లు చెబుతున్నారు. 104 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే బీజేపీ తన ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసిందని, 64 స్థానాలున్న కాంగ్రెస్‌ ను కూల్చడం వారికి పెద్ద కష్టం కాదంటూ సూత్రీకరిస్తున్నారు. కేటీఆర్‌, హరీశ్‌ రావు, ఎర్రబెల్లి దయాకర్‌ రావు లాంటి సీనియర్ బీఆర్ఎస్ నేతలు కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలుతుందని, రేవంత్‌ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఇదంతా చూస్తుంటే పార్టీ క్యాడర్‌ ను , లీడర్లను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ నేతలు ఆడుతున్న మైండ్‌ గేమ్‌ గా రాజకీయ ప్రముఖులు అభివర్ణిస్తున్నారు.

ఎదురుదాడి..
పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణను అప్పులకుప్పగా మార్చారు. అప్పులకు వడ్డీలు కట్టుకునే దుస్థితి ఇప్పుడు కాంగ్రెస్ కు చుట్టుకుంది. రైతుబంధు పేరుతో వేలకోట్లు దోచిపెట్టారు. ధరణి పేరుతో భూములన్నీ మాయం చేశారు. కాళేశ్వరంతో ప్రజాధనం వృధా చేశారు. ఇవన్నీ కూడా కళ్ల ముందు కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు వాటిని వదిలి ఎదురుదాడి చేయడం, విమర్శలు చేయడం బీఆర్ఎస్ నేతలు అలవాటుగా చేసుకున్నారు. బీసీల గురించి కవిత తదితరులంతా గగ్గోలు పెడుతున్న తీరు ప్రజల్లో అసహ్యం కలిగిస్తోంది. పదేళ్ల పాలనలో సర్వ వ్యవస్థలను భ్రష్టు పట్టించిన బీఆర్‌ఎస్‌ కుటుంబం ఇప్పుడు నీతి వాక్యాలు వల్లిస్తోంది. రానున్న స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కలిపించాలంటూ ఎమ్మెల్సీ కవిత ఏకంగా నిరసన దీక్షకే దిగారు. బీసీలను ఒక్కతాటి మీదకు తీసుకొచ్చేందుకు పాట్లు పడుతున్నారు. నేను చెప్పేవి అబద్దాలైతే రాజకీయాలనుంచి తప్పుకుంటానంటూ కవిత సవాళ్ చేస్తోంది. అయితే ఆమెపై కాంగ్రెస్ నేతలు సైతం ఎదురు దాడికి దిగుతున్నారు. పదేళ్లు అధికారంలోనే ఉండి ఏమి చేశారంటూ కాంగ్రెస్ నేతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. అధికారం కోల్లోగానే బీసీలు గుర్తుకొచ్చారా అంటూ నిలదీస్తున్నారు.

మైత్రి కుదిరేనా..
అయితే కాంగ్రెస్‌ పార్టీ కూలుతుందంటూ బీజేపీ-బీఆర్‌ఎస్‌ నేతలు చెప్పడం రానున్న రోజుల్లో ఈ రెండు పార్టీల మైత్రికి ఇది నాందిగా మారుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీకి ప్రధాన శత్రువు జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ మాత్రమే. బీఆర్‌ఎస్‌ జాతీయ పార్టీగా రిజిస్టర్‌ అయినా దాని ప్రభావం జాతీయ రాజకీయాల్లో ఏ మాత్రం లేదు. కాబట్టి దక్షిణాది రాష్టాల్ల్రో కాంగ్రెస్‌ కన్నా ప్రాంతీయ పార్టీలు ఉంటేనే బీజేపీకి లాభం. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు-మిత్రులు ఉండరన్న నానుడి బీజేపీ-బీఆర్‌ఎస్‌ కు వర్తిస్తుంది. అదే రీతిలో శత్రువు-శత్రువు మిత్రువు అన్న నానుడి కూడా ఈ రెండు పార్టీలకు వర్తిస్తుంది. ఎందుకంటే.. జాతీయ స్థాయిలో బీజేపీకి శత్రువు కాంగ్రెస్‌, రాష్ట్ర స్థాయిలో బీఆర్‌ఎస్‌ కు శత్రువు కాంగ్రెస్‌. ఈ సూత్రం ప్రకారం బీజేపీ-బీఆర్‌ఎస్‌ లు రెండూ ఏకమై రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ను గద్దె దింపే ప్రయత్నాలు చేసే అవకాశం లేకపోలేదు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ఈ రెండు పార్టీలు చేర్చుకుంటాయా లేక, బీఆర్‌ఎస్‌, బీజేపీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ చేర్చుకుని కౌంటర్‌ ఎటాక్‌ చేస్తుందా… అన్నది మాత్రం వేచిచూడాల్సిందే.

BRS_Party

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *