Warangalvoice

Midnight dawn Sunrise

అర్ధరాత్రి అరుణోదయం

అరవయ్యేండ్ల సంగ్రామం తరువాత భారత జాతి విముక్తిని సాధించింది. 15 ఆగస్టు 1947 భారత జాతికి వెలుగుల దినం, ఉత్సవ దినం, పర్వదినం, పరువాల దినం. భారత జాతికి రెండు శతాబ్దాల అంగ్రేజుల దాస్యం నుంచి విముక్తి గలిగింది. ఇది స్థూల దృష్టి. భారతజాతి ఎన్నో శతాబ్దాలుగా ‘స్వరాజ్యం’ కోల్పోయింది. సురాజ్యమూ నష్టపోయింది. మనం స్వరాజ్యం సాధించుకున్నం. ఇక మనను పైవాడు పాలించాడు. మనమే పాలించుకుంటాం. ఇది మన దేశం. దీనిని మనమే చక్కబరచుకుంటాం. 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి బ్రిటిష్ పతాకం ‘యూనియన్ జాక్’ దిగిపోయింది. భారత జాతీయ పతాకం త్రివర్ణ కేతనం సగర్వంగా ఎగిరింది. అప్పుడు నెహ్రూ అన్నారు ‘లోకం నిద్రిస్తున్నపుడు భారతదేశం మేల్కొన్నది’ అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ సామ్రాజ్యవాదులు సాధారణంగా అధికారం వదులుకోరు. అసలు అధికారమే అలాంటిది. దాన్ని ఎవడూ వదలడు. స్వచ్ఛందంగా అధికారం వదలుకున్నవారు చరిత్రలో అరుదు. అర్ధం, అధికారం ఈ రెంటినీ వదిలించాలి తప్ప వదలుకోరు.

ఈ సూత్రం చిన్న కుటుంబ యజమాని నుంచి సామ్రాజ్యవాదుల వరకు వర్తిస్తుంది. అమెరికా ప్రజలు యుద్ధం చేసి, బ్రిటిషు ప్రభుత్వాన్ని తరిమి వేశారు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని విధిలేక విడిచి పోయారు. సామ్రాజ్యవాదులు విధిలేక భారతదేశం వదిలారు అనడానికి ఇవి కొన్న నిదర్శనాలు మాత్రమే. చరిత్ర తెలియని, తెలుసుకోలేని నేటి యువత బ్రిటిషు వాడు దయాధర్మంతో వదిలి పోయాడనే తప్పుడు అభిప్రాయంతో ఉంది. సామ్రాజ్యవాద విధానం విభజించడం వాళ్లు వెళ్లిపోయేపుడు దేశాలను విభజిస్తారు. ఒక ముక్క అయినా కొంత కాలం అయినా తమ చెప్పు చేతల్లో ఉంటుందని వారి అభిప్రాయం. వారు వియత్నాంను, కొరియాను విభజించారు. వియత్నాం ప్రజాపోరాట విజయం. వియత్నంను ఏకం చేసింది ఉత్తర-దక్షిణ కొరియాలు. పాకిస్తాన్ భారత స్థితిలో ఉన్నాయి. సామ్రాజ్యవాదుల కుట్ర ఫలితంగా భారతదేశం చీలింది. పాకిస్తాన్ ఏర్పడింది. మౌంట్‌బాటన్ అసమర్థత వల్ల చీలిన దేశంలో రక్తం నదులయి ప్రవహించింది. సామ్రాజ్యవాదుల మరో కుట్ర ఫలించి ఉంటే దేశం మూడు కాదు, వందల ముక్కలు కావలసింది. భారత దేశంలో తమ ఉనికిని కాపాడుకోవడానికి సుమారు 500పై సంఖ్య గల సంస్థానాలను అరపావు స్వతంత్రంగా ఉంచారు. ఇంగ్లీషు వారు వెళ్లిపోతూ ఆ సంస్థానాధీశులందరికీ స్వాతంత్ర్యం ఇచ్చారు. వారు భారత్‌లోకాని, పాక్ లో గాని చేరవచ్చు. లేదా స్వతంత్రంగా ఉండవచ్చు. ఇది ముఖ్యంగా నిజాం రాజ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పన్నిన పన్నాగం అటు పాకిస్తాన్ ఇటు నడిబొడ్డు హైదరాబాద్ రాజ్యం తమ స్థావరం చేసుకోవాలని పథకం. స్థావరాలు కాకున్నా భారత ప్రభుత్వానికి బెడద కావచ్చు. సమస్య కావచ్చు, తలనొప్పి కావచ్చు. భారతదేశాన్ని ఇరకాటంలో పెట్టడానికి చేసిన కుట్ర ఇది. ‘జన్మజన్మాల బూజు ’ నిజాం రాజు ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నడు. గద్దెకు ఎక్కిన 1911 నుంచి కలలు కంటున్నడు. ఒంటె పెదవుల కోసం నక్కవలె ఎదురు చూస్తున్నడు. బ్రిటిష్ ప్రభుత్వమూ మహ్మదలీ ఉన్నందుకు ఆ ముసలినక్కను ఉసికొల్పారు.

12 జూన్ 1947 నిజాం తన సర్వతంత్ర స్వతంత్రం ప్రకటిస్తూ ఆజాద్ హైదరాబాద్ ఆవతరణ గురించి ఫర్మాను జారీ చేశాడు. ఆజాద్ హైదరాబాద్ అలా హజ్రత్ పాయిందాబాద్ అనే రజాకార్ల నినాదాల మధ్య చార్మినార్ మీద ఆసఫ్ జాహి పతాకాన్ని ఎగురవేశారు. అధికారానికి మతాలు, కులాలు,ప్రాంతాలు, దేశాలు ఉండవు. అర్థాన్ని అధికారాన్ని ఎవడూనప్పగించడు గుంజుకోవలసిందే. బలం శక్తి స్తోమతలు ఉంటే 500 మంది సంస్థానాధీశులూ నిజాం వలె విర్ర వీగేవారే. భారత ఉప ప్రధాని సర్దార్ వల్లబాయ్ పటేల్ చతురత రాజకీయజ్ఞత, బలప్రదర్శన వల్ల మిగతా సంస్థానాలు భారతదేశంలో విలీనం అయినాయి. పాకిస్తాన్‌లో ఉరితీయ బడిన ప్రధాని జుల్ఫికార్ అలీ భుట్టో జన్మస్థానం ‘జునాగడ్’ సంస్థానం కోసం బల ప్రయోగం చేయాల్సి వచ్చింది. అధికారానికి మతం లేదు అనటానికి కాశ్మీర్ మహారాజా హరిసింగ్ చక్కని ఉదాహరణ. కాశ్మీర్‌లోని భారతదేశం స్వతంత్రం అయింది కాదా! అతనూ నిజాం వలె స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు. ఆ చంద్రార్కం పాలిస్తాననుకున్నాడు. పాకిస్తాన్ మత ప్రాతిపదిక మీద ఏర్పడిందని జిన్నా ముస్లిములను నమ్మించారు. కాశ్మీర్‌లోని ముస్లిం సోదరులను విముక్తి చేయడానికి పాకిస్తాన్ కాశ్మీర్ మీద దండెత్తింది. అప్పటికీ హరిసింగ్ భారత దేశంలో చేరలేదు. భారత సైన్యాలు కాశ్మీరంలో దిగాయి. పాకిస్తాన్ సైనికులను తరిమాయి. ఇప్పటి ఆధీన రేఖ వరకు అప్పుడు గాని హరిసింగ్ భారతదేశంలో చేరలేదు. ఆ చేయడం కూడా అనేక షరతులు పెట్టి చేరాడు. అందుకే కాశ్మీరానికి ప్రత్యేక ప్రతిపత్తి. నాడు మహారాజా హరిసింగ్ తన అధికారాన్ని స్వచ్ఛందంగా వదులు కోలేదు. అటు పాకిస్తాన్, ఇటు భారత్ ఒత్తిడివల్ల వదులుకున్నాడు. భారత జాతీయ కాంగ్రెస్ సంస్థానాల పాలనలో జోక్యం కలిగించుకోలేదు. వారి పోరాటం బ్రిటిష్ ఇండియాకు మాత్రమే పరిమితం అయింది. మహాత్ముడు దేశీయ రాజ్యాల విషయంలో కల్పించుకోబోమని ప్రకటించారు. అలా చేసి వారి విశృంఖలత్వానికి లైసెన్సు ఇచ్చారు. నవాబులు, రాజులు, మహారాజులు ప్రజల రక్తాన్ని వారి ఇచ్చవచ్చినంత పీల్చారు. భారత జాతీయ కాంగ్రెస్, మహాత్ముని ఆ పాలసీ వలన మూడో వంతు భారతదేశం కట్టుబానిస అయింది. అయినా వారు పట్టించుకోలేదు. మహారాజుల దుశ్చర్యలను గురించి దీవాన్ జర్మనీదాస్ మహారాజు అనే ఇంగ్లీషు పుస్తకంలో వివరించారు.

మహాత్ముడు హైదరాబాద్ వచ్చారు. వచ్చినప్పుడల్లా తనురాజకీయాలు మాట్లాడనని మాట ఇచ్చారు. నిర్మాణ కర్యక్రమాల గురించి తప్ప మాట్లాడలేదు. మహాత్ముడు మాట తప్పడు అని నిజాంకు తెలుసు. కాంగ్రెస్ సంస్థానాల్లో ప్రజా ఉద్యమాలు నిర్వహించి ఉంటే ఈ రోజు కాశ్మీర్ సమస్య ఇంత జఠిలం అయ్యేది కాదు. అయితే ఆనాటి స్థితి గతులను ఈనాటి కళ్ళద్దాలతో చూడడం అర్థం లేనిది. అప్పటి కాంగ్రెస్‌కు రెండు పోరాటాలు సాధ్యం కాలేదేమో. లేదా 500 మంది సంస్థానాధీశులకు స్వాతంత్ర్యం ఇస్తారని సహించలేదేమో! అది కాంగ్రెస్ బలహీనత మాత్రం అగును. నిజాం నవాబు తన గద్దెను కాపాడుకోదలచాడు. ఒక రాజ్యం సాధించడానికి జిన్నా మతాన్ని ఆశ్రయించాడు. ఉన్న రాజ్యాన్నిరక్షించుకోవడానికి నిజాం నవాబు మతాన్ని ఆశ్రయించాడు. అతడు ఇది వరకే అవలంభించిన ‘అనల్ మలిక్’ సిద్ధాంతానికి మరిన్ని మెరుగు దిద్దాడు. భారతదేశం ఒత్తిడి తెస్తే పాకిస్తాన్‌లో చేర్తానని బెదిరించాడు. భారతదేశపు నడిబొడ్డున పాకిస్తాన్ ఏర్పరుస్తానని బుకాయించాడు. కాంగ్రెస్ వారు నాలుగవ దశకంలో తమ తప్పు గ్రహించారు. అందుకు కారణం హైదరాబాద్ తిరువాన్కూరు వంటి సంస్థానాల్లో కమ్యూనిస్టులు బలపడడం అప్పడు వారు ఇండియన్ స్టేట్స్ పీపుల్స్ కాంగ్రెస్ ప్రారంభించారు. దానికి జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షుడు. నెహ్రూ కాశ్మీర్ వెళ్తే కాశ్మీర్ ప్రభుత్వం బాయ్‌నెట్లతో అతన్ని నిరోధించింది. కాంగ్రెస్ వారు దేశీయ సంస్థానాలలో కూడాజాతీయోద్యమం నిర్వహించి ఉంటే కాశ్మీర్ సమస్య ఇంత జఠిలం అయ్యేది కాదు నాడు. కాశ్మీర్ మహారాజు నిజాం కన్న తక్కువ నిరంకుశుడేమీ కాదు. కాశ్మీరం వాడయిన కిషన్ చందర్ అనే గొప్ప ఉర్దూ రచయిత ‘మేలేయా దోటె చీనార్’ అనే తమ ఆత్మ కథలో కాశ్మీర్ స్థితిగతులను గురించి వివరించారు. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలయ్యింది. లక్షలాది ప్రజల ఆత్మార్పణ ఫలితంగా ఆగస్టు 14,15 తేదీ అర్ధరాత్రి సమయంలో ఇండియాపై స్వేచ్ఛావాయువులు వీచాయి. దేశ విభజన జరిగిందే అన్న బాధ ప్రజల హృదయకుహరాల్లో ఓ మూల దాగి ఉన్నా పరాయి పాలన తొలిగి పోయిందిలే అన్న భావన ప్రతిముఖంలోను కొట్టొచ్చినట్టు కనిపించింది.

ప్రథమ ప్రధాని ప్రతిజ్ఞా పత్రం ఆగస్టు 14 అర్ధరాత్రి నెహ్రూ ప్రసంగం వైతాళిక గీతంలా వినిపించింది. ఆ రోజు ఆయన ఏమన్నారంటే.. జిగతుగఢ నిదురలో మునిగి తేలే ఈ అర్థరాత్రి సజీవ స్వతంత్రం భారతం మేలుకుంటోంది. పురాతనం నుంచి నిత్య నూతనం వైపు అడుగుపెడుతూ యుగాంత వేళలో చిరకాలం పదళితమైన జాతి గుండె గొంతుక స్వరాన్ని సవరించుకునే సమయం చరిత్రలో అతి అరుదుగా వస్తుంది. ఈ మహాత్తర క్షణాల్లో భారతదేశ సేవ కోసం దేశవాసుల కోసం మానవాళి మహోన్నతి కోసం అంకితమయ్యేందుకు ప్రతిజ్ఞను స్వీకరించడమే సమంజసం! చరిత్ర ఆవిర్భావ కాలం నుంచి భారత దేశం నిరంతర అన్వేషణ కోసం సాగిన ఆరాటం జయాపజయాల ఘనమైన గతమూ నిండి ఉన్నాయి. ప్రమోదంలోనూ, విషాదంలోనూ, భారతావని ఆ అన్వేషణను పక్కనపెట్టలేదు. తనకు శక్తినిచ్చిన ఆ ఆదర్శాలను విస్మరించలేదు. నేడు జరుపుకుంటున్న ఆనందోత్సవాలు మన కోసం వేచి ఉన్న మరిన్ని విజయాలకు మరిన్ని లక్ష్యప్రాప్తులకు మార్గదర్శకాలే. ఈ అవకాన్ని చేజిక్కించుకునేందుకు భవిష్యత్తు విసిరే ఈ సవాలును స్వీకరించేందుకు మనం సంసిద్ధంగా ఉన్నామా? స్వేచ్ఛా అధికారాలతో పాటు భాధ్యతలు వెనువెంటనే వస్తాయి. సర్వసత్తాక జనానీకానికి ప్రాతినిధ్యం వహించే ఈ సార్వభౌమ సభపై ఆ బాధ్యతలున్నాయి. స్వాతంత్ర్య ప్రాప్తికి ముందు మనమెన్నో యాతనలను సహించాల్సి వచ్చింది. దాని తాలుకూ విషాధ భారం ఇంకా మన మనసుల్లో గూడుకట్టుకునే ఉంది. కొన్ని వేదనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే గతం గతించింది. ఇక భవిష్యత్తు మనకు ఆహ్వానం పలుకుతోంది.

అలసత్వంతో విశ్రమించే తరుణం కాదిది. ఇంత వరకూ చేసిన భాసలను ఇప్పుడు చేయబోతున్న ప్రతిజ్ఞలను నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేసే సమయం ఆసన్నమైంది. భారతదేశాన్ని సేవించడమంటే ఈ దేశంలోని పీడిత జనకోటిని సేవించడమే! దారిద్ర్యాన్ని, అవిద్యను, అనారోగ్యాన్ని నిర్మూలించడం. అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి చేయడమే దేశ సేవ. అన్ని కన్నుల అశ్రుధారలను తుడిచేయడమే మన తరంలోని మహోన్నతుని (మహాత్ముడు) ఆశయం. కన్నీరు కడగండ్లు దేశంలో ఉన్నంత వరకు మనం కష్టించక తప్పదు. మనం కృషి చేయాలి నింతరం కృషించాలి. ఈ కలలను నిజం చేసేందుకు కష్టపడి పని చేయాలి. మన కలలు దేశం కోసం అంతే కాదు! సమస్త ప్రపంచం కోసం!! వేరుండాలనుకున్న విడవలేనంత అవినాభావంగా నేడు ప్రపంచ దేశాలన్నీ ముడిపడి ఉన్నాయి. స్వాతంత్ర్యం నుంచి శాంతిని సమృద్ధిని విడదీయలేము. నేటి ప్రపంచంలో అరిష్టాలు కూడా అందరూ కలిసి కట్టుగానే అనుభవించాల్సి ఉంటుంది. భారత జనానికి ప్రతినిధులైన మేము విశ్వాసంతో నమ్మకంతో దేశవాసులను మా ఈ సాహసంలో భాగస్వామ్యులయ్యేందుకు ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు క్షుద్రమైన విధ్వంసాత్మకమైన విమర్శలకు తావు లేదు. వైమనస్యాలకు వైషమ్యాలకూ తావులేదు. దేశమంతా సంతానం నివసించేందుకు స్వతంత్ర భారత సమున్నత సౌధాన్ని నిర్మించడమే మన లక్ష్యం!! అన్నారు ప్రథమ ప్రధాని నెహ్రూజీ.

kolanpaka Kumaraswamy
kolanpaka Kumaraswamy

వ్యాసకర్త:
కొలనుపాక కుమారస్వామి, వరంగల్
సెల్: 9963720669

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *