Warangalvoice

amit

Amit Shah: మెజార్టీ రాకపోతే.. ‘ప్లాన్ బి’ ఉందా..? అమిత్ షా సమాధానమిదే..

  • Lok sabha elections: లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ రాకపోతే.. తదుపరి ప్లాన్ ఏంటని మీడియా అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) సమాధానం ఇచ్చారు.

దిల్లీ: కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని భాజపా విశ్వాసంగా ఉంది. లోక్సభ ఎన్నికల సమరంలో భాగంగా ఇప్పటివరకు నాలుగు విడతల పోలింగ్ పూర్తికాగా.. మరో మూడు దశల్లో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు సాధించాలని ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సమయంలో భాజపా అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. జూన్ 4న భాజపాకు 272 సీట్లు రాకపోతే ఎలా..? ప్లాన్ బి ఏంటి..? అంటూ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. అలాగే ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవాల్ను ఉద్దేశించి విమర్శలు చేశారు. (Lok sabha elections)

“అలాంటి అవకాశాలు నాకు కనిపించడం లేదు. 60 కోట్ల లబ్ధిదారుల సైన్యం మోదీకి అండగా ఉంది. వారికి ఎలాంటి కులం లేదు. వయసుతో సంబంధం లేదు. మోదీ అంటే ఏమిటి..? ఆయనకు 400 సీట్లు ఎందుకు ఇవ్వాలి..? అనేది వారికి తెలుసు. ‘ప్లాన్ ఎ’ సక్సెస్ రేట్ 60 శాతం కంటే తక్కువగా ఉన్నప్పుడే ‘ప్లాన్ బి’ని రూపొందించాలి. మాకు ఆ అవసరం లేదు. ప్రధాని మోదీ అఖండ మెజార్టీతో అధికారంలోకి రావడం ఖాయం” అని అన్నారు. 400 సీట్లు వస్తే.. రాజ్యాంగాన్ని మారుస్తారనే ఊహాగానాలపై స్పందించారు. గత 10 ఏళ్లుగా రాజ్యాంగాన్ని మార్చడానికి కావాల్సిన మెజార్టీ తమకు ఉందని, కానీ తాము ఎన్నడూ అలా చేయలేదన్నారు. అలాంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పారు.

అరవింద్ కేజీవాల్ గురించి మాట్లాడుతూ.. “ఎన్నికల ప్రచారం కోసం ఆయన ఎక్కడికి వెళ్లినా.. ప్రజలకు మద్యం కుంభకోణమే గుర్తుకువస్తుందని నేను అనుకుంటున్నా” అని విమర్శలు చేశారు. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం మధ్యంతర బెయిల్పై బయట ఉన్నారు. మీరు ఓటేస్తే.. తాను జైలుకు వెళ్లనవసరం లేదంటూ ప్రచారంలో కేజీవాల్ చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా స్పందించారు. “నేను ఆ మాటలు నేరుగా వినలేదు. ఒకవేళ ఆయన ఆ మాటలు అని ఉంటే.. ఇంతకు మించిన ధిక్కారం మరొకటి ఉండదు. ఎన్నికల గెలుపు ఓటముల ఆధారంగా కోర్టు నిర్ణయాలు తీసుకుంటుందా..?” అని అన్నారు.

amit

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *