వరంగల్ వాయిస్, అలంపూర్ : ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ళ ముందే కాలి పోతున్న దృశ్యాన్ని చూసి రైతు కంట కన్నీళ్లు ఆగలేదు. వివరాల్లోకి వెళితే ఉండవెల్లి మండలం కంచిపాడు గ్రామానికి చెందిన అచ్చన్న అనే రైతు నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాడు. పంట చేతికి అందడంతో మొక్కజొన్న కంకులను కోసి, వాటిని పొలంలోనే కుప్పగా పోసి నూర్పిడి చేసేందుకు నిలువ ఉంచాడు. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించడంతో పొలంలోని నాలుగు ఎకరాల మొక్కజొన్న పంట సుమారు 40 క్వింటాళ్ల ధాన్యం కాలి బూడిదైపోయింది. ఉదయాన్నే పొలం వైపు వెళ్లి చూడగా పంట పూర్తిగా మట్టిలో కలిసిపోయింది.. అప్పటికే మొక్కజొన్న కంకులు కాలుతూనే ఉన్నాయి. ఆ దృశ్యాన్ని చూసి రైతు లబోదిబో అంటూ గుండె బాదుకున్నాడు. బాధిత రైతును ఆదుకోవాలని తోటి రైతులు ప్రభుత్వాన్ని, అధికారులను కోరారు.
