దుర్విచక్షణ, అసమానతలను అధిగమించి దేశీయంగా ప్రగతి సాధించబడాలనేది రాజ్యాంగ నిర్మాతల అభిమతం. కానీ స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు అవుతున్నా అది అందని ద్రాక్షగా మిగిలిపోయింది. భారతీయుల సగటు ఆయుర్ధాయాన్ని నేటికీ కూడా కులమే నిర్దేశిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం వెలువరించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే అధ్యయనం అగ్రవర్ణాలతో పోలిస్తే.. ఎస్సీ, ఎస్టీల జీవిత కాలంలో నాలుగు నుంచి ఆరేండ్లు తగ్గుదలగా ఉన్నట్లుగా చెబుతున్నది. ఆయా సామాజిక వర్గాల సగటు ఆయుఃప్రమాణంతో 20 ఏండ్ల క్రితం 4.6 సంవత్సరాల తేడా ఉంటే 2016 నాటికి అది 6, 1కి పెరిగింది. ప్రజారోగ్యాన్ని ప్రోదిచేయడం ప్రభుత్వాలు, పాలకుల కర్తవ్యం అని 47వ రాజ్యాంగ అధికరణ నిర్దేశిస్తున్నది. కానీ ఈ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించడంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధి కనబరచడం లేదు. ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందాలని 1946లోనే భోర్ కమిటీ సూచించింది. ప్రతీ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పటిష్టపరచాలని 1962లో మొదలియార్ సంఘం ప్రస్తావించింది. జాతీయ ఆరోగ్య విధానాల నుంచి మానవ హక్కుల సంఘం ముసాయిదా వరకు ప్రజారోగ్యం గురించి ఎన్నో ఆదర్శాలు ప్రకటించబడ్డా అవేవీ క్షేత్రస్థాయిలో సమగ్ర కార్యాచరణకు నోచుకోలేదు. అందుకే దేశంలో ప్రజలందరికీ ఆరోగ్య సేవలు ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. ఇవేకాక విద్య, ఉపాధి అవకాశాలు ఆదాయాల్లో తీవ్ర వ్యత్యాసాలు సబ్బండవర్గాల, అణగారిన వర్గాల జీవితాలను దుర్భరం చేస్తున్నాయి. ఇలా భారత సంవిధాన ప్రధాన సూత్రాలైన సమానత్వం, సర్వజన సంక్షేమానికి తూట్లు పడుతున్నాయి.
బడుగు, బలహీన వర్గాలకు అతి తక్కువ వ్యయంలో నాణ్యమైన విద్య, ఆరోగ్య సేవలను వేగంగా అందించాలనే సదాశయంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ ఆరోగ్య మిషను నిధుల కొరత, వైద్య సిబ్బంది తగినంతగా లేకపోవడం లాంటివి సమస్యాత్మకమవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్లేషణలు చెబుతున్నాయి. 2017-21 మధ్య వివిధ మంత్రిత్వ శాఖల పరిధిలో దళితుల సంక్షేమానికి ఉద్దేశించబడ్డ సుమారు 50 వేల కోట్ల రూపాయలు వినియోగానికే నోచుకోలేదనేది మింగుడుపడని సత్యం. చాలా రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉండడం అతిశయోక్తి కాదు. దళిత, గిరిజన శ్రామిక శక్తిలో అధిక శాతం రోజు వారి కూలీలుగా ఎదుగూ బొదుగూ లేని జీవితాలు వెళ్లదీస్తున్నారు. అగ్రవర్ణాలతో పోలిస్తే ఎస్సీ, ఎస్టీ వర్గాల్లోని విద్యాధికులు సమాన అవకాశాలను పొందలేకపోతున్నారు. 75 సంవత్సరాల స్వాతంత్య్రం తర్వాత కూడా ప్రభుత్వోద్యోగాల్లో వారికి తగినంత ప్రాధాన్యం లేదని గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటికీ రహదారులు, రక్షిత మంచినీరు, కనీస పారిశుద్ధ్య సౌకర్యాలు లేని వేలాది దళితవాడలు, ఆదివాసీగూడేలు భారత్ లోని అన్ని రాష్ట్రాల్లో దర్శనమిస్తుంటాయి. బుక్కెడన్నానికి గతిలేక కుక్కి మంచాలపైనే ప్రాణాలు విడుస్తున్న నిరుపేద బతుకులెన్నో.. ప్రజల జీవనహక్కుకు భంగం కలగకుండా అందరికీ ఆహార భద్రత కల్పించడం సంక్షేమరాజ్యం ప్రథమ కర్తవ్యం. కానీ ఇదే విషయాన్ని న్యాయస్థానాలు పదే పదే గుర్తుచేసేలా ప్రజాపాలన పడకేస్తున్న పరిస్థితులు నిత్యం కనిపిస్తున్నాయి. 2015-20 మధ్య దేశ వ్యాప్తంగా 108 ఆకలిచావులు సంభవించినట్లుగా వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ బాధితుల్లో అత్యధికాలు అణగారిన వర్గాల వారే. సన్నకారు రైతులు, వలస కార్మికులను ఆదుకోవడంలో మానవీయస్ఫూర్తి నేటి పాలకుల్లో కొరవడుతున్నది. పోనుపోను తలకు మించిన భారమవుతున్న సేద్యంతో అన్నదాతలు ఉరిపోసుకుంటున్నారు. ఆశకు తావులేని బతుకే ఆత్మహత్యకు దారితీస్తుంది. ఆపత్కాలంలో తానున్నానన్న భరోసాను కల్పించలేని ప్రభుత్వాలు ప్రజలకు భారం. ప్రజలందరి కడుపులు నింపని పథకాలు ఎన్ని ప్రారంభించినా ఏమిటి ఉపయోగం? మనదేశంలో 22.43 కోట్ల మంది పోషకాహారలోపంతో బాధపడుతున్నారని ఐక్యరాజ్యసమితి తాజా ప్రపంచ ఆహార భద్రతా నివేదిక చెబుతున్నది.
పిల్లల్లో దర్భలత్వం, ఎదుగుదల సమస్యల ప్రాతిపదికన వెలువడిన 2021 ప్రపంచ క్షుద్బాధ సూచిలో 116 దేశాల్లో 101వ దేశంగా భారత్ నిలిచింది. ఆకలి, పోషకాహార లోపం కారణంగా దేశంలో ఏడాదికి మూడు లక్షల మంది వరకు చిన్నారులు ఐదేండ్లలోపే మరణిస్తున్నారనేది ఒక అంచనా. ఓట్ల కోసం పోటీలు పడుతూ దండాలు పడుతూ ప్రజల దగ్గరకొచ్చే నాయకులు, ఎన్నికయ్యాక, జనం కడుపులు నింపడం గురించి ఆలోచించడం మాని, జనం కడుపులు ఎలా కొట్టాలనే విషయాల గూర్చి ఎక్కువ శ్రద్ధ చూపెడుతున్నారు. ఈ దుర్భర పరిస్థితులను పరిమార్చడంతో పాటు సమ్మిళితాభివృద్ధి దోహదపడేలా బహుముఖ కార్యాచరణకు ప్రభుత్వాలు పూనుకుంటే తప్ప జనజీవన ప్రమాణాలు మెరుగుపడవు.
బి. ధర్మప్రకాశ్
జనవిజ్ఞానవేదిక, తెలంగాణ
99897 32423