
దామెర ఎస్సై అశోక్ విజ్ఞప్తి
వరంగల్ వాయిస్, దామెర: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం సాయంత్రం నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికల నియమావళి (కోడ్ ఆఫ్ కండక్ట్) అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, దామెర పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలు పాటించాల్సిన నియమాలను దామెర ఎస్సై కొంక అశోక్ సూచించారు. రాజకీయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి ముందుగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి అనుమతులు లేకుండా సమావేశాలు నిర్వహించకూడదు. గ్రామాల్లో ఎలాంటి రాజకీయ పరమైన పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదు. ఏర్పాటు చేసుకోవాలంటే ముందస్తు అనుమతులు తప్పనిసరి. గ్రామాల్లో ఎటువంటి గొడవలు, అల్లర్లు జరగకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలి. ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు ఎటువంటి ప్రలోభాలకు గురి చేసినా, మీకు సమాచారం అందిన వెంటనే డయల్ 100కు లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలి. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. సూచనలను పాటిస్తూ, ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణకు ప్రజలు సహకరిస్తారని దామెర ఎస్సై కొంక అశోక్ ఆశాభావం వ్యక్తం చేశారు.