- సంక్షేమ పాలనలో వినూత్నం, ఆదర్శం
- హనుమకొండ జిల్లా కలెక్టర్ గా రాజీవ్ గాంధీ హన్మంతు తనదైన ముద్ర
ఆయన మంచి పరిపాలనా దక్షుడే కాదు.. గొప్ప మానవతావాది.. ప్రభుత్వ పరంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ నిరుపేదలకు చేయూత నిస్తారు. పాలనాధికారిగా వినూత్న ఆలోచనలతో హనుమకొండ జిల్లాలో సరికొత్తగా పథకాలు అమలు చేస్తూ తన మార్క్ ప్రదర్శిస్తున్న రాజీవ్ గాంధీ హన్మంతుపై వరంగల్ వాయిస్ ప్రత్యేక కథనం..
పాలనలో ఫర్ఫెక్ట్.. మంచి పనిమంతుడు.. పాలనా వ్యవహారాలు చక్కదిద్దడంలో ఆయనది ప్రత్యేకశైలి. ప్రతి పనిని ‘కూల్’గా పూర్తి చేస్తారు. ప్రభుత్వ ఆదేశాలను తూ.చా. తప్పకుండా పాటిస్తారు. ప్రచార ఆర్భాటాల జోలికి వెళ్లరు. జిల్లా సమగ్రాభివృద్ధిలో పాలుపంచుకుంటున్న ఆయనే.. హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తూనే జిల్లాను ప్రగతి పథంలో నిలిపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, అందుతున్న సేవల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూనే..
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పరుగులు పెట్టిస్తున్నారు.
ప్రస్థానం..
1987 జూన్ 16న శ్రీకాకుళం జిల్లాలో వనజాక్షి – కృష్ణారావు దంపతులకు రాజీవ్ గాంధీ హనుమంతు జన్మించారు. విశాఖపట్టణంలోని ఆంధ్రా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ పూర్తి చేశారు. 2012 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ట్రైనీ కలెక్టర్ గా పాఠాలు నేర్చుకున్నారు. తొలుత అసిఫాబాద్ సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టి తొమ్మిది మాసాలపాటు అక్కడ సేవలందించారు. తర్వాత భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా సమర్థవంతంగా పనిచేశారు. 2016లో కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా తొలిసారిగా భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా పనిచేసే అవకాశం ఆయనకు లభించింది. అనంతరం కొమరంభీం అసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. 2020 ఫిబ్రవరి 3న హనుమకొండ (నాటి వరంగల్ అర్బన్) జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా ప్రజలకు సేవలందిస్తున్నారు.
అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
హనుమకొండ జిల్లా సమగ్రాభి వృద్ధిపై కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు ప్రత్యేక దృష్టి పెట్టారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ ఎప్పటికప్పుడు అధికారులు, సిబ్బందితో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అభివృద్ధి పనుల అమలు విషయంలో అలసత్వాన్ని ప్రదర్శించే అధికారులపై కొరడా రaులిపిస్తున్నారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకొని ఆయన ముందుకెళ్తున్నారు. ప్రభుత్వ పథకాల అమలుపై ప్రత్యేక చొరవ చూపుతూనే.. మహా నగరంలో గృహనిర్మాణ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ముఖ్యమంత్రి హామీల పథకం ద్వారా చేపట్టిన పనులన్నీ పూర్తి చేయిస్తున్నారు. కొత్త పురపాలక చట్టం అమలు ద్వారా విలీనమైన గ్రామాలు, మురికివాడల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 21.76 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా కలెక్టర్ ముందుకెళ్తున్నారు. రహదారుల వెంట మొక్కలు నాటడం, కూడళ్ల సుందరీకరణ పనులను పూర్తిచేయిస్తున్నారు. గ్రామాల్లో శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డుల వద్ద కూడా పచ్చదనం పెంపొందేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఎకరం స్థలంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు చర్యలు తీసుకోవడంతో చారిత్రక జిల్లా నందనవనంగా మారుతున్నది. దీంతోపాటు నగరంలో కొత్త పార్కులు అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే 8 పార్కులు ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చారు. గతంలో ఉన్న 14 పార్కులతోపాటు, కొత్తగా 8, రెండు గ్రీన్ లెగస్సీ, వనితా వనం ఏర్పాటు చేశారు. గ్రీన్ బడ్జెట్ 20 కోట్లతో ఓరుగల్లు మహానగరమంతా పచ్చదనం పరుచుకుంటున్నది.
వరద ముప్పు ప్రాంతాల్లో పర్యటన
గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలతో నీటమునిగిన ప్రాంతాల్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు విస్తృతంగా పర్యటించి సహాయక చర్యలు చేపట్టారు. నగరంతోపాటు, గ్రామాలను సందర్శించి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించారు. జిల్లాలో వరద ఉధృతిని స్వయంగా పరిశీలించి చర్యలు తీసుకున్నారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, పంటలు, డ్రెయినేజీలు, ఇళ్లు, వాగులు, ముంపు ప్రాంతాలను పరిశీలించి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. జలదిగ్భందంలో చిక్కుకున్న వారికి ప్రాణనష్టం జరుగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ముంపునకు గురైన బాధితులు, అనారోగ్య సమస్యలతో బాధ పడే వారిని, గర్భిణీ స్త్రీలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వైద్య సేవలు అందించారు. మహానగరంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి బాధితులకు భోజనం, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించారు. అలాగే వందలాది ఎకరాల్లో దెబ్బతిన్న పంటల వివరాలను కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వరదబాధితులు అధైర్యపడకుండా వారిని ఆదుకుంటారనే భరోసా కల్పించారు. ముంపు నివారణకు శాశ్వత పరిష్కారంతోపాటు, బాధితులందరికీ పరిహారం అందేలా కలెక్టర్ కృషి చేస్తున్నారు. నాలాలపై నిర్మించిన అక్రమ కట్టడాలను యుద్ధప్రాతిపదికన తొలగించారు. ఓవైపు కరోనా విలయతాండవం.. మరో వైపు వరదలు బీభత్సం సృష్టించినప్పటికీ జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అప్రమత్తం చేసి ప్రజలచేత ‘శభాష్’ అనిపించుకున్నారు.
స్మార్ట్ సిటీ నిధులతో అభివృద్ధి
వరంగల్ నగర ప్రజల సౌకర్యార్థం స్మార్ట్ సిటీ పథకం ద్వారా రూ. 425 కోట్ల అంచనా వ్యయంతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టి అమలు చేస్తున్నారు. రూ. 25 కోట్లతో భద్రకాళి బండ్ ను నిర్మించి అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దారు. అగ్గలయ్య గుట్ట మీద ఉన్న జైన మందిరాన్ని రూ.కోటి 20 లక్షలతో అభివృద్ధి చేశారు. ప్రాచీన కాలం నుంచి ఈ గుట్ట మీద కొలువైన జైన తీర్థంకరుల విగ్రహాలను ప్రజలు దర్శించుకునేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేయించారు. అలాగే వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లోని చారిత్రక స్థలాలను అభివృద్ధి చేస్తున్నారు. కాళోజీ కళాక్షేత్రం పనులను వేగవంతం చేశారు. కాకతీయ మ్యూజికల్ గార్డెన్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు.
రూ. 4 కోట్లతో ఆక్సిజన్ పార్క్
ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయించి నగరానికి మరిన్ని పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నం కలెక్టర్ చేస్తున్నారు. రాంపూర్‌లో రూ.4 కోట్లతో 90 ఎకరాల విస్తీర్ణంలో ఆక్సిజన్ పార్క్ పనులను ప్రారంభించారు. కాలుష్యంతో సతమతమయ్యే నగర ప్రజలు స్వచ్ఛమైన ఆక్సిజన్ పొందేందుకు పార్క్‌కు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. క్యాంటీన్, జిమ్, పిల్లలకు ఆట వస్తువులు, ఓపెన్ థియేటర్ లాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. వరంగల్‌ను ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేసి ‘వావ్’ ఓరుగల్లు అనేలా రాజీవ్ గాంధీ హనుమంతు చేస్తున్నారు. వేసవిలో జాతీయ ఉపాధిహామీ పథకాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరుగులు పెట్టించారు. లాక్ డౌన్ ప్రభావంతో పనులు కోల్పోయిన ప్రజలు కలెక్టర్ చొరవతో గ్రామాల బాట పట్టారు. వేసవిలో వ్యవసాయ పనులు లేక ఇబ్బందులు పడుతున్న దినసరి కూలీలను ఆయన ఉపాధి వైపు నడిపించారు. అభివృద్ధి పనుల ద్వారా యువతకు ఉపాధి లభించేలా కార్యాచరణ రూపొందించి అమలు చేశారు. ప్రస్తుత చలి కాలంలో వచ్చే ప్రమాదకర మలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్యా వాధులకు ప్రధానకారణమైన దోమల నివారణకు చర్యలు తీసుకున్నారు. అంతేగాక కరోనా వైరస్ నియంత్రణ కోసం జిల్లా యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రూ. 2.50 కోట్ల వ్యయంతో వైరాలజీ ల్యాబ్ ను ఏర్పాటు చేయించారు.
దేవాదులతో సాగునీరు
దేవాదుల ప్రాజెక్టులో భాగంగా జిల్లా పరిధిలో రూ. 78.20 కోట్ల వ్యయంతో నిర్మించిన దక్షిణ ప్రధాన కాల్వ ద్వారా సాగు నీరు అందుబాటులోకి తీసుకొచ్చారు. కాకతీయ మెడికల్ కళాశాల (కేఎంసీ) ఆవరణలో రూ. 150 కోట్ల వ్యయంతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తి చేయించారు. హన్మకొండ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం (జేఎన్‌ఎస్)లో రూ. 8 కోట్ల అంచనా వ్యయంతో సింథటిక్ ట్రాక్ పనులను ప్రారంభించారు. మడికొండ ఐటీ సెజ్ లో సైయెంట్, టెక్ మహీంద్రా ఐటీ కంపెనీలను ప్రారంభించారు. క్వాండ్రంట్ అనే మరో ఐటీ కంపినీకి భూమి పూజ చేయించారు. అలాగే గ్రామాల్లో రైతు వేదిక భవన నిర్మాణ పనులను వేగవంతం చేశారు.
కరోనా కట్టడి
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో రాజీవ్ గాంధీ హనుమంతు సఫలమయ్యారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వ్యాధుల నివారణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలంటారాయన. ఇంటితోపాటు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలంటారు. ‘ప్రతి ఆదివారం ఉదయం పదిగంటలకు 10 నిమిషాలు’ పేరుతో జరుగుతున్న కార్యక్రమంలో ఆయన విధిగా పాల్గొంటున్నారు. కలెక్టర్ అధికార నివాస భవనం, దాని పరిసరాల్లో, పూలకుండీల్లో నిండిన నీటిని ఖాళీ చేయడంతోపాటు, వివిధ ప్రాంతాల్లో నిల్వ ఉన్న వర్షపు నీటిని కలెక్టర్ స్వయంగా తొలగించారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని, పనిలేకున్నా వచ్చి.. ప్రాణాలు కోల్పోవద్దని ఆయన సూచిస్తున్నారు. కరోనా ఉదృతి నేపథ్యంలో పరిశుభ్రతతోపాటు, భౌతికదూరం పాటించడమే శ్రీరామరక్ష అని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రస్తుతం విశ్వమానవుల ముందున్న ఏకైక మందు లాక్ డౌన్. దీనిని స్వీయ క్రమశిక్షణతో ఆచరించి ప్రభుత్వం చేస్తున్న కృషికి చేదోడువాదోడుగా నిలవాలంటారు హన్మకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.





















