- పార్టీ క్యాడర్‌కు ఎమ్మెల్యే చల్లా హెచ్చరిక
- విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న వారిపై సీరియస్
- ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురిపై చర్యలు
- జవాబుదారితనంగా వ్యవహరించాలంటూ హితవు
- పరకాలలో తిరిగి గులాబీ జెండా ఎగురేసేందుకు కృషి చేయాలి
‘‘ప్రజా సేవే లక్ష్యంగా పార్టీ క్యాడర్ ముందుకు సాగాలి.. ప్రతీ ఒక్కరు ప్రజలకు జవాబుదారితనంగా వ్యవహరిస్తూ వారి అభివృద్ధిలో భాగస్వాములు కావాలి.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న టీఆర్ఎస్ పార్టీని పరకాలలో తిరిగి గెలిపించేందుకు కృషి చేయాలి.. వివాదాల్లో తలదూర్చుతూ హద్దు మీరి వ్యవహరిస్తే వేటు తప్పదు..పార్టీ ప్రతిష్ఠను దిగజార్చేవారు ఏ స్థాయిలో ఉన్నా ఉపేక్షించేది లేదు.. పార్టీలో పట్టపగ్గాలు లేకుండా వ్యవహరించేవారిపై చర్యలు తప్పవు..’’ అంటూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారావు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. పరకాల నియోజకవర్గ పరిధిలో వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కొరఢా ఝులిపించినట్లు సమాచారం. వారిని ఇక మీదట ఏ అధికారిక కార్యక్రమాలకు హాజరు కాకుండా హుకుం జారీ చేసినట్లు ప్రచారం సాగుతోంది.
-వరంగల్ వాయిస్, పరకాల
వరంగల్ వాయిస్, పరకాల: పార్టీలో పట్టపగ్గాలు లేకుండా వ్యవహరిస్తున్న వారిపై పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కొరఢా ఝులిపించినట్లు సమాచారం. నియోజకవర్గ పరిధిలో రాసలీలలు, డబుల్ బెడ్ రూం, దళిత బంధు పథకాల్లో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ప్రజా ప్రతినిధులు, ఇద్దరు పార్టీ నేతలపై క్రమశిక్షణ చర్యలు చేపట్టినట్లు వినికిడి. వారిని ఇకనుంచి ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించవద్దంటూ క్షేత్ర స్థాయిలో పనిచేసే సర్పంచులు, ఎంపీటీసీలకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. పార్టీ పేరు చెప్పుకొని కొందరు విచ్చలవిడిగా వ్యవహరించడాన్ని కూడా ఎమ్మెల్యే సీరియస్‌గా తీసుకుని క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు.
అండగా ఉండండి..
ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పార్టీకి ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలని, ప్రజల అవసరాలను తెలుసుకొని ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించేలా కృషి చేయాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సూచించారు. ప్రతీ ఒక్కరు పార్టీ లైనప్‌లోనే పనిచేస్తూ పార్టీకి మంచి పేరు తీసుకురావాలంటూ హితబోధ చేసినట్లు తెలిసింది. అవినీతి, అక్రమాల జోలికి వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని ప్రకటించినట్లు తెలిసింది.
ఐదుగురిపై చర్యలు..
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని, అదే స్థాయిలో నియోజకవర్గంలో కూడా అభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పార్టీ క్యాడర్‌కు సూచించారు. అంతేకాని ప్రభుత్వం అమలు చేస్తున్న డబుల్ బెడ్ రూంలు, దళిత బంధు పథకాల్లో కొందరు కక్కుర్తికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయని వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించినట్లు తెలిసింది. ఇందుకు బాధ్యులుగా మారిన ముగ్గురు ప్రజా ప్రతినిధులు, ఇద్దరు నేతలను పార్టీకి దూరం పెట్టారు. ప్రజాక్షేత్రంలో ఉంటూ తప్పులు చేస్తే దండన తప్పదని ఎమ్మెల్యే హెచ్చరించినట్లు తెలిసింది. పార్టీకి నష్టం కలిగించే సూత్ర, పాత్ర దారులను గుర్తించి పార్టీలో వారి ప్రాధాన్యం తగ్గిస్తామని ప్రకటించడంపై పలువురు హర్షం వ్యక్తం చేసినట్లు సమాచారం.
విమర్శలను తిప్పి కొట్టండి..
సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి .. అవి సత్వరమే పరిష్కారమయ్యేలా చూస్తానంటూ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కార్యకర్తలకు హామీ ఇచ్చారు. అదే విధంగా ప్రభుత్వంపై ఎవరైనా ఆరోపణలు, విమర్శలు చేస్తే ఎవరి స్థాయిలో వారు తిప్పికొట్టాలని, వారికి సహేతుకంగా సమాధానాలు చెప్పాలంటూ పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. అంతేకాని మీరే ఆరోపణలు, విమర్శల్లో చిక్కుకోవద్దంటూ సున్నితంగా మందలించినట్లు సమాచారం.
గులాబీ జెండా ఎగురేయాలి..
పరకాల నియోజకవర్గంలో తిగిరి గులాబీ జెండా ఎగురవేసేలా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సూచించినట్లు తెలిసింది. అందుకు తనవంతు సహాయ, సహకారాలు అందిస్తానని వాగ్దానం చేసినట్లు సమాచారం. ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ప్ జా సేవలో తరించాలని, స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని, ప్రతీ కార్యకర్త స్థానికులకు గుర్తుండిపోయేలా పార్టీ శ్రేణులు వ్యవహరించాలని సూచించినట్లు తెలిసింది.