- బీజేపీ, కాంగ్రెస్ లీడర్లు తన్నుకున్నరు
- రణరంగంగా మారిన బీజేపీ ఆఫీస్ ఏరియా
- అడ్డుకున్న పోలీసులు.. ఒకరికి గాయాలు
జాతీయ పార్టీలు అనేది మరిచారు.. వీధి రౌడీల్లా రోడ్డు మీదే తన్నుకున్నారు.. నువ్వెంతా అంటే నువ్వెంతా అంటూ తిట్టుకున్నారు.. కర్రలతో ఒకరిపై ఒకరు దూకారు.. వాహనాలను ధ్వంసం చేశారు.. అడ్డుకున్న పోలీసులపై కూడా దాడి చేయడంతో ఒకరికి గాయాలయ్యాయి. శుక్రవారం హనుమకొండ హంటర్ రోడ్డు బీజేపీ ఆఫీస్ ఏరియా అంతా రణరంగంగా మారింది. అగ్నిపథ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. దీంతో ఆగ్రహించిన బీజేపీ నేతలు సైతం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తూ.. మాటామాటా పెరిగి ఫైటింగ్ కు దారితీసింది. చివరకు పోలీసులు అందరికీ నచ్చజెప్పి గొడవ సద్దుమణిగింపజేశారు.
– వరంగల్ వాయిస్, హనుమకొండ
వరంగల్ వాయిస్, హనుమకొండ : భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వీధి రౌడీల్లా మారి రోడ్డుమీదే తన్నుకున్నారు. ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు చేసుకున్నారు. నువ్వెంతా అంటే నువ్వెంతా అంటూ తిట్టుకున్నారు. నేతల వాహనాలపై దాడులకు పాల్పడ్డారు. దీంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇరు పక్షాలకు చెందిన నేతలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో హంటర్ రోడ్డు రణరంగంగా మారింది. వారిని నిలువరించేందుకు ప్రయత్నించిన పోలీసులపైకూడా దాడి చేయడంతో సుబేదారి సీఐ గన్‌మెన్ అనిల్ తలకు బలమైన గాయం కాగా వెంటనే అస్పత్రికి తరలించారు. దీంతో హన్మకొండ జిల్లాలో రెండు జాతీయ పార్టీల మద్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన అగ్నిపథ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డితోపాటు మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ ఆధ్వర్యంలో శుక్రవారం హంటర్ రోడ్డులోని బీజేపీ హనుమకొండ జిల్లా కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా, బీజేపీ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే సమయంలో హంటర్ రోడ్‌లోని వేద ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాజ్యసభ సభ్యుడు ఓం ప్రకాష్ మాధుర్ ఆధ్వర్యంలో ఓబీసీ మోర్చా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మతోపాటు సంపర్క్ అభియాన్ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ వి.మురళీధర్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, జిల్లా ఉపాధ్యక్షులు కందగట్ల సత్యనారాయణ, నవనగిరి నిర్మల, కార్పొరేటర్లు చాడా స్వాతి-శ్రీనివాస్ రెడ్డి, రావుల కోమల-కిషన్, మహిళ మోర్చ రాష్ట్ర, జిల్లా, డివిజన్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
బాహాబాహికి దిగిన నేతలు..
కాంగ్రెస్ నేతలు ఆందోళన చేస్తుడడంతో ఆగ్రహించిన బీజేపీ నేతలు సైతం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దూషణలు, బాహాబాహికి దిగారు. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు చేసుకున్నారు. బీజేపీ కార్యకర్తల సంఖ్య ఎక్కువగా ఉండి కాంగ్రెస్ కార్యకర్తల సంఖ్య తక్కువగా ఉండడంతో వారి వాహనాలపై బీజేపీ నాయకులు దాడులు చేశారు. వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో రంగ ప్రవేశం చేసిన సుబేదారి పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేసేందుకు శతవిధాల ప్రయత్నించారు. కాంగ్రెస్ నాయకులకు నచ్చజెప్పి అక్కడినుంచి పంపించి వేశారు.


