- నగరంలో 121 ఏర్పాటుకు ప్రతిపాదనలు
- నేటికీ ముందుకు పడని అడుగులు
- ఇబ్బందులో ప్రజలు
- మొద్దునిద్రలో బల్దియా అధికారులు
రాష్ట్రంలో రెండో అతి పెద్ద నగరంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ నగరాన్ని హైదరాబాద్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా అభివృద్ధి చేస్తున్నట్లు పాలకులు, ప్రజాప్రతినిధులు చేస్తున్న ప్రకటనలు నీటి మూటలుగా మారుతున్నాయి. అధికారుల అలసత్వం, పాలకులు పట్టింపులేని తనంతో నగరం మూడు అడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెనక్కి వెళ్తోంది. నగరంలో నూతనంగా చేపట్టాల్సిన ఎన్నో పథకాలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఇదే బాటలో నగరంలో స్మార్ట్ బస్ షెల్టర్‌ల నిర్మాణ ప్రక్రియను కూడా బుట్టదాఖలు చేశారు. దీంతో పాతకాలపు నాటి బస్ షెల్టర్‌తోనే నగర ప్రజలు సర్దుకోవాల్సి వస్తోంది. నగరంలో మోడ్రన్ బస్ షెల్టర్‌ల నిర్మాణం ఎప్పుడు చేస్తారో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. అసలు నిర్మిస్తారా లేదా అన్న సందిగ్ధం నగర ప్రజల్లో నెలకొంది.
-వరంగల్ వాయిస్, వరంగల్ ప్రతినిధి
వరంగల్ వాయిస్, వరంగల్ ప్రతినిధి: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతుంటే దానికి ఏమాత్రం తీసిపోని విధంగా రాష్ట్ర రెండో రాజధానిగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగా స్మార్ట్ సిటీ నిధులతో నగరంలోని హనుమకొండ బస్టాండ్‌ను స్మార్ట్ బస్ స్టాండ్‌గా ఏర్పాటు చేయడంతోపాటు త్రినగరిగా వెలుగొందుతున్న వరంగల్ మహా నగరంలో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)తో నగరంలో 121 స్మార్ట్ బస్ షెల్టర్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులు నగరంలోని 162 ప్రాంతాలను గుర్తించారు. దీనిలో ముఖ్యమైన 121 ప్రాంతాల్లో స్మార్ట్ బస్ షెల్టర్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే నగరంలో ఏర్పాటు చేయనున్న స్మార్ట్ బస్ షెల్టర్‌లకోసం స్థలాల గుర్తింపు పూర్తి కావడంతోపాటు డిజైన్ కూడా రూపొందించినప్పటికీ అధికారులు, పాలకుల నిర్లక్ష్యంతో పనులు మందుకు సాగడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. స్లోగా సాగుతున్న పనుతున్న పనులతో నగర ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికే వరంగల్ ప్రాంతంలో స్మార్ట్ రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారడంతోపాటు నగర వాసులు రోడ్డుపై నడవలేని పరిస్థితి నెలకొంది. స్మార్ట్ సిటీ నిధుల గడువు కూడా కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే పెంచింది. అధికారులు పనుల్లో వేగం పెంచి పెంచిన గడువుకు అనుగణంగా పనులను పూర్తి చేయాలని నగర ప్రజలు కోరుతున్నారు.
డిజైన్ రెడీ..
నగరంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న స్మార్ట్ బస్ షెల్టర్‌ల డిజైన్‌ను రెడీ చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ ఈ డిజైన్‌ను రూపొందించింది. డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ ఫర్ (డీబీఎఫ్ ఓటీ) బేసిస్‌లో స్మార్ట్ బస్ షెల్టర్‌లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. వీటి నిర్మాణానికి బల్దియా అధికారులు అనుమతులు మంజూరు చేయాల్సి ఉన్నప్పటికీ పెద్దగా పట్టించుకోకపోవడంతో బస్ షెల్టర్‌ల నిర్మాణంలో జాప్యం జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి.
హైఫై వసతులు..
స్మార్ట్ బస్ షెల్టర్‌లనే మోడ్రన్ బస్ షెల్టర్‌లుగా పిలుస్తున్నారు. వీటిలో హైఫై వసతులు కల్పించనున్నారు. నగరంలో నిర్మించనున్న ప్రతి స్మార్ట్ బస్ షెల్టర్‌లో బస్ రూట్, బస్ నెంబర్, వాటి టైమింగ్ తెలిపే విధంగా డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా క్యూ ఆర్ స్కానింగ్ కోడ్, సీసీ కెమరాలు, మొబైల్ చార్జింగ్ పాయింట్‌లు, గార్బేజ్ బిన్స్, బస్సుల రాకపోకలను తెలుపుతూ అనౌన్స్ చేసే విధంగా వీటిని రూపొందించనున్నారు. ప్‌జతి బస్ షెల్టర్‌లో ప్రయాణికులకు ఉపయోగ పడేలా వైఫై సదుపాయాలు కూడా కల్పించనున్నారు. అయితే ప్రయాణికులను ఉపయోగపడేలా మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేయాలని బల్దియా అధికారులు సూచించడంతో ప్లాన్‌లో కొంత మార్పులు చేయనున్నారు.
హనుమకొండ బస్టాండ్‌కు అదే పరిస్థితి..
హనుమకొండ స్మార్ట్ బస్టాండ్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. కొత్త నిర్మాణం కేవలం ప్రతిపాదనలకే పరిమితమైంది. రూ. 80కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో దీనిని అభివృద్ధి చేయాల్సి ఉన్నా పాలకుల నిర్లక్ష్యంతో పనులు ప్రారంభమే కాలేదు. 60 ప్లాట్ ఫారాలతో పాటు ప్రయాణికులకు కూర్చునే విధంగా సీటింగ్‌తోపాటు పాటు వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొత్త బస్టాండ్ నిర్మాణం చేసేలా ప్రణాళికలు సైతం రూపొందించారు. ఫస్ట్ ఫ్లోర్‌లో మూవీ స్క్రీన్, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, హెటల్ తదితర సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు. ఇందుకు గాను నిధులు కూడా మంజూరైనా కొత్త బస్ స్టాండ్ నిర్మాణం పనులు ప్రారంభం కాలేదు.