Warangalvoice

Sincerity Carafe Sundar Raj

సిన్సియారిటీ కేరాఫ్ సుందర్ రాజ్

  • విద్యావేత్త నుంచి కుడా చైర్మన్‌ దాక సుందర్‌ రాజ్‌ యాదవ్‌ విజయ ప్రస్థానం
  • ఉద్యమకారుడిగా, టీఆర్‌ఎస్‌ అధిష్ఠాన విధేయుడిగా పేరు
  • అందరితో కలివిడిగా.. పార్టీకి ట్రబుల్‌ షూటర్‌గా..
  • చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌ కు కుడిభుజంగా ప్రసిద్ధి
  • అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో రేపు ఘన సన్మానం

తెలంగాణ ఉద్యమ కారుడు.. విద్యా సంస్థల అధిపతి.. టీఆర్ఎస్ క్రియాశీల నాయకుడు.. ఈ మూడు విభిన్న రంగాలకు వంద శాతం న్యాయం చేసిన సమర్థత సుందర్ రాజ్ యాదవ్ సొంతం. ఓపిక, సహనం ఆభరణాలుగా, నిబద్ధత, నిజాయితీ పెట్టుబడిగా ఎదిగిన వినయశీలి. దశాబ్దకాలం ఎదురుచూపులకు కుడా చైర్మన్ పదవి రావడం.. ఉద్యమకారుడికి లభించిన సముచిత గౌరవం. ఉమ్మడి జిల్లాలో అతిపెద్ద కమ్యూనిటీల్లో ఒకటైన యాదవ కులానికి దక్కిన గుర్తింపు.. ఏప్రిల్ 7న బాధ్యతలు స్వీకరించిన సుందర్ రాజ్ యాదవ్ ను అఖిల భారత యాదవ మహాసభ ఘనంగా సన్మానించనుంది. 31న (రేపు) హనుమకొండ చింతగట్టు కేఎల్ఎన్ ఫంక్షన్ హాల్ లో సన్మాన వేడుక నిర్వహించనుంది.

కుటుంబ నేపథ్యం..
హనుమకొండ జిల్లా ముచ్చర్ల గ్రామంలో సంగంరెడ్డి వీరలక్ష్మి -లక్ష్మీరాజ్యం దంపతులకు 1970 జనవరి 1న సుందర్‌ రాజ్‌ యాదవ్‌ జన్మించారు. 1999 ఫిబ్రవరి 24న ప్రముఖ న్యాయవాది జంగం భద్రయ్య మనుమరాలు ఆశాజ్యోతిని వివాహం చేసుకున్నారు. ఆయనకు కూతురు అంజలి రాజ్‌ ఉన్నారు. హనుమకొండ శరత్‌ స్కూల్లో ప్రాథమిక విద్య, లష్కర్‌ బజార్‌ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివారు. వరంగల్‌ మండిబజార్‌ మహబూబియా పంజతన్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌, హైదరాబాద్‌ ప్రగతి మహావిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ డిపార్ట్ మెంట్‌లో రీసెర్చ్‌ స్కాలర్‌గా ఉన్నారు. సుందర్‌ రాజ్‌ కుటుంబానికి మొదటి నుంచే రాజకీయ నేపథ్యం ఉంది. ఆయన తండ్రి లక్ష్మీరాజ్యం ముచ్చర్ల గ్రామ పటేల్‌ గా పనిచేశారు. చిన్నాన్న సంగంరెడ్డి సత్యనారాయణ 1983 లో టీడీపీ తరఫున హనుమకొండ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం అప్పటి ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా సేవలందించారు.


విద్యా సంస్థల అధినేతగా..
మాస్టర్‌ జీ విద్యాసంస్థల చైర్మన్‌ సంగంరెడ్డి సుందర్‌ రాజ్‌ జిల్లా ప్రజలకు సుపరిచితుడు. విద్యావేత్తగా తెలంగాణ ఉద్యమకారుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రజా ప్రతినిధులు, అధికారులు, నగరంలోని ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కేజీ టు పీజీ వరకు విద్యాసంస్థలను ఓవైపు నడుపుతూనే.. టీఆర్‌ఎస్‌లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థులు, యువతకు అండగా ఉంటూ పార్టీలో పనిచేసే ప్రతీ కార్యకర్తను కలుపుకొని వెళ్తున్నారు. అధికార పార్టీలో యువనేతగా గుర్తింపు పొంది అగ్రశ్రేణి నాయకత్వానికి దగ్గరై పార్టీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.


చురుకైన ఉద్యమకారుడు..
నాటి ఉద్యమ సారథి, నేటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో నడిచిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సంగంరెడ్డి సుందర్‌ రాజ్‌ చురుకైన పాత్ర పోషించారు. ప్రైవేట్‌ డిగ్రీ, పీజీ కళాశాల యాజమాన్యాల జేఏసీనీ ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షుడిగా ఉంటూ పోరాట పంథాన పయనించారు. పొలిటికల్‌ జాక్‌ వైస్‌ చైర్మన్‌ గా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఉద్యమ ప్రణాళిక రచన చేశారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ ఆధ్వర్యంలో ర్యాలీలు, నిరాహార దీక్షలు, వేలాదిమంది విద్యార్థులతో ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. అదాలత్‌ కేంద్రంగా జరిగిన అనేక పోరాటాల్లో పాల్గొన్న ఆయన సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. మిలియన్‌ మార్చ్‌, వంటా-వార్పు, రైల్‌ రోకో వంటి నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ అమరుడు తిరుపతి కుటుంబానికి ఆర్థిక సాయం, ‘‘లక్ష నినాదాలు-లక్ష నివాళులు’’ అనే కార్యక్రమాన్ని సుందర్‌ రాజ్‌ విజయవంతంగా నిర్వహించారు.

వరించిన పదవి..
టీఆర్‌ఎస్‌ లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న సంగంరెడ్డి సుందర్‌ రాజ్‌ విజేతల వెనక అజేయ శక్తిగా ఎదిగారు. స్టార్‌ లీడర్లకు సమానమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఆయన సంకల్ప సారథి. వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌ ప్రధాన అనుచరుడిగా పేరు గడించిన ఆయన 2009, 2014, 2018 శాసనసభ ఎన్నికల్లో వినయ్‌ భాస్కర్‌ గెలుపునకు కృషి చేశారు. మున్సిపల్‌, ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కష్టించి పని చేశారు. ఏ ఎన్నికలైనా క్షేత్రస్థాయి, ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ, అందరితో కలిసికట్టుగా ఉంటూ అధిష్ఠానం రూపొందించిన కార్యాచరణను అమలు చేస్తున్నారు. ప్రతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తూ హనుమకొండ జిల్లాలో ట్రబుల్‌ షూటర్‌గా పేరెన్నికగన్నారు.
రాజకీయాల్లో క్రియాశీలకంగా కొనసాగుతున్న సుందర్‌ రాజ్‌ కు గతంలో అవకాశాలు అంది వచ్చినట్టే వచ్చి చేజారాయి. పార్టీకి విధేయుడిగా, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌కు ప్రధాన అనుచరుడిగా ఉన్న ఆయన పలుమార్లు ఎమ్మెల్సీ టికెట్‌ ఆశించి భంగపడ్డారు. 2014 స్వరాష్ట్ర ఏర్పాటు అనంతరం, 2020 లో ప్రధాన పోటీదారు గా నిలిచి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు తప్పుకున్నారు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్‌ పదవికి ఈసారి బలంగానే ఆయన పేరు వినిపించింది. ఏ పదవి లేకున్నా అధిష్ఠానం ఆదేశానుసారం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారన్న సానుభూతి తోడైంది. దీంతో అధిష్ఠానం సుందర్‌ రాజ్‌ కు అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. కుడా చైర్మన్ గా అవకాశం లభించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తన సిన్సియారిటీ ని గుర్తించి చైర్మన్‌ గా అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేటర్లు, అధికారులు, ప్రజల సహకారంతో వరంగల్‌ పట్టణ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని సంగంరెడ్డి సుందర్‌ రాజ్‌ పేర్కొన్నారు.


31న యాదవ మహాసభ ఆధ్వర్యంలో సన్మానం..
కుడా చైర్మన్ గా 7-4-2022న బాధ్యతలు చేపట్టిన సుందర్ రాజ్ యాదవ్ ను అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో జులై 31(ఆదివారం)న ఘన సన్మానం చేయనున్నారు. ఈ వేడుక హనుమకొండ చింతగట్టులోని కేఎల్ ఎన్ ఫంక్షన్ హాల్ లో జరుగనుంది. ముఖ్య అతిథులుగా పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హాజరుకానున్నారు. ఇంకా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రానున్నారు. అలాగే యాదవ కులస్తులు భారీగా తరలిరానున్నారు.

ప్రొఫైల్

పేరు : సంగంరెడ్డి సుందర్‌ రాజ్‌ యాదవ్‌
హోదా : చైర్మన్‌, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా)
పుట్టిన తేదీ : 01-01-1970
విద్యార్హత : ఎంబీఏ, రీసెర్చ్‌ స్కాలర్‌ (బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌) కాకతీయ యూనివర్సిటీ
తల్లిదండ్రులు : సంగంరెడ్డి వీరలక్ష్మి-లక్ష్మీరాజ్యం
వివాహం : 24-02-1999
సతీమణి : ఆశాజ్యోతి
కుమార్తె : అంజలి రాజ్‌
వృత్తి : విద్యావేత్త
ప్రవృత్తి : పాలిటిక్స్‌
అడ్రస్‌ : ఇ.నెం. 2-10-751/1, ఎస్‌ బి హెచ్‌ కాలనీ, సుబేదారి, హన్మకొండ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *