
- ఐకాన్ స్టార్ ఔదార్యం..
- డ్రైవర్ ఇంటి నిర్మాణానికి రూ.15లక్షల సాయం
- కమలాపూర్ వాసి, డ్రైవర్ మహిపాల్ ఇంట విరిసిన ఆనందం
వరంగల్ వాయిస్, హనుమకొండ: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ .. పాన్ ఇండియా లెవల్ లో తగ్గేదేలే.. అనే నటనతో ఉర్రూతలూగిస్తున్న విషయం తెలిసిందే. మెగా కంపౌండ్ నుంచి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నటన, డాన్స్ , డైలాగ్ డెలివరీలో తనదైన మార్క్ చూపించుకుంటున్నాడు. సినిమా సినిమాకు తన కెరీర్ ను ఉన్నతంగా మలుచుకుంటున్నాడు. ఐకాన్ స్టార్ గా వరల్డ్ వైడ్ అభిమానులను సంపాదించుకుంటున్నాడు. అయితే ఈ అల్లు వారి అబ్బాయి.. నటుడిగానే కాకుండా రియల్ లైఫ్ తన మంచి మనస్సుతో అందరినీ హృదయాలను ఆకట్టుకుంటున్నాడు. అభిమానులతో పాటు తన దగ్గర పనిచేసే వ్యక్తులను కూడా సొంతింటి వారిలాగా చూసుకోవడం ఆయనకే చెల్లింది. తాను మాత్రమే బాగుండడం కాదు.. తన దగ్గర పనిచేసేవాళ్లు కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తి ఆయన. తాజాగా తన డ్రైవర్‌ను ఆదుకుని తన ఔదార్యాన్ని చాటుకున్నాడు.
అల్లు అర్జున్ తన దగ్గర 10ఏళ్లుగా పనిచేస్తున్న డ్రైవర్ ఒ. మహిపాల్ ఇల్లు నిర్మించుకోవడానికి రూ. 15లక్షలు బహుమతిగా ఇచ్చాడు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన మహిపాల్ 10ఏళ్లుగా అల్లు అర్జున్ వ్యక్తిగత డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్ బోరబండలో నివాసం ఉంటున్న మహిపాల్ ఇటీవలే ఇల్లు నిర్మాణం మొదలుపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ 15లక్షల రూపాయలు మహిపాల్‌కు చెక్కుల ద్వారా ఇచ్చాడు. 10లక్షల చెక్కు ఒకసారి, 5లక్షల చెక్కు ఒకసారి ఇచ్చాడు. అల్లు అర్జున్, ఆయన సతీమణి స్నేహరెడ్డి ఇద్దరి జాయింట్ అకౌంట్ నుంచి రూ.15లక్షలు తన డ్రైవర్ ఇల్లు నిర్మాణానికి ఇచ్చి తన ఉదారతను చాటుకున్నాడు.
తమ దగ్గర పనిచేసిన వాళ్లకు జీతం ఎగ్గొట్టే మనుషులున్న ఈ కాలంలో తన డ్రైవర్ కు గౌరవప్రదమైన జీతం ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణం కోసం రూ.15లక్షలు ఇవ్వడం సాధారణ విషయం కాదు. ఒక సాధారణ డ్రైవర్ గా 15లక్షలు సంపాదించాలంటే అంతా ఈజీ కాదు. కానీ ఐకాన్ స్టార్ తన నిష్కల్మషమైన హృదయంతో తన డ్రైవర్ కు సాయం చేయడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఈ విషయమై మహిపాల్ కుటుంబం ఎంతో ఆనందంగా ఉన్నారు. అల్లు అర్జున్ దగ్గర పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు, తనను డ్రైవర్ గా పెట్టుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తన ప్రేమను చాటుకుంటున్నాడు.