Warangalvoice

parthaqsaradhi

సాంకేతిక ప్రపంచంలో దూసుకెళ్లండి

  • ఆత్మన్యూనతా భావాన్ని విడనాడాలి..
  • ఎలాంటి ఆకర్షణలకు లోను కావొద్దు..
  • లక్ష్యాన్ని ప్రేమించి నిరంతరం శ్రమించాలి
  • కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి..
  • రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి
  • ఆర్జీయూకేటీ బాసరలో విద్యార్థులకు ఉద్బోధ

ప్రస్తుత సాంకేతిక యుగంలో తెలివి ఏ ఒక్కరి సొత్తు కాదని, నిరంతరం శ్రమించిన వాడే విజేత అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ప్రేరణ కలిగించారు. శనివారం ఆర్జీయూకేటీ బాసరలో ‘ఇంజినీరింగ్ విద్య, నైపుణ్యం – భవిష్యత్తు’ అనే అంశంపై విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. తన జీవితంలో జరిగిన ఘటనలను ఉదహరిస్తూ.. విద్యార్థులకు స్ఫూర్తివంతమైన ప్రసంగం చేశారు. పేద విద్యార్థులు కుటుంబ పరిస్థితులను తలుచుకుని కుమిలిపోవద్దని, లక్ష్యాన్ని ప్రేమించి కసితో, పట్టుదలతో చదివి గెలుపు బావుటా ఎగురవేయాలని సూచించారు. ప్రస్తుత సాంకేతిక యుగంలో ప్రతీ ఇంజినీరింగ్ విద్యార్థి ఒక సృష్టికర్త, ఒక ఆవిష్కర్త కావాలని కాంక్షించారు.
-వరంగల్ వాయిస్, బాసర

వరంగల్ వాయిస్, బాసర: విద్యార్థులు ఆత్మన్యూనతా భావాన్ని వీడి స్వేచ్ఛ జీవిగా సాంకేతిక పరిజ్ఞాన శాస్త్రీయ రంగాలలో దూసుకెళ్లాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఉద్బోధించారు. శనివారం ఆర్జీయూకేటీ బాసరలో ఇంజినీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి ‘ఇంజినీరింగ్ విద్య, నైపుణ్యం – భవిష్యత్తు’ అనే అంశంపై రాష్ట్ర ఎన్నికల ఆయన మాట్లాడారు.. విద్యార్థులతో మాట్లాడే అభిరుచి, అలవాటు తనకు ఉందని, ఇలాంటి అవగాహన సదస్సులకు ఆసక్తి చూపిస్తానన్నారు. తల్లితండ్రులు మొదటి గురువులని ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను ప్రేమానురాగాలతో చూసుకోవాలని విద్యార్థులకు సూచించారు. అందుకే తన తల్లితండ్రుల పేరిట తాను పాఠశాల, కళాశాల విద్యార్థులకు అవార్డులు గోల్డ్ మెడల్ రూపంలో ఇస్తూ ఉంటానని పేర్కొన్నారు. తెలివి కొంతమంది సొత్తు కాదని, పుట్టిన ప్రతీ మనిషికి ఒక పేరు ఉంటుందని.. ఆ పేరు, మన ప్రవర్తన వల్లనే ఉన్నత స్థితికి వెళ్తామా.. అధమ స్థితికి వెళ్తామా అనేది తెలుస్తుందన్నారు. జీవితంపై మన వైఖరి ఏమిటి అని ప్రశ్నిస్తూ ఉంటే మనలో కొత్త శక్తి పుట్టుకొస్తుందని, ప్రతీ మనిషి తన పుట్టుక ఏమిటో తెలియదని తన భవిష్యత్తు మాత్రం తనకు తెలుస్తుందన్నారు. తన జీవిత అనుభవాన్ని జోడిస్తూ విద్యార్థులకు మనోధైర్యాన్ని కల్పిస్తూ మార్గదర్శకులయ్యారు.

ఆవిష్కర్తలు కావాలి..
విద్యార్థులు దురాలవాట్లకు దూరంగా ఉండాలని, మంచి ప్రవర్తనను కలిగి ఉండాలన్నారు. కొత్తగా వస్తున్న, మారుతున్న పరిస్థితులను తగ్గట్టు నైపుణ్యాలను పెంచుకోవాలని పిలుపునిచ్చారు. కంప్యూటర్ లో నుంచి మొబైల్ లో ప్రపంచమంతా ఉందని, అరచేతిలో ప్రపంచాన్ని చూడగలుగుతున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో మన దైనందిన వ్యవహారాల్లో చేస్తున్న పనులకు చాలా మటుకు స్వస్తి పలకాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. విద్యార్థులు సృష్టికర్తలుగా, నూతన ఆవిష్కర్తలుగా ఎదగాలంటే ఒక్క బ్రాంచిపై పట్టు సాధించడం కన్నా అన్ని బ్రాంచీలలో ఉన్న విషయాలను తెలుసుకున్నవాడే సమగ్రమైనా నైపుణ్యం గల విద్యార్థిగా గుర్తింపు పొందుతాడన్నారు. ఆ విద్యార్థికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని చెప్పారు. మనం చదువుతున్న సందర్భంలో మన కుటుంబ నేపథ్యం, ఇతరాత్ర పరిస్థితులను నెమరువేసుకోరాదని లక్ష్యం వైపే మన దృష్టి ఉండాలన్నారు.

స్వీయ మూల్యాంకనం చేసుకోవాలి..
తన జీవితంలో జరిగిన సంఘటనను ఉదాహరణగా ఆయన విద్యార్థులకు చెప్పారు. తన తల్లిదండ్రులు డాక్టర్ కావాలని కలలు కన్నారని, కానీ నా కలను తల్లిదండ్రులకు చెప్పేసరికి వారు తనను ప్రోత్సహించారన్నారు. దానికి అనుగుణంగా కసిగా, పట్టుదలతో చదివి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యానన్నారు. విద్యార్థులు మనసును నియంత్రణలో పెట్టుకోవాలని, లక్ష్యాన్ని ప్రేమించాలని యువత ఆకర్షణలకు లోనుకాకూడదని విజయంపై నిరంతరం శ్రమించాలన్నారు. ప్రతి మనిషి తనకు తానుగా స్వీయ మూల్యాంకనం చేసుకొని తప్పులను ఒప్పులుగా మార్చుకొని విజయతీరాలను అందుకోవాలని పిలుపునిచ్చారు. సాంకేతిక కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు మూక్స్ అనే ఆన్ లైన్ ప్లాట్ ఫారం ద్వారా అద్భుతాలు సృష్టించవచ్చని తెలిపారు.

ప్రాక్టికల్ పరిజ్ఞానం ముఖ్యం..
ఇంజినీరింగ్ విద్య అంతా కూడా అప్లికేషన్ ఓరియంటెడ్ గా ఉంటుందని, తరగతి గదిలో నేర్చుకున్న అంశాలపై ప్రాక్టికల్ గా పట్టు సాధించాల్సి ఉంటుందన్నారు. ఈ క్రమంలో ఇంజినీరింగ్ విద్యార్థులు ల్యాబ్ లకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దీంతో సబ్జెక్టు పై సులువుగా పట్టు సాధించవచ్చన్నారు.

కమ్యూనికేషన్ స్కిల్స్..
తనకు సబ్జెక్టుపై బాగా పట్టు ఉందని, తన దగ్గర సందేహాలు నివృత్తి చేసుకున్న వారికి సైతం ఉద్యోగాలు వచ్చాయని, తనకు ప్రతీసారి నిరాశే ఎదురవుతుందని కొందరు వాపోతుంటారన్నారు. అయితే వారికి సబ్జెక్ట్ ఉన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడంతోనే ఇలా జరుగుతుందన్నారు. అందుకే ప్రతీ ఒక్కరూ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలన్నారు.

విశ్వవిద్యాలయం అవకాశాలు కల్పించాలి..
విద్యార్థులందరికీ ఉపాధి అవకాశాలు లభించేలా లెక్చరర్లు కృషి చేయాలని సూచించారు. విశ్వవిద్యాలయం పరిశ్రమల ప్రతినిధులను ఆహ్వానించి వారి అవసరాలు తెలుసుకోవాలని, తదనగుణంగా కరిక్యులం మార్చాలన్నారు. కేవలం విద్యార్థులను తరగతి గదికే పరిమితం చేయకుండా ప్రాక్టికల్ పరిజ్ఞానానికి చేరువ చేయాలన్నారు. వివిధ కార్యక్రమాల నిర్వహణ ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించాలన్నారు. ఇంటర్నిషిప్, అప్రెంటిషిప్ దిశగా విద్యార్థులను ప్రోత్సహిస్తూ సహాయం అందించాలని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఆర్జీయూకేటీ ఉపకులపతి ప్రొఫెసర్ వెంకటరమణ, డైరెక్టర్ సతీష్ కుమార్, ఇంజినీరింగ్ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాల విద్యార్థులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *