Warangalvoice

Fun filled Sankranti celebrations

సరదాగా సాగిన సంక్రాంతి వేడుకలు

సంక్రాంతి అంటేనే సరదా అన్న రీతిలో పండుగ సాగింది. ప్రజలంతా అష్టకష్టాలు పడి సొంతూళ్లకు వెళ్లి పండగ చేసుకున్నారు. గత మూడేళ్లుగా కరోనా భయాల మధ్య సాగిన పండగ ఇప్పుడు సరదాగా సాగింది. సంస్కృతిని ప్రతిబింబించేవి పండుగలే. ఈ పండుగలు, ఉత్సవాలు, జాతరలు, కొలుపులు మొదలైనవన్నీ మన సంస్కృతిలో భాగం. తెలుగునాట సంక్రాంతిని ముఖ్యమైన పండుగగా చెప్పుకోవచ్చు. తెలుగునాట సంక్రాంతి, తమిళనాడులో పొంగల్‌, కేరళలో ’ఓణం’ ఇటువంటి పండుగే. కన్నడ, మరాఠీ ప్రజలు కూడా ఈ పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఇది పంటల పండుగ. పంట రైతు ఇంటికి చేరి ప్రతి ఇల్లు ధాన్యలక్ష్మితో కళకళలాడే సమయం ఇది. మొదటిరోజు భోగి, రెండవ రోజున సంక్రాంతి, మూడవ రోజున కనుమ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. సంక్రాంతి అంటే భోగి మంటలు, పాడిపంటలు, పిండి వంటలు మాత్రమే కాదు… రంగురంగుల ముగ్గులతో, పువ్వులు అలంకరించిన గొబ్బెమ్మలతో, హరిదాసు పాటలు, గంగిరెద్దుల ఆటలు, పతంగాల రెపరెపలు, కోడిపెందేలు, కోలాటాలు, పిల్లల కేరింతలు, బంధు మిత్రుల పరామర్శలతో గ్రామాలు పంచరంగుల హరివిల్లుగా కనిపించింది. సంక్రాంతి కర్షకుల పండగ. ఆరుగాలం కష్టించిన ఫలితాన్ని నట్టింట నింపుకునే పండుగ. ఈ పంటల పండుగను దేశంలోని అనేకచోట్ల అనేక పేర్లతో, ప్రాంతాల వారీగా విభిన్నమైన రీతుల్లో వైవిధ్యభరితంగా జరుపుకున్నారు. ప్రతి ఇల్లూ పచ్చని తోరణమై, వీధి వీధీ జన సందోహమై, ప్రతి హృదయం ఆనందాల హరివిల్లయి, పట్టణ ప్రజలంతా పల్లెలకు తరలడంతో ఆనందం వెల్లివిరిసింది. ఒకచోట చేరి సంతోషాల్ని కలబోసుకుని సంబరం చేసుకున్నారు. ఇళ్ల ముంగిట రంగురంగుల ముగ్గులతో స్వాగతం పలికాయి. గొబ్బిపాటల కోలాహలం,కోడిపుంజుల పోట్లాటలు, గంగెద్దుల హడావిడి తెలుగు లోగిళ్లలో సందడి చేశాయి. ఇకపోతే ఆంధ్రాలో కోడిపందాలు ఆగలేదు. తమిళనాట జల్లికట్టు ఆగలేదు. కేసులు, బైండోవర్లు,నిఘా మాటున కోడిపందాలు జోరుగా సాగాయి. కోడి పందాల మాటున కోట్లు చేతులు మారాయి. కోడిపందాలపై ఆంక్షలు ఉన్నా ప్రజలు తమకు నచ్చిన విధంగా పండగ చేసుకున్నారు. తెలంగాణలో మద్యం ఏరులై పారింది. పంతగుల జోరూ కొనసాగింది. పతంగులను ఎగరేయడం హైదరాబాద్‌లో కోలాహలంగా సాగింది. ఇక ఆంధ్రాలో మొత్తంగా రాజకీయ నేతలు కోరుకున్న విధంగా పందాలు సాగిన తీరుతో సంక్రాంతి ఎంజాయ్‌ చేశారు. ఏటా కోడిపందాల కోసం కోర్టుల చుట్టూ తిరిగి దానిని సాధించే అవసరం లేకుండానే కోడి పందాలను జరుపుకున్నారు. తమిళనాట జల్లికట్టు కోసం ప్రాణాలకు తెలగించి పోరాడారు. ఆధునిక జీవనాన్ని అలవాటు చేస్తోన్న పట్టణీకరణ… కార్పొరేటీకరణ దెబ్బకు పల్లెలు, అచ్చ తెలుగు సాంప్రదాయాలు కనుమరుగవుతున్న వేళ ప్రజలంతా గ్రామాలకు తరలి నిత్యంఉండే బాధలనుంచి ఉపశమనం పొందారు. ఇకపోతే కొందరికి సంక్రాంతి అంటే జూదం, తాగుడు, కోడిపందేలే అన్నట్టుగా ప్రజాప్రతినిధులే దగ్గరుండి నిర్వహించడమనే సంస్కృతి ఏయేటికాయేడు పెరుగుతోంది. పోలీసులు ఎంతగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా కోస్తా బరుల్లో పందెం కోళ్లు కత్తులు దూశాయి. ఎట్టి పరిస్థితుల్లో కోడిపందేలు నిర్వహించేందుకు వీలులేదంటూ చేసిన హెచ్చరికలు గాలిలో కలిసిపోయాయి. ప్రజాప్రతినిధుల అండతో కోడిపందేలు పెద్దఎత్తున చేపట్టారు. సంప్రదాయం ముసుగులో నిర్వహించిన పందేల్లో వేలాది కోళ్లు నేలకొరిగాయి. ఇదే సందర్భంలో పందెంరాయుళ్లు చెలరేగిపోయారు. పందాల్లో కోట్లు చేతులు మారాయి. వీటి ప్రాంగణాల్లోనే ఏర్పాటు చేసిన గుండాట, పేకాట యథేచ్ఛగా కొనసాగింది. బరుల చెంతనే మద్యం ఏరులై పారింది. ముందుగా అనుకున్న ప్రాంతాల్లోనే కోడి పందాలు నిర్వహించిన పందెంరాయుళ్లు ఈసారి రాత్రికి రాత్రే కొత్త బరులను ఏర్పాటు చేసుకోవడం విశేషం. ఈ బరుల్లో కోడి పందేలను కొందరు ప్రజాప్రతినిధులు స్వయంగా పర్యవేక్షించడం గమనార్హం. పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు పందాలను వీక్షించారు. వందలాదిగా తరలివచ్చిన కార్లు, వేల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు, జనంతో తిరునాళ్ల వాతావరణం నెలకొంది. మినీస్టేడియం తరహాలో బరి చుట్టూ గ్యాలరీ ఏర్పాటు చేసుకుని మరీ పందాలను నిర్వహించారు. వీఐపీలు, వీవీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలను కేటాయించారు. పలువురు మహిళలు సైతం ఇక్కడ పందేలను వీక్షించగా వారి కోసం ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేశారు. పందాలను వీక్షించేందుకు వచ్చిన ముఖ్యులకు ఆతిథ్యం ఇచ్చేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. ఇక కార్లు, ఇతర వాహనాల పార్కింగ్‌ కోసం ఖాళీ స్థలాలను సిద్ధం చేశారు. బరితో పాటు పార్కింగ్‌ స్థలాల్లో బందోబస్తు కోసం ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని నియమించారు. ఇక తమిళనాడుతో జల్లికట్టు పోటీలు వైభవంగా మొదలయ్యాయి. మధురై కేంద్రంగా ఈ సంప్రదాయక్రీడ నిర్వహణకు అడ్డులేకుండా పోయింది. రాష్ట్ర మంత్రులు, జిల్లా కలెక్టరు ఈ సంప్రదాయ క్రీడా పోటీలను ప్రారంభించగా పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన యువకులు ఉత్సాహంతో కదన రంగంలోకి దిగారు. వాడివాసల్‌ నుంచి దూసుకువస్తున్న ఎద్దులను అణచే ప్రయత్నం చేయడం, దానిని తప్పించుకుని ఎద్దులు మైదానంలో పరుగులుపెట్టడం, వాటిని యువకులు వెంబడిరచడం వంటి దృశ్యాలు సందర్శకులను ఆనందోత్సహాలకు గురిచేశాయి. పోటీదారుల ఎద్దులు ఒక్కొక్కటిగా వాడివాసల్‌ నుంచి మైదానంలోకి దూకాయి. వాడివాసల్‌ వద్ద నిరీక్షించిన యువకులు వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించగా దానిని చేధించుకుంటూ ఎద్దులు మైదానంలో ముందుకు ఉరకలు వేశాయి. వాటిని ఎలాగైనా పట్టుకోవాలనే పట్టుదలతో యువకులు వాటిని వెంబడిరచారు. పలువురు వాటి మూపురాలను పట్టుకుని నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ ఎద్దుల వేగం, విదిలింపులకు ఆ ప్రయత్నాలు ఫలించలేదు. కొన్ని ఎద్దులు మైదానంలోని యువకులను ప్రతిఘటిస్తూ వారిపైకి కొమ్ములు విసిరే ప్రయత్నాలు చేశాయి. ఈ క్రీడలో గాయపడేవారి కోసం ముందుస్తు చర్యలలో భాగంగా వైద్యబందాలను సిద్ధంగా ఉంచారు. అంబులెన్సులు, రెండు వెటర్నరీ అంబులెన్సులు, సిబ్బందితో సహా అగ్నిమాపక వాహనాలను అక్కడే సిద్ధం చేసి మరీ
జల్లికట్టును నిర్వహించారు. మొత్తంగా సంక్రాంతిలో పందాలకు పెద్దపీట వేసిందన్న విషయం మరోమారు రుజువయ్యింది.

Fun filled Sankranti celebrations
Fun filled Sankranti celebrations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *