- ‘భద్రకాళి’ సన్నిధిలో అంతా ఆగమాగం
- సమయపాలన పాటించని సిబ్బంది
- ఇష్టారాజ్యంగా పార్కింగ్
- చెప్పుల స్టాండ్ ఉన్నా ఉపయోగమే లేదు
- ప్రసాదాల కోసం ఎండలోనే క్యూ
- విడిది సౌకర్యాన్ని వినిపించుకోని ఆలయ అధికారులు
- బిచ్చగాళ్లతో బెంబేలెత్తుతున్న భక్తులు
శ్రీ భద్రకాళీ దేవస్థానంలోని అమ్మవారిని తనివితీర దర్శించుకుందామని వచ్చే భక్తులకు ఇక్కడి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఆలయ పరిధిలో లెక్కకు మించి సిబ్బంది ఉన్నా ఎవరు ఎక్కడ విధులు నిర్వహిస్తారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఇందులో చాలా మంది దేవాదాయ శాఖకు చెందిన వారు కాగా మరి కొందరు కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు. వీరిని పర్యవేక్షించే వారు లేకపోవడంతో అంతా దైవాదీనంగా మారింది. అయితే కొంతమంది సిబ్బంది ఆఫీసుకు వచ్చి అందరికీ అలా కనిపించి రిజిస్టర్‌లో సంతకం పెట్టి తర్వాత సొంత పనులకోసం బయటికి వెళ్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఆలయంలో పర్యవేక్షణ గాడి తప్పి సమస్యలకు కారణంగా మారుతోందని భక్తులు
ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
-వరంగల్ వాయిస్, వరంగల్ ప్రతినిధి
వరంగల్ వాయిస్, వరంగల్ ప్రతినిధి: చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానం సమస్యలకు నిలయంగా మారింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం నలుమూలనుంచి వచ్చి భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటున్న వారి సంఖ్య దినదినాభివృద్ధి చెందుతోంది. భక్తులతోపాటు సమస్యలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. వాటిని పరిష్కరించడంలో దేవాదాయ శాఖ అధికారులు గాని, ఆలయ అధికారులు గాని పెద్దగా పట్టించుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం కాటేజీలు నిర్మించాలన్న వాదన కొన్ని సంవత్సరాలుగా వినిపిస్తున్నా ఆ దిశగా దేవాలయ అధికారులు అడుగులు వేయడం లేదు. దీంతో సూదూర ప్రాంతాలనుంచి వచ్చే వారు అమ్‌ఆవారి సన్నిధిలో ఉండే అవకాశాన్ని కోల్పోవడంతోపాటు బస చేసేందుకు ప్రైవేట్ లాడ్జిలను ఆశ్రయించి పడరాని పాట్లు పడుతున్నారు. కాటేజీల నిర్మాణానికి కావాల్సినంత స్థలం, నిధులు ఇచ్చేందుకు దాతలు సిద్ధంగా ఉన్నా ఆలయ అధికారులు మాత్రం చొరవ చూపడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం మాదిరిగా అభివృద్ధి చేస్తే అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భక్తుల సౌకర్యార్థం తాగునీటి వసతిని ఏర్పాటు చేసిన ఆలయ సిబ్బంది తాగేందుకు కావాల్సిన గ్లాసులను మాత్రం ఏర్పాటు చేయలేదు. అక్కడే ఒకే ఒక్క గ్లాసు ఉండడంతో ఒకరు తాగిన తర్వాత మరొకరు తాగేందుకు వేచి ఉండాల్సి వస్తోందని భక్తులు ఆరోపిస్తున్నారు.
సిబ్బంది ఇష్టారాజ్యం..
ఆలయ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరు ఉదయమే ఆలయానికి వచ్చి రిజిస్టర్‌లో సంతకం చేసి తర్వాత కనిపించకుండా పోతున్నారని, దీంతో ఆలయంలో పర్యవేక్షణ ఇబ్బందిగా మారుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం భక్తులతో కిటకిటలాడే ఈ ఆలయ కార్యనిర్వహణాధికారిని మరో రెండు మూడు దేవాలయాలకు ఇన్‌చార్జిగా నియమించడంతో అమె ఆ ఆలయాలకు చెందిన పనులతోనే సతమతమవుతున్నారని, దీంతో సిబ్బందిపై అజమాయిషీ చెలాయించలేకపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సిబ్బందికూడా ఏ సమయంలో ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది.
ప్రసాదాలపై నిర్లక్ష్యం..
అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అక్కడ విక్రయిస్తున్న లడ్డు, పులిహోరను అత్యంత భక్తి శ్రద్ధలతో కొనుగోలు చేస్తుంటారు. దీనిని అమ్మవారికి ప్రతిరూపంగా భావిస్తారు. తినేముందుకూడా దానిని కళ్లకు అద్దుకొనే నోటిలో వేసుకుంటారు. ఇంటికి పోయాక కూడా కుటుంభ సభ్యులందరికీ ప్రసాదంగా అందజేస్తారు. ఇంతటి ప్రాముఖ్యం కలిగిన ప్రసాదాల తయారీలోనూ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో లడ్డు తయారీలో నాణ్యత ప్రామాణాలు పాటించడంలేదంటూ దుమారం లేవగా సోమవారం శాకాంబరీ ఉత్సావాలకు హాజరైన భక్తుడు కొనుగోలు చేసిన పులిహోరలో గండు చీమలు వచ్చినట్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. దీనికి సంబంధించిన ఫొటోను కూడా ప్రచురించారు.
ప్రసాదాలకోసం ఎండ, వానలోనే క్యూ..
ప్రసాదాలకోసం కూడా భక్తులు పడరాని పాట్లు పడుతున్నారు. మొదట ద్వారానికి ఒక వైపు డబ్బులు చెల్లించి టోకెన్ కొనుగోలు చేసి తర్వాత రెండో వైపు ప్రసాదాలకోసం క్యూ కట్టాల్సి వస్తుందని భక్తులు ఆరోపిస్తున్నారు. ప్రసాదాలకోసం ఒకే క్యూ లైన్ ఏర్పాటు చేసి మొదట టోకెన్ తీసుకొని అదే వరుసలో ముందుకు వెళ్లి ప్రసాదాలు తీసుకునేలా ఏర్పాట్లు చేస్తే బాగుంటుందంటున్నారు. దీనికి తోడు ప్రసాదాలకోసం ఎండా కాలంలో ఎండలో, వానా కాలంలో వానలోనే క్యూ కట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భక్తులకోసం షెడ్‌లను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. లేకుంటే కనీసం షేడ్ నెట్‌లనైనా ఏర్పాటు చేయాలంటున్నారు.
బిచ్చగాళ్లతో బెంబేలు..
అమ్మవారి సన్నిధిలో లెక్కకు మించి ఉన్న బిచ్చగాళ్లతో భక్తులు బెంబేలెత్తుతున్నారు. దర్శనం ముగించుకొని వచ్చే భక్తులను అసభ్య పదజాలంతో పిలుస్తూ భయ బ్రాంతులకు గురి చేస్తున్నారు. వీరి నోటి దురుసుకు భయపడి చాలా మంది భక్తులు దూరంగా పారిపోతున్నారు. గేటు బయట ఉండాల్సిన బిచ్చగాళ్లు కూడా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రాంగణంలోకి చొచ్చుకువచ్చి సాయిబాబా గుడి వరకు దారికి ఇరు వైపుల కూర్చుంటున్నారు. వీరిని నిలువరించడంలో ఆలయ అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే చెప్పవచ్చు.
ఇష్టారాజ్యంగా పార్కింగ్..
అమ్మవారి సన్నిధిలో ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేస్తున్నారు. చాలా వాహనాలను సాయిబాబా గుడి వరకు అనుమతిస్తున్నారు. వాస్తవానికి ప్రధాన గేటు ఆవలనే పార్కింగ్ చేయాల్సి ఉన్నా ఆ నిబంధనను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆలయ సిబ్బంది సైతం చూసీచూడనట్లు వ్యవహరించడంతో వాహనదారులు ఇష్టారీతిగా వ్‌మవహరిస్తున్నారు. దీంతో భక్తుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
ఉపయోగంలేని చెప్పుల స్టాండ్..
భద్రకాళి సన్నిధిలో చెప్పులు విడిచేందుకు కూడా సరైన ప్రాంతం లేకపోవడంతో ఎక్కడ పడితే అక్కడనే వాటిని వదిలి వెళ్తున్నారు. సాయిబాబా గుడికి ఎదురుగా చెప్పులు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా స్టాండ్‌ను ఏర్పాటు చేసినా సిబ్బంది దాని నిర్వహణను మరిచారు. చెప్పుల స్టాండుకు అడ్డుగా చెక్కలను ఏర్పాటు చేయడంతోపాటు ఆ ప్రాంతమంతా దుర్గంధంగా మారడంతో చాలామంది భక్తులు వారికి నచ్చిన ప్రాంతాల్లోనే చెప్పులను విడిచి దర్శనానికి వెళ్తున్నారు.
‘భద్రకాళి’కి విశేష చరిత్ర..
భద్రకాళి అమ్మవారి ఆలయానికి విశేష చరిత్ర ఉంది. క్రీస్తు శకం 625లో చాళుక్య రాజవంశం రాజు 2వ పులకేశి భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని నిర్మించాడు. తరువాతి కాలంలో ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న కాకతీయ రాజులు అమ్మవారిని విశేషంగా పూజించేవారు. వారే అమ్మవారి సన్నిధిలో భద్రకాళి చెరువును కూడా తవ్వించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ, వరంగల్ నగరాల మధ్య ఓ కొండపై భద్రకాళి అమ్మవారు భయంకర రూపంలో పెద కళ్లు, గంభీరమైన ముఖం, ఎనిమిది చేతులు, వాటిలో వేరు వేరు ఆయుధాలతో సింహ వాహనంపై కూర్చుని దర్శనమిస్తుంది. అమ్మవారి విగ్రహం రాతితో చేసినప్పటికీ జీవం ఉట్టిపడేలా కనిపిస్తుంది. ఈ అమ్మవారి ఎడమ కన్నుకు కోహినూర్ వజ్రం ఉండేదని చారిత్రక కథనం ప్రచారంలో ఉంది. కొల్లూర్ గనులు (గోల్కొండ గనులు) నుంచి వెలికి తీసిన కోహినూర్ వజ్రాన్ని కాకతీయ రాజులు అమ్మవారి ఎడమ కంటికి అమర్చినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. క్రీస్తు శకం 1310 కాలంలో అల్లాఉద్దీన్ ఖిల్జీ తన ఆధ్వర్యంలోని ఢల్లీి సామ్రాజ్యంలోకి కాకతీయ రాజ్యాన్ని తీసుకోవడంతోపాటు భద్రకాళి ఆలయాన్ని కూల్చివేసి ఎంతో విలువైన కోహినూర్ వజ్రాన్ని దోచుకెళ్లారు. అప్పటినుంచి ఎన్నో చేతులు మారి ప్రస్తుతం ఇంగ్లాండ్ రాణి స్వాధీనంలో ఉంది.






