ప్రజావేదిక రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు
వరంగల్ వాయిస్, హనుమకొండ : తెలంగాణ రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకి అనుభవం అర్హత సమర్థత ఉన్న వారిని ఉపకులపతులుగా నియమించాలని ప్రజావేదిక రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గురువారం విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా శేషు మాట్లాడుతూ ఈ నెల 21తో ప్రస్తుత ఉపకులపతుల పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో కొత్త ఉపకులపతులను నియమించుకోవడానికి ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చినందున, విధేయులను కాకుండా విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయగల వారిని విద్యార్థులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించగల దక్షత కలవారిని ఉపకులపతులుగా నియమించాలని కోరారు. గత ప్రభుత్వం తమ అనుయాయులను, విధేయులను ఉపకులపతులుగా నియమించటం వలన విశ్వవిద్యాలయాలు నిర్వీర్యమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి, దరఖాస్తు చేసుకున్న 312 మందిలో సమర్థత అనుభవం అర్హత ఉన్న వారిని ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం రాజకీయాలతో సంబంధం ఉండి పార్టీ విధేయులను ఉపకులపతులుగా ఎంపిక చేసి విశ్వవిద్యాలయాలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చింది కాబట్టి, విశ్వవిద్యాలయాలను ప్రక్షాళన చేయటానికి సమర్థులైన వాళ్లని ఉపకులపతులుగా ఎంపిక చేయాలని అభిప్రాయపడ్డారు.