Warangalvoice

'Kashaya' exercise to show power

సత్తా చాటేందుకు ‘కాషాయ’ కసరత్తు

  • మోదీ బహిరంగ సభకు పక్కా స్కెచ్‌
  • ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం 15వేల మంది
  • వరంగల్‌ నుంచి ప్రత్యేక రైలు
  • ఖమ్మం, మహబూబాబాద్‌ మీదుగా మరో రైలు
  • బూత్‌ స్థాయి నేతలకే బాధ్యతలు
  • మూడు రోజుల ముందుగానే పార్టీ మోర్చాలతో సమావేశం

తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోంది. అందివచ్చిన ప్రతీ చిన్న అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు చేరువయ్యేందుకు కృషి చేస్తోంది. అందులో భాగంగానే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని రాష్ట్ర రాజధానిలో నిర్వహించేలా పక్కా ప్లాన్‌ చేశారు. పనిలోపనిగా ప్రధాని మోదీ చరిష్మాను ఉపయోగించి తెలంగాణలో పార్టీ పుంజుకునేలా భారీ బహిరంగ సభకు శ్రీకారం చుట్టారు. ఈ సభ ద్వారా పార్టీ సత్తా చాటేలా స్కెచ్‌ వేశారు. బహిరంగ సభకు లక్షలాదిగా జనాన్ని తరలించడం ద్వారా బీజేపీ సత్తాను ఇతర పార్టీలకు తెలియజెప్పాలని భావిస్తున్నారు. సమావేశానికి జనాన్ని తరలించేందుకు అన్ని జిల్లాలనుంచి ప్రైవేట్‌ బస్సులతోపాటు ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేశారు.
-వరంగల్‌ వాయిన్‌, వరంగల్‌ ప్రతినిధి

వరంగల్‌ వాయిన్‌, వరంగల్‌ ప్రతినిధి: మోదీ చరిష్మాతో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు కమలనాథులు కదనోత్సాహంతో ముందుకు సాగుతున్నారు. జూలై 3న నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ద్వారా పార్టీ సత్తాను చాటేందుకు వారు సిద్ధపడుతున్నారు. జూలై 2, 3 తేదీల్లో నిర్వహించనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో భాగంగా ఇప్పటికే అధినాయకత్వం ఒక్కొక్కరుగా హైదరాబాద్‌ చేరుకుంటున్నారు. దీనికితోడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ సంపర్క్‌ అభియాన్‌ పర్యటన పేరిట రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గానికి ఒక్కరు చొప్పున రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో మూడు రోజుల పాటు పర్యటించి పార్టీ స్థితి గతులు తెలుసుకునేలా ఇన్‌చార్జులను నియమించారు. వీరు గురువారం ఉదయమే అన్ని నియోజకవర్గాలకు చేరుకున్నారు. వరంగల్‌ తూర్పు నియోజకవర్గానికి మాజీ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌, వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గానికి రాజ్యసభ సభ్యుడు ఓంప్రకాష్‌ మాథుర్‌, మహబూబాబాద్‌ నియోజకవర్గానికి జార?ండ్‌ మాజీ ముఖ్యమంత్రి బాబ్‌లాల్‌ మరండి ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తున్నారు.

మూడు రోజులూ ఇక్కడే..
నియోజకవర్గ ఇన్‌చార్జులుగా నియమితులైన బీజేపీ సీనియర్‌ నేతలు మూడు రోజుల పాటు ఆయా నియోజవకర్గంలోనే మకాం వేసి పార్టీ స్థితిగతులను అంచనా వేయనున్నారు. పార్టీకి వెన్నెముకగా నిలుస్తున్న యువ మోర్చ, మహిళా మోర్చ, ఓబీసీ మోర్చ, ఎస్సీ మోర్చ, ఎస్టీ మోర్చతోపాటు ఇతల మోర్చలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేసి వారికి దిశా నిర్ధేశం చేయనున్నారు.

దళిత బస్తీలపై ప్రత్యేక నజర్‌..
నియోజకవర్గాల్లోని దళిత బస్తీలపై బీజేపీ ప్రత్యేక నజర్‌ పెట్టింది. శుక్రవారం ఉదయం నియోజకవర్గ ఇన్‌చార్జి ఆధ్వర్యంలో దళిత బస్తీలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దళితులకు పార్టీ అండగా నిలుస్తుందన్న సంకేతం ఇచ్చేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడిరచాయి. ఇదే రోజు సాయంత్రం న్యాయవాదులు, చార్టెడ్‌ అకౌంటెట్లు, ఇంటలెక్చువల్స్‌, నగర ప్రముఖులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి పార్టీ సంస్థాగతంగా తీసుకోవాల్సిన విషయాలపై చర్చించనున్నారు.

వరంగల్‌ తూర్పు, పశ్చిమలో బిజీ..బిజీ..
వరంగల్‌ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమితులైన మాజీ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ మూడు రోజులు బిజీ..బిజీగా గడుపనున్నారు. నగరంలోని గ్రాండ్‌ గాయత్రీ లాడ్జిలో బస చేసిన ఆయన గురువారం సాయంత్రం బీజేపీకి చెందిన అన్ని మోర్చాలతో సమావేశం నిర్వహించనున్నారు. జూలై 1వ తేదీ శుక్రవారం ఉదయం కాశిబుగ్గలోని కేవీఎస్‌ ఫంక్షన్‌ హాల్‌లో అన్ని వర్గాల వారితో సమావేశం, సాయంత్రం డెలిగేట్‌ సమావేశంలో పాల్గొననున్నారు. ఇదే రోజు రాత్రి ఖిలా వరంగల్‌ పర్యటించనున్నారు. 2వ తేదీ శనివారం పార్టీ కార్యకర్తలతో సంస్థాగత సమావేశం నిర్వహించి సమగ్ర రిపోర్టు తయారు చేయనున్నారు. అదే విధంగా వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమితులైన ఓంప్రకాష్‌ మాథుర్‌ గురువారం సాయంత్రం ఆరు గంటలకు నియోజకవర్గంలోని డివిజన్‌ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, శక్తి కేంద్రాల ఇన్‌చార్జులు, జిల్లా కిసాన్‌ మోర్చ, జిల్లా ఎస్టీ మోర్చ ఎగ్జిక్యూటివ్‌ సభ్యులతో సమావేశం నిర్వహించనున్నారు. జూలై 1వ తేదీ ఉదయం 8గంటలకు భద్రకాళి గుడి సందర్శన, హంటర్‌ రోడ్డులోని వేద బంకెట్‌ హాల్‌ ఉదయం 10 గంటలకు అసెంబ్లీ స్థాయి మహిళా మోర్చ, 12 గంటలకు యువ మోర్చ, 2.30గంటలకు ఓబీసీ మోర్చ, 5గంటలకు దళిత బస్తీ, ఎస్సీ మోర్చ రాత్రి 7గంటలకు అసెంబ్లీ కోర్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. 2వ తేదీ ఉదయం వేయి స్తంభాల గుడి సందర్శన అనంతరం డెలిగేట్‌ మీటింగ్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ తరలి వెళ్లనున్నారు.

ఒక్కో నియోజకవర్గంనుంచి 15వేల మంది..
మోదీ బహిరంగ సభకు ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం 15వేల మందిని తరలించేలా ప్లాన్‌ చేశారు. ఈ బాధ్యతలను నియోజకవర్గంలోని బూత్‌ స్థాయి కమిటీలకు అప్పగించారు. ఒక్కో బూత్‌ నుంచి కనీసం 30 నుంచి 40 మందిని సభకు తరలించేలా పక్కా ప్లాన్‌ చేశారు. వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో 215 బూత్‌లు ఉన్నందున మొత్తం సుమారు ఎనిమిది వేల మంది సభకు హాజరయ్యే అవకాశం ఉంది. దీనికి తోడు బీజేపీ సీనియర్‌ నాయకులు, పార్టీ అభిమానులు మరో ఐదారు వేల మంది ఉంటారని భావిస్తున్నారు.

ప్రత్యేక రైళ్ల ఏర్పాటు..
భారీ సంఖ్యలో తరలివచ్చే జనం కోసం బీజేపీ నేతలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం విముఖత వ్యక్తం చేయడంతో ఇతర మార్గాలను అన్వేషిస్తున్నారు. ఆదివారం కావడంతో ప్రైవేట్‌ బస్సులతోపాటు వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన బస్సులను విరివిగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. అదే విధంగా ప్రజల రవాణాకు అనుగుణంగా ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి కావాల్సిన అనుమతిని కూడా తీసుకున్నారు. అయితే రైళ్ల టైమ్‌ టేబుల్‌ మాత్రం ఇంకా విడుదల కాలేదు. ఇప్పటికే వరంగల్‌, కాజీపేట ప్రాంతంనుంచి వచ్చే వారికి అనుగుణంగా 25 బోగీలతో వరంగల్‌లో ఒక ప్రత్యేక రైళును అందుబాటులో ఉంచనున్నారు. వరంగల్‌లో ప్రారంభమైన ఈ రైలు అన్ని స్టేషన్‌లలో ఆగుతూ సికిందరాబాద్‌ చేరుకుంటుంది. అదే విధంగా ఖమ్మం, డోర్నకల్‌, మహబూబాబాద్‌, నెక్కొండ ప్రాంత కార్యకర్తలకు అనుగుణంగా 16బోగీలతో ఖమ్మంనుంచి మరో రైలును నడుపనున్నారు.

ప్రజలు బీజేపీవైపు చూస్తున్నారు..:
బీజేపీ నేత గంటా రవికుమార్‌
నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది సంవత్సరాలుగా అన్ని వర్గాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అసంఘటిత రంగాలు ఆగమయ్యాయి. దీంతో సుపరిపాలన కోసం ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. టీఆర్‌ ఎస్‌, కాంగ్రెస్‌ రెండు పార్టీలు వేరు వేరు కాదు. ఆ రెండు ఒక్కటే. ఇదే ఇషయం రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా తేటతెల్లమైంది. నగరాభివృద్ధికి కేంద్రం వేల కోట్లు ఇస్తుంటే పనులు కూడా చేయించలేని స్థితిలో నాయకులు ఉన్నారు. దీనిని ప్రజలు గమనిస్తున్నారు.

రక్షణ కల్పించండి..:
బీజేపీ వరంగల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు కనుకుంట్ల రంజిత్‌
వరంగల్‌ తూర్పు నియోజకవర్గ పర్యటనలో భాగంగా నగరానికి విచ్చేసిన కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి ప్రస్తుత ఎంపీ రవి శంకర్‌ ప్రసాద్‌కు రక్షణ కల్పించాలని బీజేపీ వరంగల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు కనుకుంట్ల రంజిత్‌ వరంగల్‌ ఏసీపీ కలకోట గిరికుమార్‌, మిల్స్‌ కాలనీ సీఐ శ్రీనివాస్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. గురువారం మధ్యాహ్నం 3గంటలనుంచి జూలై 2వ తేదీ ఉదయం వరకు రవి శంకర్‌ ప్రసాద్‌ నగరంలో బస చేయనున్నారని వెల్లడిరచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *