Warangalvoice

Warangal Voice

సంతకమే ఆమెది.. పెత్తనమంతా ఆయనదే

  • గ్రేటర్‌లో సగానికిపైగా మహిళా ప్రతినిధులే
  • వీరిలో చాలా మంది వంటింటికే పరిమితం
  • రాజకీయంగా చక్రం తిప్పుతున్న పతులు
  • అధికారిక కార్యక్రమాల్లోనూ వారే
  • ప్రకటనల్లోనూ భార్య పేరు పక్కనే భర్త పేరు
  • అయోమయానికి గురవుతున్న జనం

మహిళా సాధికారత కేవలం కాగితాలకే పరిమితమైంది. స్థానిక సంస్థల్లో 50 శాతానికి పైగా మహిళలే ఉన్నప్పటికీ చక్రం తిప్పేది మాత్రం పురుషులే. ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న రాజకీయ రిజర్వేషన్లు మహిళల జీవితాల్లో మార్పు తేవడం లేదు. చట్టసభల్లోనూ వారు భర్తల కనుసన్నల్లోనే నడుచుకుంటున్నారు. భర్త ఎస్‌ అంటే ఎస్‌ అని నో అంటే నో అంటూ వ్యవహరిస్తున్నారు. అధికారిక కార్యక్రమాలకు సైతం పతులే హాజరవుతున్నారు. సతులు గడప దాటకుండా కేవలం అధికారిక పత్రాలపై ఆటోగ్రాఫ్‌లకే పరిమితమవుతుండగా పతులు మాత్రం పొద్దున లేచింది మొదలు పొద్దుపోయే వరకు రాజకీయంగా చక్రం తిప్పుతూ హడావిడి సృష్టిస్తున్నారు. కొంతమంది భర్తలు ఇంకొంచెం ముందడుగు వేసి భార్య సంతకాన్ని కూడా తానే ఫోర్జరీ చేస్తూ తమ దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు.

– వరంగల్‌ వాయిస్‌, వరంగల్‌ ప్రతినిధి

వరంగల్‌ వాయిస్‌, వరంగల్‌ ప్రతినిధి : గతంలో మాదిరిగా మహిళలు వంటింటి కుందేళ్లు కాదు.. వారు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారు.. పురుషులకు ఏమాత్రం తీసిపోని విధంగా మహిళలు తమ ప్రతిభను చాటుతున్నారు.. చదువుల్లోనూ..ఉద్యోగాల్లోనూ ‘‘మాకు మేమే సాటి..’’ అని నిరూపిస్తున్నారంటూ చేస్తున్న ప్రసంగాలు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. చట్టాలను రూపొందించి అమలు చేయాల్సిన పదవుల్లో ఉండి కూడా భర్త ఆదేశాలనే శిరసావహిస్తున్నారు. స్థానిక సంస్థల్లో 50 శాతం సీట్లను మహిళలకు రిజర్వు చేసినా పేరుకే పదవులు తప్ప పరిపాలనలో వారికి స్వేచ్ఛ ఉండడం లేదు. మహిళలకు కూడా పురుషులతో సమాన హక్కులు కల్పించాలంటూ ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న రాజకీయ రిజర్వేషన్లూ మహిళల జీవితాల్లో నేటికీ మార్పు తేవడం తేవడంలేదు. ప్రజా ప్రతినిధి హోదాలో ఉన్నప్పటికీ నేటికీ చాలా మంది గడపదాటి బయటికి వచ్చేందుకే జంకుతున్నారు. దీంతో సదరు ప్రజాప్రతినిధి భర్త షాడోగా వారి వెంటే ఉంటూ అన్నీ పనులను వారే చక్కబెడుతున్నారు.


గ్రేటర్‌లో సగానికిపైగా మహిళలే..
వరంగల్‌ మహా నగరపాలక సంస్థ పరిధిలోని మొత్తం 66 డివిజన్లలో సగానికి పైగా మహిళా కార్పొరేటర్లే ఉన్నారు. ఇందులో మేయర్‌, డిప్యూటీ మేయర్‌తో సహా 38మంది మహిళా కార్పొరేటర్లు ఉన్నారు. వీరిలో 28మంది అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు ఉండగా ఏడుగురు భారతీయ జనతా పార్టీకి, ఒకరు కాంగ్రెస్‌ పార్టీకి, ఇద్దరు ఇండిపెండెంట్లు ఉన్నారు. వీరిలో మేయర్‌ గుండు సుధారాణి మాత్రం అధికారిక హోదాలో అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటుండగా మిగిలిన చాలా మంది అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. డిప్యూటీ మేయర్‌ మాత్రం అక్కడక్కడ దర్శనమిచ్చినా ఆమె భర్తనే అన్ని కార్యక్రమాలు చక్కబెడుతుంటారు. అధికారిక కార్యక్రమాల్లో కూడా ఆయనే పాల్గొంటున్నారు. మాజీ మంత్రి కోడలు పాల్గొనాల్సిన అధికారిక కార్యక్రమాల్లో కూడా ఆమె భర్తే పాల్గొంటూ చక్రం తిప్పుతున్నారు. మిగిలిన మహిళా కార్పొరేటర్లలో చాలా మంది కౌన్సిల్‌ సమావేశాలకు హాజరు కావడం మినహా ఏ ఒక్క కార్యక్రమంలోనూ వారు కనిపించరు. డివిజన్‌లోని అన్ని కార్యక్రమాలను వారి భర్తలే చూసుకుంటారు.


కార్పొరేటర్‌ పేరు పక్కనే భర్త పేరు..
డివిజన్‌లోని సమస్యలపై మహిళా కార్పొరేటర్లు పెద్దగా స్పందించేది కూడా లేదు. స్థానిక సమస్యలపై ఎవరైనా వారిని ప్రశ్నిస్తే అంతా ఆయనే చూసుకుంటారంటూ సమాధానం చెబుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నగరంలో జరిగే వేరు వేరు కార్యక్రమాల్లో కూడా కార్పొరేటర్లకు బదులుగా వారి భర్తలే రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. మురుగు కాలువలు, శానిటేషన్‌, తాగునీరు, వీధి దీపాల సమస్యలు ఇలా డివిజన్‌లోని ప్రతీ సమస్య పరిష్కారానికి కార్పొరేటర్ల భర్తలే పెద్ద దిక్కుగా మారారు. పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కార్పొరేటర్‌ను వేదిక మీదికి పిలువాలా లేక కార్పొరేటర్‌ భర్తను పిలువాలా అన్న మీమాంస కొనసాగుతోంది. కొన్ని సందర్భాల్లో గొడవలెందుకులే అనుకున్న వారుమాత్రం ఇద్దరినీ వేదిక మీదికి ఆహ్వానిస్తున్నారు. వివిధ ప్రకటనల్లో కూడా మహిళా కార్పొరేటర్‌ పేరు పక్కనే భర్త పేరుకూడా రాసి ఎవరినీ తక్కువ చేయకుండా చూసుకుంటున్నారు.


కనీస గుర్తింపేదీ..
మహిళా కార్పొరేటర్లు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే కనీస గుర్తింపు కూడా ఉండటం లేదు. కూర్చోమనే వారు కూడా ఉండరని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతి పక్ష పార్టీలకు చెందిన మహిళా కార్పొరేటర్ల పరిస్థితి మరీ దయానీయంగా మారింది. ఇక స్థానికంగా ఉండే సమస్యలపై అధికారులెవ్వరికీ చెప్పినా స్పందించేవారే కరువయ్యారు. దీంతో డివిజన్లలో ఎక్కడి సమస్యలు అక్కడే అన్న చందంగా మారింది.


సంతకాలకే పరిమితం..
నగరంలోని చాలా డివిజన్లలో కార్పొరేటర్లు కేవలం అధికారిక పత్రాలపై సంతకాలకే పరిమితమవుతున్నారు. మరి కొందరు మరో అడుగు ముందుకేసి కార్పొరేటర్ల సంతకాలు కూడా భర్తలే ఫోర్జరీ చేస్తూ కార్యాలను చక్కబెడుతున్నారు. ఫోర్జరీ నేరం అని తెలిసినా మేమే ప్రజా ప్రతినిధులం అన్న ధీమాతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే మా బదులు మావారు పనులు చక్కబెడితే తప్పేంటంటూ మహిళా కార్పొరేటర్లు ఎదరు ప్రశ్నించడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *