- ఓరుగల్లుపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీ
- పార్టీ బలోపేతమే లక్ష్యం
- ఆగస్టు 2నుంచి బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర
- యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి సన్నిధినుంచి ప్రారంభం
- 26న వరంగల్‌లో భారీ ముగింపు సభ
- హాజరుకానున్న బీజేపీ చీఫ్ నడ్డా
ఓరుగల్లుపై భారతీయ జనతా పార్టీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనున్న మూడో విడత పాదయాత్రను మొదట వరంగల్ భద్రకాళి అమ్మవారి సన్నిధినుంచే ప్రారంభించి యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి సన్నిధిలో ముగించాలని భావించినా చివరి నిమిషంతో షెడ్యూల్ మారింది. పాదయాత్రను యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి సన్నిధిలో ఆగస్టు 2వ తేదీన ప్రారంభించి అదే నెల 26న వరంగల్ భద్రకాళి అమ్మవారి సన్నిధిలో ముగించేలా ప్లాన్ చేశారు. ముగింపు సందర్భంగా కనీ వినీ ఎరుగని రీతిలో భారీ బహిరంగ సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు బీజేపీ చీఫ్ నడ్డా హాజరుకానున్నారు. 24 రోజుల పాటు సాగనున్న ఈ పాదయాత్ర చేరికలపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని భావిస్తున్నారు.
-వరంగల్ వాయిస్, వరంగల్ ప్రతినిధి
వరంగల్ వాయిస్, వరంగల్ ప్రతినిధి: హైదరాబాద్‌లో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు సక్సెస్ కావడంతో ఆదే ఊపుతో రాష్ట్రంలోనూ పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ అధిష్ఠానం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత ఎక్కువ మంది మేథావులు, ఉద్యోగులు, విద్యార్థులు ఉన్న వరంగల్‌లో తమ ప్రాబల్యాన్ని చాటుకునేందుకు బీజేపీ పక్కా ప్లాన్ వేస్తోంది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయడంతోపాటు అన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తోంది. అందులో భాగంగానే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్టీని విస్తరించేందుకు పావులు కదుపుతోంది. ఈ మేరకు సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలను మినహాయించి మిగిలిన 14 నియోజకవర్గాలకు బీజేపీ అధిష్ఠానం ఇన్‌చార్జులను నియమించింది. వీరు ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టేలా బాధ్యతలు అప్పగించారు.
అసంతృప్తులపై నజర్..
వివిధ పార్టీలో పదవులు లభించక అసంతృప్తితో ఉన్న నేతలపై బీజేపీ నజర్ వేసింది. నియోజకవర్గాల వారీగా వీరిని గుర్తించే పనిలో పడ్డారు. వారిని బీజేపీలోకి ఆహ్వానించేలా చర్చలు మొదలు పెట్టారు. ఓవర్‌లోడ్‌తో ఉన్న అధికార పార్టీకి చెందిన అసంతృప్తులకు గాలం వేస్తున్నారు. పార్లమెంటు ప్రవాసీ యోజన పేరిట చేరికల కోసం ఒక ప్రత్యేక కమిటీనే ఏర్పాటు చేశారు. దీని బాధ్యతలను హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు అప్పగించారు. అయితే ఈటలకు వరంగల్‌లో కూడా మంచి పలుకుబడి ఉన్నందున పెద్ద మొత్తంలోనే చేరికలు ఉంటాయని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే వివిధ పార్టీలనుంచి చాలామంది అసంతృప్తులు పార్టీ నేతలతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. వీరంతా సమయంకోసం వేచి చూస్తున్నట్లు తెలిసింది.
ఆగస్టు 2నుంచి మూడో విడత..
ఆగస్టు 2నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరిట నిర్వహించనున్న పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఉదయం 9గంటలకు శ్రీ లక్ష్మీ నర్సంహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పాదయాత్ర ప్రారంభం కానుంది. ఆగస్టు 26వరకు మొత్తం 24 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం యాత్ర సాగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ హాజరు కానున్నారు.
వరంగల్‌లో ముగింపు..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత కార్యక్రమాన్ని మొదట వరంగల్ నుంచే ప్రారంభించాలని భావించారు. అత్యంత మహిమాన్వితమైన భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాతే పాద్రయాత్ర ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ చివరి క్షణంలో షెడ్యూల్ మారింది. దీంతో వరంగల్‌లో ఆగస్టు 26న ముగింపు సభను ఏర్పాటు చేసేలా ప్రణాళికను రూపొందించారు. కనివిని ఎరుగని రీతిలో ముగింపు సభ నిర్వహించేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. ముగింపు సభకు బీజేపీ చీఫ్ నడ్డా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
మూడో విడత 24 రోజులే..
మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్ర 55 రోజులు, రెండో విడత 31 రోజులు చేయగా మూడో విడత 24 రోజులకే పరిమితమైంది. మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్ర సమరశంఖం ఆగస్టు 9న హైదరాబాద్‌లోని చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి పూరించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఇన్‌చార్జి తరుణ్‌చుగ్ ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు. పార్టీ ఆఫీసు నుంచి భారీ ర్యాలీగా చార్మినార్ చేరుకుని అక్కడి నుంచి పాదయాత్రను మొదలు పెట్టారు. రెండో విడత పాదయాత్రను ఏప్రిల్ 14వ తేదీన అలంపూర్ లోని జోగులాంబ అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభించారు. ఆలంపూర్, గద్వాల మక్తల్, నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్ , మహేశ్వరం నియోజకవర్గాల్లో 31 రోజులపాటు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగింది. మొత్తం 387 కి.మీ దూరం సాగిన పాదయాత్ర మే 14న రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ముగిసింది.