- డీఎంహెచ్ఓ డాక్టర్ కళావతి బాయి
వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది, స్టానిక గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి ప్రజలకు ప్రతి శుక్రవారం డ్రై డే విధానం పాటించేలా అవగాహన కలిగించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి. కళావతి బాయి అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ మండలంలోని మల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, గ్రామాన్ని డీఎంహెచ్ఓ కళావతి బాయి సందర్శించారు. ఈ సందర్బంగా అధికారి మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది తప్పనిసరిగా ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమాలు నిర్వహించాలని, స్టానిక గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి మురుగు గుంతలను పూడ్చివేయాలని, నీరు ఎక్కువగా నిల్వవున్న కుంటలలో ఆయిల్ బాల్స్ కానీ, కిరసనాయిల్ వేయాలన్నారు. కొబ్బరి బొండాలు, పాడై పోయిన టైర్లు, మొదలగువాటిని ఇంటి చుట్టూ ప్రక్కల ఉంచకుండా చూడాలఅన్నారు. జ్వరంతో బాధపడుతున్న వారికి రక్తపూతలు తీయాలని, రానున్న వర్షాకాలంలో అంటు వ్యాధులు ప్రబలకుండా చూసుకోవడానికి ముందస్తు ప్రణాళికలను ఏర్పాటు చేసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ముందుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి కేంద్రం పరిధిలో సి సెక్షన్ కాన్పులు ఎక్కువగా అవుతున్నట్లు గుర్తించి సి సెక్షన్ కాన్పులను తగ్గించుట కోసం వైద్య, ఆరోగ్య సిబ్బంది తల్లుల సమావేశంలో గర్భిణీ స్త్రీలకు, వారి బంధువులకు సాధారణ ప్రసవాల వలన చేకూరే ప్రయోజనాలను వివరించాలని తెలిపారు. రానున్న వర్షాకాలం సీజన్ లో సిబ్బంది అందుబాటులో ఉండాలని, ప్రతి గర్బిణి స్త్రీని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవం కోసం ప్రోత్సహించాలని అన్నారు. మాతృ మరణాలు, శిశు మరణాలు జరగకుండా చూడాలని, ఆరోగ్య కేంద్ర పరిధిలో జరుగుతున్న గర్భస్రావాల పైన నిఘా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో మల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ సుధీర్ కుమార్, జిల్లా ఉప మాస్ మీడియా అధికారి కొప్పుప్రసాద్, ఎంపీహెచ్‌ఈఓ తోట శ్రీనివాస్, స్టాఫ్ నర్సులు, ఆరోగ్య కార్యకర్త, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
