- అంగరంగ వైభవంగా ముగిసిన భద్రకాళి నవరాత్రోత్సవాలు
- 4 టన్నుల పండ్లు, కూరగాయలతో అమ్మవారి అలంకరణ
- సేంద్రియ పద్ధతిలో పండిరచిన వ్యవసాయ క్షేత్రాలనుంచి సేకరణ
- జోరువానలోనూ తరలి వచ్చిన భక్తులు
- భారీ బందోబస్తు చేసిన పోలీసులు
జై భద్రకాళీ.. జై జై శాకంబరి మాత.. అంటూ భక్తులు భక్తిభావంతో పులకించి పోయారు. అమ్మవారి శాకంబరి నవరాత్రులు బుధవారం వైభవంగా ముగిశాయి. చివరి రోజు భద్రకాళి మాత శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అలంకరణ కోసం సేంద్రియ పద్ధతిలో పండిరచిన 4 టన్నుల పండ్లు, కూరగాయలను తెప్పించారు. ఈ వేడుక సందర్భంగా పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. వర్షంలో సైతం భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు శాకంబరి అలంకరణలో ఉన్న భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని తరించారు. నవరాత్రోత్సవాలకు సహకరించిన అందరికీ ఆలయ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.
-వరంగల్ వాయిస్, కల్చరల్
వరంగల్ వాయిస్, కల్చరల్ : నగరంలోని సుప్రసిద్ధ శ్రీ భద్రకాళీ దేవస్థానంలో పదిహేను రోజులుగా జరుగుతున్న రాక్రాంత దీక్షా పూర్వక శాకంబరి నవరాత్రులు బుధవారంతో పూర్తయ్యాయి. ఆషాఢ శుద్ద పౌర్ణమి రోజైన చివరిరోజు అమ్మవారిని శాకంబరిగా అలంకరించి అంగరంగ వైభవంగా పూజారాధనలు జరిపించారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాన్నిసైతం లెక్కజేయకుండా అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం 9.30గంటలకు అమ్మవారి దర్శనానికి దేవస్థానం వారు అనుమతించారు. అప్పటికే వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఒక్కసారిగా ఆలయంలోకి ప్రవేశించి శాకంబరి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకొని పులకించిపోయారు. అమ్మవారి ప్రాంగణం భద్రకాళి శరణం మమ:, శాకంబరి శరణం మమ: అనే నామస్మరణతో మారుమోగింది. వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్‌నత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. అడుగడుగునా పోలీసులు పహారా కాస్తూ క్యూలైన్లలో భక్తులను క్రమబద్ధీకరించారు.
4టన్నుల పండ్లు, కూరగాయలతో..
సేంద్రియ పద్ధతిలో పండిరచిన వ్యవసాయ క్షేత్రాల నుంచి సేకరించిన సుమారు నాలుగు టన్నుల కూరగాయలు, పండ్లతో అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉదయం 3గంటలకు ప్రారంభమైన అలంకరణ 9గంటలకు పూర్తయింది. పూజానంతరం 9.30 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ సతీసమేతంగా అమ్మవారికి శాకంబరి అలంకరణకు కూరగాయలు, పండ్లు సమకూర్చడంతోపాటు దండల నిర్మాణంలో పాలుపంచుకున్నారు.
అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు..
శాకంబరి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్-రేవతి దంపతులు, మేయర్ గుండు సుధారాణి, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్-డాక్టర్ సీతామహాలక్ష్మి దంపతులు, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, విశాఖపట్టణం ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యుడు ఘంటా శ్రీనివాసరావు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు కారెం రవీందర్ రెడ్డి దంపతులు, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ రామల సునీత, హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ ధాన్యం వినయభాస్కర్ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సాధారణ భక్తుడిగా ధర్మదర్శనం క్యూలైన్‌లోనే నిలబడిన అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. పూజానంతరం శాకంబరి నవరాత్రుల మహాపూర్ణాహుతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..
దేవాదయ శాఖతోపాటు ఇతర ప్రభుత్వ శాఖలు, అధికారుల సమన్వయంతో నిర్వహించిన శాకంబరి ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయని ఆలయ కార్యనిర్వహణ అధికారి కె.శేషుభారతి తెలిపారు. పోలీసుల సహాయ సహకారాలతో చివరి రోజు చేసిన ఏర్పాట్లు భక్తుల ప్రశంసలను అందుకుందన్నారు. శాకంబరి అలంకరణ హన్మకొండ నాని ప్రముఖ పవర్ ఇన్ స్టలేషన్స్ కాంట్రాక్టర్ డాక్టర్ మండువ శేషగిరిరావు- రేణుక దంపతులు, హైదరాబాద్ వాస్తవ్యులు ఈమని హరికృష్ణ- స్మిత దంపతుల సౌజన్యంతో జరిగిందని వివరించారు. మహబూబాబాద్ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సేవా సమితి వారు 100 మంది అమ్మవారి సన్నిధిలో భక్తులకు క్యూలైన్లలో సేవలందించారని, భద్రకాళి సేవా సమితి కన్వీనర్ అయిత గోపినాథ్ ఆధ్వర్యంలో వేలది మంది భక్తులకు ఉచితంగా ప్రసాద వితరణ జరిపించారన్నారు. శాకంబరి నవరాత్ర మహోత్సవములు విజయవంతం కావడానికి సహకరించిన అందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.





