Warangalvoice

Dasyam Vinay Bhaskar

వ్యాపారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్
స్వనిధి మహోత్సవ్ ప్రారంభం

వరంగల్ వాయిస్, హనుమకొండ టౌన్: వీధి వ్యాపారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. శనివారం హన్మకొండ లోని అంబేడ్కర్ భవన్ లో నిర్వహించిన ‘‘పట్టణ ప్రగతి స్ట్రీట్ వెండర్స్ డెవలప్మెంట్ స్వనిధి మహోత్సవ్’’ కార్యక్రమాన్ని నగర మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య తో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ .. స్వ నిధి మహోత్సవం పండగ వాతావరణంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మహా నగరవ్యాప్తంగా 47,800 మంది వీధి వ్యాపారులను గుర్తించి 27 వేల మందికి 10 వేల రుణాలు అందించి జీడబ్ల్యూఎంసీ దేశంలోనే మొదటి స్థానంలో ఉండడం అభినందనీయమన్నారు. రుణాలే కాకుండా చిరు వ్యాపారులకు శాశ్వత చిరునామా కల్పించేందుకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంజూరు చేసిన 3 కోట్ల రూపాయలతో (స్ట్రీట్ వెండింగ్ జోన్స్ ) వీధి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సూచనలు, మునిసిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు చొరవ మేరకు గ్రేటర్ కార్పొరేషన్ లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో స్వనిధిని తీసుకోవడం జరిగిందన్నారు. డిజిటల్ పేమెంట్ లో కూడా వరంగల్ నగర వ్యాపారులు ముందంజలో ఉండి వీధి వ్యాపారులు ఆర్థిక ప్రయోజనం పొందారని తెలిపారు. జీడబ్ల్యూ ఎంసీ కమిషనర్ పి. ప్రావీణ్య మాట్లాడుతూ.. మహా నగరంలో సుమారు 42వేల 800 వీధి వ్యాపారులను గుర్తించి, గుర్తింపు కార్డులు కూడా జారీ చేశామన్నారు. వీధి వ్యాపారులను ఆర్థిక అక్షరాస్యత పొందేలా చేసేందుకు గ్రేటర్ వరంగల్ బ్యాంకర్లతో పలు శిబిరాలను చేశామన్నారు. కార్యక్రమంలో వరంగల్ అడిషనల్ కలెక్టర్ హరి సింగ్, మెప్మా అడ్మిషన్ కోఆర్డినేటర్ కృష్ణ చైతన్య, బాలకిషన్, అదనపు కమిషనర్ అనిస్ ఉర్ రషీద్, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ బద్రు నాయక్, సెక్రెటరీ విజయలక్ష్మి, ఉప కమిషనర్ లు జోనా, శ్రీనివాస్ రెడ్డి బల్దియా అధికారులు సిబ్బంది మెప్మా టీఎంసీలు, డీఎంసీలు, టీఎల్ ఎఫ్ లు, సీఓలు, వీధి వ్యాపారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *