మంత్రి, బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి
వరంగల్ వాయిస్, పరకాల : రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించి ఆనాటి త్యాగధనుల సేవలను ప్రజలకు తెలియజేస్తామని కేంద్ర కేంద్రమంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. ఆ అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి బైక్ ర్యాలీగా పరకాలకు విచ్చేసిన ఆయన అమరధామంలో నివాళులర్పించారు. పరకాల పట్టణంలోని అంగడి మైదానంలో హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ విమోచనోద్యమం స్ఫూర్తితో మరో సమరం మొదలైందన్నారు. తెలంగాణ ద్రోహి ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా ఇక్కడి ప్రజలను అవమానపరిస్తున్నాడని మండిపడ్డారు. నిజాం పాలకులు తెలంగాణలో కర్కషత్వంగా వ్యవహరించి లక్షలాదిమంది ప్రజలను పొట్టన బెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారికి నేటి ముఖ్యమంత్రి తొత్తుగా మారి పరిపాలన సాగిస్తున్నాడన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నిలబడే అవకాశం లేదని కిషన్ రెడ్డి అన్నారు. 60 ఏళ్లు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, కోరికలను గుర్తించకుండా ఇక్కడి పోరాటాలను పట్టించుకోకుండా దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో సమావేశం పెట్టుకునే అవకాశం లేదన్నారు. మాజీ మంత్రి, హుజరాబాద్ శాసనసభ్యుడు ఈటల రాజేందర్ మాట్లాడుతూ కేసీఆర్ ను డిసెంబర్ లో జరిగే ఎన్నికల్లో ఓడించి ఇంటికే పరిమితం చేసే పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ తోనే పెన్షన్లు, సంక్షేమ పథకాలు, ఇండ్లు వస్తాయని ప్రజలను బెదిరించే దుస్థితిలో ఆ పార్టీ ఉందని ఎద్దేవ చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కుటుంబంలో ఇద్దరికీ పెన్షన్లు ఇచ్చి, రైతు బంధు, రైతు బీమా ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందించే బాధ్యత తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మురళీధర్ గౌడ్, గరికపాటి మోహన్ రావు, గుజ్జుల ప్రేమెందర్ రెడ్డి, విజయరామారావు, ధర్మారావు, ఒంటేరి జయపాల్, మొలుగురి భిక్షపతి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, రాకేష్ రెడ్డి, కుసుమ సతీష్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, ఎడ్ల అశోక్, పేసరు విజయచందర్ రెడ్డి, చాడా సురేష్ రెడ్డి, కీర్తి రెడ్డి, సంతోష్ కుమార్, కాళీ ప్రసాద్ రావు, రాజమౌళి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.