Warangalvoice

Warangal Voice

విధుల్లో ఆదర్శం.. సేవలో మాణిక్యం

  • వరంగల్‌ డీటీసీగా రాణిస్తున్న
  • పెద్దింటి పురుషోత్తం
  • పేద కుటుంబం నుంచి ఉన్నతాధికారిగా
  • ఎదిగిన స్ఫూర్తి ప్రదాత
  • అంకిత భావంతో ఉద్యోగ నిర్వహణ

పేదరికం ఒక విషవలయం అంటారు ఆర్థిక రంగ నిపుణులు.. ‘‘కృషితో నాస్తి దుర్భిక్షమ్‌.. కష్టేఫలి’’ అనే విజయ సూత్రాలు నమ్మి ఆచరించి, పేదరికం అడ్డుగోడను బద్దలుకొట్టి విజేతలుగా నిలుస్తారు కొందరు.. ఆ కోవకు చెందిన వారే వరంగల్‌ డీటీసీ పెద్దింటి పురుషోత్తం.. హైదరాబాద్‌ పాతబస్తీలో పేద కుటుంబంలో పుట్టిన ఈయన చదువుల్లో చురుగ్గా ఉండేవారు. పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తికాగానే ప్రభుత్వ ఉద్యోగంపై దృష్టి సారించారు. అహర్నిషలు కష్టపడి అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌ స్పెక్టర్‌ కొలువు సాధించారు. నిబద్ధతతో పనిచేసి పదోన్నతులు పొంది వరంగల్‌ డీటీసీగా నియమితులయ్యారు. ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అతివేగం, అజాగ్రత్తగా వాహనాలు నడపకుండా యువకుల్లో చైతన్యం తీసుకొస్తున్నారు.
ఉన్నత ఆశయాలే కాదు.. ఆదర్శ భావాలు ఆయన సొంతం. పేదరికంలో పుట్టి పెరిగినా మొక్కవోని దీక్షతో ఉన్నత చదువులు అభ్యసించి జిల్లా ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారు. ఆయనే.. వరంగల్‌ డిప్యూటీ ట్రాన్స్‌ పోర్ట్‌ కమిషనర్‌ పెద్దింటి పురుషోత్తం.
‘‘శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిసవుతుంది’’ అనే సూక్తిని అక్షరాల నిరూపిస్తూ మూడు దశాబ్దాలుగా విశిష్ట సేవలు అందిస్తున్నారు. జీవితం సఫలం కావాలంటే సేవ చేయాలనే మాటలను స్ఫూర్తిగా తీసుకున్న ఆయన విద్యార్జనకు పేదరికం అడ్డుకాదని నిరూపించారు. బాల్యంలో దారిద్య్రాన్ని ఎదురించి
కెరీర్‌ లో విజయం సాధించిన ఆదర్శ అధికారి ‘‘పురుషోత్తం’’
సక్సెస్‌ స్టోరీ ఇది..

ఇదీ నేపథ్యం..
1965 ఏప్రిల్‌ 12న హైదరాబాద్‌ పాతబస్తీలో పెద్దింటి పార్వతమ్మ- సాయిలు దంపతులకు పురుషోత్తం జన్మించారు. వీరి తల్లిదండ్రులు కష్టజీవులు. ఎస్సీ వర్గానికి చెందిన వీరిది ఉమ్మడి కుటుంబం. 1986 మార్చి 21న సునీతను వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు పవిత్రన్‌, ప్రశాంత్‌ తోపాటు, కూతురు ప్రియాంక ఉన్నారు. పెద్ద కుమారుడు వ్యాపారాలు చూస్తుండగా చిన్న కుమారుడు, కూతురు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. పురుషోత్తం తాత పాపయ్య ఉస్మాన్‌ గంజ్‌లో చిరు వ్యాపారిగా, తండ్రి సాయిలు హైదరాబాద్‌ జంతుప్రదర్శనశాల (జూపార్క్‌)లో ‘మాలి’గా పనిచేశారు. పురుషోత్తం ప్రాథమిక విద్య జేమ్స్‌ స్కూల్‌, బేబీలాండ్‌, బహదూర్‌ పురా పాఠశాలలో కొనసాగింది. పదో తరగతి వివేకవర్ధిని హైస్కూల్లో పూర్తి చేశారు. మాసబ్‌ ట్యాంక్‌ పాలిటెక్నిక్‌ లో ఎల్‌ఏఈ అభ్యసించారు. సాంకేతిక విద్యలో డిప్లొమా పూర్తికాగానే ఆయన ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నించారు. 1994 మార్చి 11న ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌ స్పెక్టర్‌ గా నియామకమయ్యారు. అనంతపురం పోలీస్‌ ట్రైనింగ్‌ కళాశాల (పీటీసీ)లో మూడు నెలలపాటు శిక్షణ పొందారు. తర్వాత నిజామాబాద్‌ లో అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌ స్పెక్టర్‌, ఆ తర్వాత హైదరాబాద్‌ సౌత్‌ జోన్‌ లో విధులు నిర్వహించారు. 2003లో మోటార్‌ వెహికిల్‌ ఇన్‌ స్పెక్టర్‌ (ఎంవీఐ)గా ప్రమోషన్‌ పొంది రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌ లో బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం 2009 నుంచి మూడేళ్లపాటు, హైదరాబాద్‌ వెస్ట్‌ జోన్‌ లో ఎంవీఐగా పనిచేశారు. 2011 నుంచి 2014 వరకు రంగారెడ్డి జిల్లా షాపూర్‌ చెక్‌ పోస్టులో ఇన్చార్జి ఎంవీఐగా సేవలందించారు. రాష్ట్ర విభజన అనంతరం మహబూబ్‌ నగర్‌ జిల్లా అలంపూర్‌ బార్డర్‌ చెక్‌ పోస్టులో విధులు నిర్వర్తించారు. 2015లో రీజినల్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ అధికారి (ఆర్టీవో)గా పదోన్నతి పొంది, మేడ్చల్‌ లో పనిచేశారు. తర్వాత హైదరాబాద్‌ సౌత్‌ జోన్‌ ఆర్టీవోగా బాధ్యతలు నిర్వర్తించి తమ సేవాతత్పరత చాటుకున్నారు. 2019 ఫిబ్రవరి 19న డిప్యూటీ ట్రాన్స్‌ పోర్ట్‌ కమిషనర్‌ గా పదోన్నతి పొందిన పురుషోత్తం ఫిబ్రవరి 20న వరంగల్‌ డీటీసీగా బాధ్యతలు చేపట్టారు.
నేనున్నాను..
ప్రజలకు వేగవంతమైన రవాణా సేవలు అందించడమే లక్ష్యంగా డీటీసీ పురుషోత్తం ముందుకెళ్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ జిల్లాలో దళారుల వ్యవస్థను నియంత్రించారు. ఆర్టీవోలను సమన్వయం చేస్తూ వాహనదారులు, వ్యాపారస్తులు, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నారు. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా.. సమయ స్ఫూర్తితో వ్యవహరిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు, వాటి నివారణ, ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. రోడ్డు భద్రత వారోత్సవాలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తూ, శాఖాపరంగా సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ప్రజలకు ఓ వైపు మెరుగైన సేవలు అందిస్తూనే.. మరో వైపు తన పరిధిలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారు.
ప్రమాదాల నివారణపై..
అతివేగం, అజాగ్రత్తగా వాహనాలు నడపకుండా యువకుల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు తెలియజేస్తూ ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రతీ డ్రైవర్‌ నిబంధనలు పాటించి వాహనాలు నడపాలంటారు పురుషోత్తం. ప్రతి వాహనదారుడు డ్రైవింగ్‌ లైసెన్స్‌, రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంటు, ఇన్సూరెన్స్‌, వాహనానికి ఫిట్‌ నెస్‌ కలిగి ఉంటేనే నడపాలని, పరిమితికి మించి వేగంగా నడుపొద్దంటారు. మద్యం తాగి వాహనం నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సెల్‌ ఫోన్‌ లో మాట్లాడుతూ మ్యూజిక్‌ పెట్టుకొని ప్రయాణించడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. విలాసవంతమైన జీవితం కోసం చిన్న ఉద్యోగి సైతం సరిపోయేంత సంపాదించుకుంటున్న ప్రస్తుత రోజుల్లో ఈ డిప్యూటీ ట్రాన్స్‌ పోర్ట్‌ కమిషనర్‌ మాత్రం ఉన్నత విలువల కోసం శ్రమిస్తున్నారు. తన సర్వీసులో ఆయన అనేక కొత్త వాహనాలను, షోరూంలను ప్రారంభించి రాష్ట్ర ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు.

ప్రొఫైల్‌…
పేరు : పెద్దింటి పురుషోత్తం
హోదా : వరంగల్‌ డిప్యూటీ ట్రాన్స్‌ పోర్టు కమిషనర్‌
పుట్టిన తేది : 12-4-1965
విద్యార్హతలు : లైసెన్స్‌ డ్‌ ఇన్‌ ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ (ఎల్‌ఏఈ)
స్వస్థలం : పాతబస్తీ, హైదరాబాద్‌
తల్లిదండ్రులు : పెద్దింటి పార్వతమ్మ-సాయిలు
వివాహం : 21-3-1986
సతీమణి : సునీత
సంతానం : పవిత్రన్‌, ప్రశాంత్‌, కుమార్తె : ప్రియాంక
స్ఫూర్తి ప్రధాత : రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *