- రాష్ట్ర మంత్రివర్గం అంగీకారం
- ఫలించిన అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కృషి
- వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే చాన్స్
- ప్రజల్లో హర్షాతిరేకాలు..మంత్రికి అభినందనల వెల్లువ
వరంగల్ వాయిస్, వరంగల్ : వరంగల్ నగర పురోభివృద్ధికి రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఇదే కోవలో వరంగల్ జిల్లాలో టెక్నికల్ సెంటర్ ఏర్పాటుకు మంత్రి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 20 టెక్నికల్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించగా, అందులో ఒక టెక్నికల్ సెంటర్ (హబ్) వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలంలోని రంగశాయి పేటలో ఏర్పాటు కానుందనే వార్త వరంగల్ ప్రజలకు గొప్ప ఊరటను కలిగిస్తోంది. మూడు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో మంత్రి సురేఖ పట్టుదలతో చేసిన ప్రయత్నాలతో వరంగల్ లో టెక్నికల్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర మంత్రిమండలి అంగీకారం తెలిపింది.
ఈ టెక్నికల్ సెంటర్ భవన నిర్మాణం, ప్లాంట్, యంత్రాల కూర్పు మొదలైన వాటి కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 200 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. వరంగల్ లో స్థాపించనున్న ఈ సెంటర్ ను విశేషమైన సామర్థ్యంతో నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అధునాతన సాంకేతికను సమకూర్చడం, నైపుణ్యం కలిగిన మానవ వనరుల సృష్టి, సాంకేతిక నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక, వ్యాపార సలహాలు అందించడం వంటి అంశాల్లో ఈ టెక్నికల్ సెంటర్ ప్రభావవంతమైన పాత్ర పోషించున్నది. పలు రకాల పరిశ్రమలకు అవసరమైన సేవలను అనుసరించి టెక్నికల్ సెంటర్ శిక్షణా కార్యక్రమాలను చేపడుతుంది. నిర్మాణ, ఎలక్ట్రికల్, ఫౌండ్రీ, లెదర్, గ్లాస్, స్పోర్ట్స్ వంటి వివిధ రంగాలకు ఈ టెక్నికల్ సెంటర్ల ద్వారా సేవలను అందించనున్నారు.
టెక్నిలక్ సెంటర్ ఏర్పాటు వరంగల్ జిల్లా చరిత్రలో మైలురాయిగా నిలువనుంది. వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే టెక్నిలక్ సెంటర్ (హబ్) ఏర్పాటు ప్రకటనతో వరంగల్ జిల్లా ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పట్టుదలతో వరంగల్ లో టెక్నికల్ సెంటర్ స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించిన మంత్రి సురేఖను ప్రజలు మనసారా అభినందిస్తున్నారు.