లీక్ వార్తలపై చర్య తీసుకోవాలని మంత్రి సబిత ఆదేశం వరంగల్ వాయిస్,హైదరాబాద్: తెలంగాణలో క్వశ్చన్ పేపర్ లీక్స్ కలకలం రేపుతున్నాయి. టీఎస్‌పీఎస్‌సీ నుంచి పదో తరగతి పరీక్షల వరకు పేపర్ లీక్స్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మొదటిరోజే తెలుగు పేపర్ లీక్ అయిన విషయం తెలిసిందే. రెండు రోజు మంగళవారం కూడా హిందీ పేపర్ లీక్ అవ్వడం పెను సంచలనానికి దారితీసింది. హిందీపేపర్ లీక్‌తో తెలంగాణ పదోతరగతి పరీక్షలు రెండోరోజూ వార్తల్లోకి వచ్చాయి. తొలిరోజు వికారాబాద్ జిల్లా తాండూరులో తెలుగు పేపర్ లీక్ అవ్వగా.. మంగళవారం వరంగల్ జిల్లాలో హిందీ పేపర్ లీక్ అయింది. హిందీ క్వశ్చన్ పేపర్ ఉదయం 9.30కే బయటకు వచ్చినట్లు వరంగల్ అధికారులు గుర్తించారు. పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే హిందీ పేపర్ లీక్ అయినట్లు పేర్కొంటున్నారు. లీక్ అయిన హిందీ పేపర్ వాట్సాప్ గ్రూప్‌లలో చక్కర్లు కొడుతోంది. అయితే, ఇది లీక్ కాదు, జస్ట్ సర్క్యులేట్ అంటూ అధికారులు పేర్కొంటున్నారు. అసలు పేపర్లు బయటకు ఎలా వస్తున్నాయో మాత్రం మిస్టరీగా మారింది. కాగా.. వరుసగా పేపర్లు లీక్ అవుతుండటంతో అటు విద్యార్థులు.. తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణలో పేపర్ లీకులు కలకలం రేపుతున్నాయి. హిందీ పేపర్ లీక్ వార్తలపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. హిందీ పేపర్ లీక్ పై వరంగల్ జిల్లా డీఈవో వాసంతి స్పందించారు. ఇవన్ని వదంతులే అని కొట్టిపారేశారు.దీనిపై పోలీస్ కమిషనర్ కు కంప్లయింట్ చేస్తామని తెలిపారు. పదో తరగతి హిందీ పరీక్ష పత్రం లీకేజీపై వస్తున్న వార్తలపై వరంగల్ డీఈవో, హనుమకొండ డీఈవోలు తక్షణమే విచారణ జరుపాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వరంగల్ జిల్లాలో బయటకు వచ్చిన టెన్త్ హిందీ పరీక్ష పేపర్ పై విచారణ చేస్తున్నారు పోలీస్ అధికారులు. బయటకు వచ్చిన పేపర్ అసలుదా.. నకిలీదా.. వాట్సాప్ గ్రూపుల్లో ఎవరు పెట్టారు అనే కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు.