- ఎంపీ డాక్టర్ కడియం కావ్య
వరంగల్ వాయిస్, వరంగల్ : హైదరాబాద్ తర్వాత వరంగల్‌ను పారిశ్రామిక కేంద్రంగా మార్చండి” అని సీఐఐ తెలంగాణ ఇంటరాక్టివ్ సెషన్‌లో పార్లమెంటు సభ్యురాలు (లోక్‌సభ) డాక్టర్ కడియం కావ్య అన్నారు. వరంగల్ నిట్ క్యాంపస్ లో శుక్రవారం సీఐఐ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ మీటింగ్‌తో పాటుగా ఏఐ ఇన్ ఫార్మా: ది ఫ్యూచర్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ఇన్ ఫార్మాలో సీఐఐ మెంబర్‌షిప్ రోడ్ షో, సీఓఈల సేవలను నిర్వహించారు. వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్యతో ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్ జరిగింది. ఇందులో పరిశ్రమలోని ముఖ్య నాయకులు వరంగల్‌పై తమ విజన్‌ను పంచుకున్నారు. సీఐఐ తెలంగాణ చైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సాయి డి ప్రసాద్ ‘Ai in Pharma Session’లో స్వాగత ప్రసంగంలో తెలంగాణ ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ, 2047 బి 1 ట్రిలియన్ USDఆర్థిక వ్యవస్థను చేరుకోవాలనే లక్ష్యాన్ని హైలైట్ చేశారు. దీని కోసం హైదరాబాద్‌పై దృష్టి సారించడం ఒక్కటే సరిపోదు వరంగల్, కరీంనగర్ తదితర పాంత్రాల్లో పారిశ్రామికాభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో ఎడ్యుకేషనల్ హబ్‌గా వరంగల్‌ను పునరుద్ధరించాల్సిన అవసరాన్ని తెలియపరిచారు. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) డిప్యూటీ డ్రగ్స్ కంట్రోలర్ డాక్టర్ ఎ.రాంకిషన్ తన ప్రధాన ప్రసంగంలో వరంగల్, హనుమకొండ ఫార్మా, లైఫ్ సైన్సెస్ హబ్‌గా మారడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని పునరుద్ఘాటించారు. సీఐఐ
సోహ్రాబ్జీ గోద్రెజ్ గ్రీన్ బిజినెస్ సెంటర్ ప్రిన్సిపల్ కౌన్సెలర్ మురళీ కృష్ణ కణ్ణన్ మెంబర్‌షిప్ రోడ్డు షోలో తన ప్రదర్శనలో భారతదేశం అంతటా ఉన్న వివిధ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను హైలైట్ చేశారు. సీఐఐ తెలంగాణ డైరెక్టర్, స్టేట్ హెడ్ మిస్టర్ షేక్ సమీయుద్దీన్, వరంగల్‌కు చెందిన పరిశ్రమ నాయకులకు సీఐఐ సేవలు, సభ్యత్వ వివరాలను వివరించారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ వరంగల్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, యువత, మహిళా సాధికారతపై ఉద్ఘాటించారు. వరంగల్‌లో రోడ్డు, రైల్వే నెట్‌వర్క్, వ్యవసాయం, పర్యాటక,సంస్కృతిని అభివృద్ధి చేయడంపై తన దృష్టి కేంద్రీకరించినట్లు కూడా ఆమె పేర్కొంది. రోజంతా జరిగే కార్యక్రమాలలో వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ, క్రెడాయ్ వరంగల్, ఐఎంఏ వరంగల్ చాప్టర్ పాల్గొన్నాయి.